ఐపీఎల్‌లో ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఎంఎస్ ధోనీకి సహచర క్రికెటర్లు భావోద్వేగ సందేశాలతో కృతజ్ఞతలు తెలిపారు. ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం, మైదానంలో ఆడటం, మ్యాచ్‌లను ముగించడం తన కలల్లో ఒకటని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నారు.
2019లో తొలిసారి సీఎస్‌కేలో చేరినప్పుడు ధోనీని దగ్గరగా గమనించే అవకాశం లభించిందని, ఆయన ద్వారా నిరాడంబరతకు నిజమైన అర్థం తెలుసుకున్నానని రుతురాజ్ చెప్పారు. ఎన్ని విజయాలు సాధించినా ధోనీలో కనిపించే సరళత గొప్ప పాఠమని ప్రశంసించారు. “మాహీ భాయ్.. నువ్వు ఎప్పటికీ మా తలైవానే. మా కెప్టెన్, మా నాయకుడివి” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందిస్తూ, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే ధోనీ తీరు, మ్యాచ్‌లను ముగించే నైపుణ్యం, భారత క్రికెట్‌పై ఆయన చూపిన ప్రభావం అసాధారణమని పేర్కొన్నారు. ధోనీ సృష్టించిన వారసత్వాన్ని అందుకోవడం అంత సులభం కాదన్నారు.
మరో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ధోనీ నాయకత్వం, ప్రశాంతత ఎంతోమంది క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఆటగాడిగా ఆయన క్రికెట్‌కు దూరమైనా, ఈ క్రీడపై ఆయన ప్రభావం ఎప్పటికీ కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.
