Saturday, 22 August 2026

అత్త ఇప్పుడు ఓ జ్ఞాపకం



కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అత్త ( గెల్లు ఓదమ్మ - బావ వాళ్ల అమ్మ) మృత్యువుతో పోరాడింది. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడిన అత్త ఎప్పుడూ మంచానికే పరిమితమైంది లేదు. జ్వరం లాంటివి వచ్చినా ఒకటి రెండు రోజుల్లోనే పనికి పోయేది. అక్క దగ్గరికి హిమ్మత్‌నగర్‌కు ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినవ్‌ బిడ్డా రాజు అని పలకరించేది. పిల్లలు అంత మంచిగున్నరా అని అడిగేది. మంచిగ బతుకుతే చాలు బిడ్డ అనేది. ఆమె పలకరింపు లేకుండా నా హిమ్మత్‌నగర్‌ టూర్‌ ముగిసేది కాదు. ఎందుకంటే ఏ రాత్రి అయినా తను వచ్చి మాట్లాడేది. మూడు దశాబ్దాలకు పైగా అత్తతో అనుబంధం శుక్రవారం పొద్దున శేఖర్‌ కాల్‌తో కలగా మిగిలిపోయింది. శుక్రవారం పొద్దుగాల 6.03 గంటలకు శేఖర్‌ నుంచి కాల్‌ రాగానే నా మనసు ఏదో కీడును శంకించింది. బాపమ్మ అని కాలం చేసింది అనగానే కొంతసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఊ అని మాత్రమే అంతే.  అత్త మీద ఎందుకు ఇంత అభిమానం ఎందుకు అంటే కొడుకులు, కోడండ్లు వ్యవసాయ పనులకు పోతే  తల్లి కోడి లెక్క మనుమలను, మనుమరాండ్లను కంటికి రెప్పలా చూసుకునేది. నిజానికి వాళ్లకు జీవిత పాఠాలో బోధించింది ఓదక్కే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గట్టిగా నిలబడాలనే ధైర్యాన్ని వాళ్లకు చిన్నప్పుడే నూరిపోసింది. అందుకే ఓదక్క వాళ్లకు రోల్‌ మోడల్‌ అయ్యింది. 


ఎన్నడూ ధైర్యం చెడని అత్త ఐదు నెలల కిందట అనారోగ్యానికి గురైనప్పుడు కొంత ఆందోళనపడ్డది. జీవిత పోరాటం చివరి దశకు వచ్చిందని ఊహించింది కావొచ్చు. ఇక మనుపటిలా కోలుకుని పని వెళ్లలేను అనుకుని ఉండొచ్చు. జీవితకాలమంతా పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు శ్రమకోర్చే వాళ్లకు ఒక్క పూట ఖాళీగా ఉంటే ఏమీ తోచదు. అట్లాఈ చివరి ఐదు నెలలు హాస్పటల్‌ లో రెండు నెలలు, ఇంటి వద్ద మూడు నెలలుగా మంచం పట్టునే ఉండటంతో మనాదిలో పడింది. హన్మకొండలో డాక్టర్లు  రెండు నెలల చికిత్స అనంతరం వృద్ధాప్యం కారణంగా ఆమె శరీరం సహకరించడం లేదని తేల్చారు. ఇంటికి తీసుకెళ్లమని సూచించారు. పది రోజుల కంటే ఎక్కువ బతకదు అని డాక్టర్లు చెప్పారట. కానీ తన సంకల్పం తన జీవితకాలాన్ని మూడు నెలలకు పెంచింది. తిండి లేదు. నమిలే అవకాశం లేదు. అప్పుడప్పుడు గొంతు తడపడానికి ఇచ్చిన  జ్యూసులు, మంచినీళ్లతోనే మూడు నెలలు మనుగడ సాగించింది. మామ (కనకయ్య) పోయినప్పుడు ఆ లోటు కనిపించలేదు. కానీ మొన్న అత్త ఇక కనిపించదు అన్నప్పుడు ఏదో వెలతి అనిపించింది. ఎప్పుడు వచ్చినవ్‌ బిడ్డా అనే అనే అత్త ఆత్మీయ పిలుపు ఇక వినిపించదు. అత్త ఇప్పుడు ఒక జ్ఞాపకం. ఓదవ్వకు అశ్రునివాళి. 

No comments:

Post a Comment

Featured post

నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌ హవా

చిరంజీవి కెరీర్‌లో ఈ ఐదు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే! టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని మరపురా...