- 1.70 లక్షల పేజీల్లో సంచలన వివరాలు
న్యూయార్క్: అమెరికా చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రదాడుల్లో ఒకటైన 9/11 ఘటనకు ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాటి దాడులకు సంబంధించిన పలు కీలక పత్రాలను న్యూయార్క్ నగర యంత్రాంగం బహిర్గతం చేయనుంది. ఈ పత్రాల్లో కొన్నింటిని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పరిశీలించగా.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లు కూలిపోయిన కొన్ని నెలల తర్వాత కూడా అక్కడి గాలిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది.
2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను ఢీకొట్టించారు. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టవర్లు కూలిన అనంతరం భారీగా వెలువడిన దుమ్ము, పొగ న్యూయార్క్ నగరాన్ని కమ్మేసింది. ప్రమాదకరమైన విష పదార్థాలు గాలిలో కలిసినట్లు తరువాత పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
అయితే ఆ సమయంలో అధికారులు గాలి కాలుష్యంపై వచ్చిన ఆందోళనలను పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గాలిలో కాలుష్యం ఉన్నప్పటికీ స్థానిక వ్యాపారాలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించారు. అనంతరం పలువురు బాధితులు ఊపిరితిత్తులు, రక్త సంబంధిత క్యాన్సర్లతో పాటు గుండె, శ్వాసకోశ సమస్యలకు గురైనట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి. ఈ అనారోగ్యాలతో కొందరు మరణించినట్లు కూడా సమాచారం.
పదినెలల తర్వాతా ఆస్బెస్టాస్ ఆనవాళ్లు
దాడి జరిగిన దాదాపు 10 నెలల తర్వాత.. 2002 జులైలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోని శిథిలాల వద్ద పరిశోధకులు దుమ్ము నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించగా క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు.
నాటి వాయు కాలుష్యానికి సంబంధించిన వివరాలను సుమారు 1.70 లక్షల పేజీల పత్రాల్లో నమోదు చేశారు. ఈ పత్రాలను న్యూయార్క్ సిటీ కార్యాలయంలోని 68 బాక్సుల్లో కొన్ని దశాబ్దాలుగా భద్రపరిచారు.
ఈ వివరాలను బహిర్గతం చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై 9/11 హెల్త్‌వాచ్ అనే సంస్థ కోర్టును కూడా ఆశ్రయించింది. దాడి అనంతరం గాలి సురక్షితంగా లేదని నిరూపితమైతే బాధిత కుటుంబాలకు పరిహారం పొందే అవకాశం ఉంటుందని ఆ సంస్థ వాదిస్తోంది.
ఆన్‌లైన్‌లో పత్రాల విడుదలకు ఆదేశాలు
ఈ నేపథ్యంలో సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ వారంలోనే పత్రాలు బహిర్గతం కానున్నాయి.
‘‘ఆ భయంకర ఘటన ఎన్నో జీవితాలను తారుమారు చేసింది. వారందరికీ నేను చేయగలిగింది పారదర్శకత, జవాబుదారీతనాన్ని అందించడమే’’ అని మమ్దానీ పేర్కొన్నారు.
No comments:
Post a Comment