- నీటి వనరులను పొదుపుగా వినియోగించాలి.. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై ప్రభుత్వం దృష్టి
ఖమ్మం: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం, దీపాలు వెలిగించడం ద్వారా సంఘీభావం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న సమయంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం పెరిగితే పొడి వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రజలు జాగ్రత్తగా వినియోగించాలని ఆయన కోరారు. చెరువులు, కుంటలు, జలాశయాల్లో మిగిలి ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా రానున్న నెలల్లో తాగునీటి కొరతను నివారించవచ్చని సూచించారు.
నీటి కొరత వ్యవసాయ రంగానికే కాకుండా విద్యుత్ రంగంపైనా ప్రభావం చూపుతోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన నీరు, విద్యుత్ అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా, వాటిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సూచనలను విపక్షాలు అందించాలని కోరారు.
