Thursday, 30 July 2026

దక్షిణాది గానకోకిల జమునారాణి కన్నుమూత


  • ‘ఓ దేవదా’ గాయని మధుర స్వరానికి శాశ్వత వీడ్కోలు



దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నేపథ్య గాయని కోకా జమునారాణి కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఓ గొప్ప గాయనిని కోల్పోయింది.

1938లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణి.. ఏడేళ్ల వయస్సులోనే 1946లో విడుదలైన తెలుగు క్లాసిక్ చిత్రం ‘త్యాగయ్య’ ద్వారా సినీ గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 1940ల నుంచి 1960ల వరకు దక్షిణ భారత సినీ సంగీత రంగంలో అగ్రగామి గాయనిగా వెలుగొందారు. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషల్లో కలిపి 6,000కు పైగా పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. 1980ల వరకు కూడా ఆమె గాన సేవలు కొనసాగాయి. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకుడు’ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన “నా నవ్వే దీపావళి” ఆమె చివరి దశలో గుర్తుండిపోయే పాటల్లో ఒకటి. తెలుగులో ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను, చంద్రిరాణి, దేవదాసు, సంతానం, ఆలీబాబా 40 దొంగలు, వద్దంటే పెళ్లి, బడి పంతులు, అన్నదమ్ముడు, బంగారు తిమ్మరాజు వంటి ఎన్నో చిత్రాలకు ఆమె తన స్వరాన్ని అందించారు.


ఆమె ఆలపించిన “ఓ దేవదా”, “చెలియా లేదు” (దేవదాసు), “పద పదవే వయ్యారి గాలిపటమా” (అభిమానం), “నాగమల్లి కోనలోన నక్కింది లేడీ కూన” (బంగారు తిమ్మరాజు), “మామా మామా మామా ఏమే ఏమే భామా” (మంచి మనుషులు), “శారద శారద సిగరెట్టు” (రాముడు-భీముడు), “విరిసే చల్లని వెన్నెల” (లవకుశ) వంటి పాటలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.తెలుగు మాత్రమే కాకుండా తమిళ సినీ పరిశ్రమలో కూడా జమునారాణి విశేష గుర్తింపు పొందారు. విభిన్న భావాలను ఆవిష్కరించే ఆమె గాత్రం, మాధుర్యం, స్పష్టమైన ఉచ్చారణ ఆమెను దక్షిణాది సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

పార్లమెంట్‌లో హైడ్రామా..

 

  • రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు
  • లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లు
  • రాహుల్-బీజేపీ మధ్య మాటల యుద్ధంతో వేడెక్కిన వర్షాకాల సమావేశాలు 



పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించిన సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) సవరణ బిల్లు–2026 చర్చకు రాగా, మరోవైపు రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026తో పాటు ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టారు. అయితే బిల్లుల కంటే ఎక్కువగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలతో సభా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.


లోక్‌సభ ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. అనంతరం గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖల మంత్రులు పత్రాలు సభ ముందుంచారు. భారతదేశం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పోషిస్తున్న పాత్ర, భారత్-బంగ్లాదేశ్ భవిష్యత్ సంబంధాలపై విదేశాంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలను కూడా సభలో ప్రవేశపెట్టారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం సంబంధిత బిల్లును పరిశీలించారు.


రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్న ప్రభుత్వ అత్యున్నత నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి నిబంధనలతో పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని వివరించారు.


బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. "పేపర్ దొంగలు స్వేచ్ఛగా తిరుగుతుంటే, కష్టపడి చదివిన విద్యార్థులే శిక్ష అనుభవిస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం?" అని ప్రశ్నించారు. అసలు దోషులు నవ్వుకుంటూ తిరుగుతుంటే అమాయక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత గంభీరంగా తీసుకుని సమగ్ర సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చ ప్రతిధ్వని గురువారం కూడా కొనసాగింది. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థితో జరిగిన సంభాషణను వివరిస్తూ రాహుల్ ఉపయోగించిన ఒక పదాన్ని స్పీకర్ ఓం బిర్లా సభా రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీ ప్రాథమిక పార్లమెంటరీ నియమాలపై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తూ, దేశ భవిష్యత్తైన యువతను అవమానించేలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని విమర్శించారు.


జూలై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా కాల్పులు జరిగాయని, అందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర స్పష్టంగా స్పందిస్తూ విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని, కాల్పులకు సంబంధించిన ఆదేశాలు మంత్రులు కాదు, మేజిస్ట్రేట్ మాత్రమే జారీ చేస్తారని తెలిపారు. అమిత్ షా కాల్పులకు ఆదేశించారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.


మరోవైపు కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టారు. జూలై 20న విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసు చర్యపై హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై కూడా కేంద్రాన్ని నిలదీశారు. ప్రతీకాత్మకంగా విరాళాల పెట్టెను ఉంచి నిరసన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా అమిత్ షా సభకు వచ్చి ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా, విద్యార్థులపై పెలెట్ గన్స్ వినియోగానికి బాధ్యులైన వారు క్షమాపణ చెప్పాలని, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కపిల్ సిబల్ కూడా ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి మౌనం ఎందుకని ప్రశ్నించారు.


