న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో పంజాబ్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
గత ఐదేళ్లలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వ పాలనలో పంజాబ్ ఎన్నడూ లేనంతగా అప్పుల్లో కూరుకుపోయిందని హర్‌సిమ్రత్ కౌర్ అన్నారు. రాష్ట్ర అప్పులు సుమారు రూ.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇంత భారీగా అప్పులు ఉన్నప్పటికీ వాటికి తగ్గట్లుగా కనిపించే ఆస్తులు ఎక్కడా లేవని విమర్శించారు. సమాజంలోని ఏ వర్గానికీ ప్రభుత్వం ఉపశమనం కల్పించలేదని ఆరోపించారు.ముఖ్యమంత్రి నివాసం డ్రగ్స్ కార్యకలాపాలకు కేంద్రంగా మారిందనే విషయం ఇప్పటికే బయటకు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్, ఆమె బావ అత్యాచారం కేసులో జైలులో ఉన్న నిందితుడికి రూ.5 కోట్లు చెల్లించి క్లీన్‌చిట్ ఇప్పించేందుకు ప్రయత్నించారని హర్‌సిమ్రత్ కౌర్ ఆరోపించారు.
మహిళలు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను, ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తున్న సమయంలోనే ఈ వ్యవహారం చోటుచేసుకుందని ఆమె అన్నారు. రెండు నెలల్లో కేసులన్నింటినీ పరిష్కరించేలా నిందితుడితో సంబంధం ఉన్న వ్యక్తులతో చర్చలు జరిపి రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను పంజాబ్-హర్యానా హైకోర్టుకు సమర్పించినట్లు హర్‌సిమ్రత్ కౌర్ తెలిపారు. బాధిత మహిళలకు రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. “హోంమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి భార్య డబ్బులు తీసుకుని ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పుడు పంజాబ్ బాలికలు ఎవరిని ఆశ్రయించాలి?” అని ఆమె ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని హర్‌సిమ్రత్ కౌర్ డిమాండ్ చేశారు. నిందితుడి ఫోన్‌ను పరిశీలించి అందులో ఎంతమంది మహిళలకు సంబంధించిన అభ్యంతరకరమైన సమాచారం ఉందో, ఎంతమందిని ఎక్కడ, ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో వెలుగులోకి తీసుకురావాలని కోరారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుందని, కోర్టు సైతం దీనిపై దృష్టి సారించిందని ఆమె చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయడం లేదని విమర్శించారు.
జాతీయ మహిళా కమిషన్ తన పరిధిలోకి వచ్చే అంశాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని హర్‌సిమ్రత్ కౌర్ తెలిపారు. బాధిత మహిళలను స్వయంగా కలిసి వారికి భద్రత కల్పిస్తామని భరోసా ఇవ్వాలని కమిషన్‌ను కోరినట్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం బాధితులను భయపెట్టేందుకు, బెదిరించేందుకు, కేసులను మూసివేయించేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

No comments:
Post a Comment