సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఇకపై నిరసనలకు అనువైన వేదిక కాదంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అక్కడ తరచూ నిర్వహించే ఆందోళనల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
నిరసనల కోసం జంతర్‌మంతర్‌కు బదులుగా ప్రత్యామ్నాయ వేదికను కేటాయించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో మంగళవారం ప్రధానమంత్రి నివాసం వరకు చేపట్టనున్న పాదయాత్రను ప్రస్తావిస్తూ, గతంలో జూలై 20న చోటుచేసుకున్న పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, స్థానికులకు ఇబ్బందులు కలగడం, అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడడం వంటి అంశాలు కీలకమైనవని పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారుల అభిప్రాయాలను సేకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు. అదే సమయంలో ప్రతిపాదిత పాదయాత్రపై స్పందిస్తూ, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో భద్రతా సిబ్బందికి తెలుసని, వారు విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని వ్యాఖ్యానించారు.