Sunday, 8 November 2026

నెతన్యాహుకు రాజకీయ ఎదురుదెబ్బ



  •  ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం

ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలినట్లు వార్త వెలువడింది. ప్రతిపక్ష నేత, మాజీ ఆర్మీ చీఫ్‌ గాడీ ఐసెన్‌కోట్‌కు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించేందుకు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఐసెన్‌కోట్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ ప్రకటనకు ముందు అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ నెతన్యాహు, ఐసెన్‌కోట్‌లతో విడివిడిగా సమావేశమై తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం ఐదు గంటలకు అధ్యక్ష భవనంలో జరిగే కార్యక్రమంలో ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారిక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంకీర్ణ కూటమిని నిర్మించేందుకు ఐసెన్‌కోట్‌కు 28 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలోగా మెజారిటీ మద్దతు కూడగట్టలేకపోతే మరో 14 రోజుల పాటు గడువును పొడిగించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది.ఇప్పటివరకు 67 మంది పార్లమెంటు సభ్యులు ఐసెన్‌కోట్‌కు మద్దతు ప్రకటించగా, బెంజమిన్‌ నెతన్యాహుకు 46 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి తాజా నిర్ణయం ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఐసెన్‌కోట్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? కొత్త ప్రభుత్వం ఏయే పార్టీల మద్దతుతో కొలువుదీరనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.


No comments:

Post a Comment

Featured post

“నాన్న చనిపోయారు”

రాజీవ్ గాంధీ హత్య వార్తను సోనియాకు చెప్పిన ప్రియాంక ఆ విషాద క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తన జీవితంలో ...