Tuesday, 1 September 2026

హోర్ముజ్ సమీపంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు




  • సముద్రంలో మైన్లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ విఫలయత్నం చేసింది
  • ప్రతీకారం తీర్చుకుంటే మరింత తీవ్రంగా స్పందిస్తామని ట్రంప్ వార్నింగ్


వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా సైన్యం దాడులు ప్రారంభించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని పేర్కొన్నారు.


ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. హోర్ముజ్ సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు భారీ స్థాయిలో, శక్తివంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి సముద్ర మైన్లు లేవని, వాటిని పూర్తిగా తొలగించామని లేదా పేల్చివేశామని పేర్కొన్నారు.


అమెరికా చేపట్టిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే మరింత తీవ్ర స్థాయిలో స్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా.. ఇరాన్‌పై ఇంకా పెద్ద దాడి తమ వద్ద సిద్ధంగా ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఆ దాడి జరిగితే ఇరాన్ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.


అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కూడా దాడులను ధ్రువీకరించింది. తూర్పు కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు అమెరికా దళాలు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లక్ష్యాలపై దాడులు ప్రారంభించాయని తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై, ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అమెరికా సైనికులపై IRGC ఇటీవల జరిపిన దాడుల యత్నాలకు ప్రతిస్పందనగా ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది.


ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు సంబంధించిన వార్తలు ఇరాన్ మీడియాలోనూ వెలువడ్డాయి. దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో ఉన్న అసలుయే పోర్టు నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జిరోఫ్ట్‌లోని పౌర విమానాశ్రయాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రెస్ టీవీ పేర్కొంది. ఖెష్మ్ దీవిలోని ఫిష్‌మీల్ ఫ్యాక్టరీ, ఫిష్ పియర్, సిరిక్ పోర్ట్ అథారిటీకి చెందిన రిగ్ తదితర ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్లు ఆ సంస్థ తెలిపింది.


అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం. శత్రు స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు ఫార్స్ పేర్కొంది. అమెరికా స్థావరాలు, ప్రయోజనాలపై డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది.


తమపై దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదని IRGC ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ హెచ్చరించినట్లు ప్రెస్ టీవీ తెలిపింది. తాజా దాడులకు అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. అమెరికా శత్రువుపై భారీ, నిర్ణయాత్మక దెబ్బలు కొడతామని ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్, ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.

No comments:

Post a Comment

Featured post

డేటా సెంటర్ల హబ్‌గా భారత్

200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధ్యం – పీయూష్ గోయల్  7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని మోడీ నాయకత్వానికి, ప్రజలకు అభినందనలు న్యూఢిల్లీ: డే...