- హోం మంత్రి ప్రకటన సిద్ధమనడంపై ప్రియాంక గాంధీ ఘాటు విమర్శలు
నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ, దానిపై శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసు బలప్రయోగంపై పార్లమెంట్‌లో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. “ఆయన అసలు సభకు వచ్చారా? ఈ మాట సభలో వచ్చి నేరుగా చెప్పారా?” అని ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ ఎంపీ ప్రణీతి షిండే మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అత్యంత ప్రమాదకరమైన పెల్లెట్ తుపాకులు (Pellet Guns), లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందో హోం మంత్రి సభలో నిలబడి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పార్లమెంట్ కాంప్లెక్స్ వెలుపల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతీ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ప్రభుత్వం సంపూర్ణ సిద్ధంగా ఉందన్నారు. విపక్షాలు కేవలం "అమిత్ షా జవాబ్ దో" అంటూ నినాదాలు చేయడం, సభను స్తంభించడం తప్ప చర్చకు రాకుండా పారిపోతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను ప్రతిరోజు వచ్చి తన ఛాంబర్‌లో కూర్చుంటున్నానని, విపక్షాలు సభను నడవనీయనప్పుడు లోపలికి వెళ్లి ఏం చేయాలని ప్రశ్నించారు. స్పీకర్‌కు లేఖ ఇచ్చి చర్చకు సమయం ఖరారు చేసుకోవాల్సిందిగా సవాలు విసిరారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నప్పటికీ, హోం మంత్రి స్వయంగా సభలోకి వచ్చి ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర హంగామా నెలకొంది.
No comments:
Post a Comment