న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశారు. “నా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. 7.8 శాతం వృద్ధి రేటుతో దేశం ఆనందంతో నిండిపోయింది. ప్రజల సంకల్పం, కష్టపడి పనిచేసే తత్వానికి ఇది ప్రతిబింబం. ఇది మన సమష్టి బలానికి నిదర్శనం” అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం సంఘర్షణలతో సతమతమవుతోందని, అన్ని వైపుల నుంచి యుద్ధ వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు సంక్షోభాలు నెలకొన్నాయని, సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. 2020లో కొవిడ్ మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచంలో ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ మాత్రం వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు.
దేశంలో కొందరు నిరాశావాదంలో కూరుకుపోయి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో నిరాశను వ్యాప్తి చేస్తున్నారని మోడీ విమర్శించారు. ఇలాంటి ప్రతికూలతలు, అడ్డంకులను అధిగమించి భారత్ 7.8 శాతం వృద్ధిని సాధించిందని అన్నారు. ఈ పురోగతిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు. “ఈ వేగాన్ని కొనసాగించాలి. ముందుకు సాగుతూనే ఉండాలి. ఇందుకోసం ఆత్మనిర్భర్ భారత్ సాధించడం అత్యంత కీలకం” అని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రజల సంకల్పబలం, సమష్టి కృషితో భారత్‌ను మరింత బలమైన, స్వావలంబన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment