Saturday, 24 October 2026

తెలంగాణలో కరువు నివారణకు రూ.150 కోట్లు

  • మూడు మండలాల్లో శాశ్వత చర్యలు..మిడ్జిల్‌, ఉప్పునుంతల, మక్తల్‌ మండలాల ఎంపిక
  • ప్రజలకు అందే ప్రయోజనాలే ప్రాజెక్టు విజయానికి కొలమానం: పొంగులేటి



హైదరాబాద్‌: తెలంగాణలో కరువు సమస్యను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు మూడు మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందుకోసం రూ.150 కోట్లను కేటాయించినట్లు శనివారం వెల్లడించారు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతాల్లో కరువు ప్రభావాన్ని తగ్గించడం, రైతు కుటుంబాల జీవనోపాధిని పరిరక్షించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.


ఈ పథకం కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉప్పునుంతల, నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ మండలాలను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో గతంలో కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి, వ్యవసాయం ఎంతవరకు వర్షాలపై ఆధారపడి ఉంది, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు, రైతు కుటుంబాల జీవనోపాధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు. జాతీయ విపత్తు నిధి (ఎన్‌డీఎఫ్‌) సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.


సచివాలయంలో శనివారం వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు ప్రభావిత ప్రాంతాలకు దీర్ఘకాలిక పరిష్కారాలు రూపొందించడం, చేపట్టాల్సిన పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం, కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించడం వంటి అంశాలపై చర్చించారు.


ప్రాజెక్టు విజయాన్ని కేవలం ఖర్చు చేసిన నిధులు లేదా పూర్తిచేసిన పనుల సంఖ్య ఆధారంగా అంచనా వేయకూడదని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవంగా ఎంత ప్రయోజనం కలిగింది? కరువు సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం ఎంత పెరిగింది? అన్న అంశాలే కీలకమని పేర్కొన్నారు. కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చకముందే ముందస్తు చర్యలు చేపట్టి, రైతులకు మరియు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక ఉపశమనం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.



No comments:

Post a Comment

Featured post

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2'

 ప్రపంచవ్యాప్తంగా రూ. 666 కోట్లకు పైగా వసూళ్లు న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్క...