అయితే బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. జేపీ నడ్డా రాజ్యసభలో మాట్లాడుతూ, ప్రతిపక్షం మొదటి రోజు నుంచే సభా కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం నిరంతరం కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తోందని విమర్శించారు. బీజేపీ ఎంపీలు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, గజేంద్ర సింగ్ షెఖావత్ తదితరులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనని కంగనా రనౌత్ వ్యాఖ్యానించగా, గజేంద్ర సింగ్ షెఖావత్ ఎన్నికల పరాజయాల వల్లే కాంగ్రెస్ నిరాశతో ఆధారంలేని ఆరోపణలు చేస్తోందని అన్నారు.


ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ రాజకీయ ఫిరాయింపులను అరికట్టేందుకు కొత్త యాంటీ డిఫెక్షన్ చట్టంపై చర్చ జరపాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభలో రణదీప్ సింగ్ సూర్జేవాలా అయోధ్య శ్రీరామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై అత్యవసర చర్చ కోరారు.


అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఆ రాష్ట్రాల ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివరించగా, బాధిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు వర్గాలు తెలిపాయి.


సభలో పదేపదే నినాదాలు, నిరసనల కారణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై విస్తృత చర్చ ప్రారంభమైంది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ బిల్లుతో ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం పేర్కొనగా, కేవలం చట్టాలు తీసుకురావడం కాకుండా విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని ప్రతిపక్షం అభిప్రాయపడింది.

Wednesday, 29 July 2026

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం



  • హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం
  •  నంది, గాయత్రి పంప్ హౌస్‌లలో మోటార్లు షురూ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ , కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌లోని బాహుబలి మోటార్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఆన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం చేసిన నిరంతర పోరాటానికి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టుదలకు లభించిన విజయంగా ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల మోటార్లను స్టార్ట్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. రైతుల పంట పొలాలకు, తాగునీటి అవసరాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరంతర పోరాటం సాగించారు. ప్రతిపక్షాల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు , రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి మోటార్లను ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసింది.  ప్రస్తుతం అధికారులు పంప్ హౌస్‌లలోని రెండు బాహుబలి మోటార్లను అందుబాటులోకి తెచ్చి, దాని ద్వారా 6,300 క్యూసెక్కుల గోదావరి నీటిని దిగువనున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్) వైపు ఎత్తిపోస్తున్నారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పంప్ హౌస్‌లను ఐడిల్‌గా ఉంచడంపై బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించి, నీటి విడుదల ప్రారంభం కావడంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం పరిధిలోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజాక్షేత్రంలో రైతుల తరఫున నిలబడి పోరాడితే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరి వీడైనా దిగిరాక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించిందని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. 

సీఎం సన్నిహితుడి వేధింపుల వల్లే పెద్ది కి ఈ పరిస్థితి

  •  తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, కాంగ్రెస్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో నిరూపించేందుకు ఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనమని బీఆర్ఎస్ నేత, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి ఈ రకమైన తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫహీం ఖురేషీనే ప్రధాన కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారం వెనుక ఉన్న వివరాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాకు వివరిస్తూ.. నర్సంపేటకు చెందిన కొందరు స్థానిక వ్యాపారవేత్తలు వాసవి బిల్డర్స్‌కు తమ భూమిని విక్రయించారని, అయితే ఆ భూమిపై ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన ఫహీం ఖురేషీ కన్నుపడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాసవి బిల్డర్స్‌కు చెందిన విజయ్ కుమార్ మరియు ఫహీం ఖురేషీ ఇద్దరూ కలిసి సైబరాబాద్‌లోని 'ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్' (EOW) లో ఒక కేసు నమోదు చేయించారని తెలిపారు. అనంతరం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులతో తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యాపారులను వేధిస్తూ.. ప్రతీ విషయంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఏ విధంగానైనా ఆయనను ఈ కేసులో నిందితుడిగా (అక్యూజ్డ్) చేర్చాలనే కుట్రపూరిత ప్లాన్ నడుస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ అక్రమ వేధింపులపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ.. "నా చేతిలో ఏమీ లేదు, ఈ వ్యవహారమంతా ఫహీం ఖురేషీ , ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పర్యవేక్షణలోనే జరుగుతోంది" అని ఆయన చేతులు దులుపుకున్నారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన గురుకులాల్లో బెంకర్ బెడ్ల కుంభకోణంపై సుదర్శన్ రెడ్డి గళమెత్తి వాస్తవాలను బయటపెట్టినందుకే, కక్షపూరితంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ స్థాయి వేధింపులకు పాల్పడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు.

రాహుల్ గాంధీ తనే ఉచ్చులో చిక్కుకున్నారు

 అమిత్ షాపై ఆరోపణలపై కిరణ్ రిజిజు ఘాటు విమర్శలు

న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రెండు కారణాల వల్ల తీవ్ర నిరాశ కలిగించారని ఆయన అన్నారు. పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేతగా ఒక్క నిర్మాణాత్మక అంశాన్ని కూడా ప్రస్తావించలేకపోయారని, బిల్లుపై మాట్లాడాల్సిన సమయంలో అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ సభను తప్పుదారి పట్టించారని విమర్శించారు.



అంతేకాకుండా పార్లమెంటుకు తగని పదజాలాన్ని ఉపయోగించడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నిరాధార ఆరోపణలు చేశారని రిజిజు మండిపడ్డారు. కాల్పులు జరపాలని ఆదేశించే అధికారం హోంమంత్రికీ, మరే ఇతర మంత్రికీ ఉండదని స్పష్టం చేశారు. అలాంటి ఆదేశాలు ఇవ్వడం మంత్రుల పరిధిలో ఉండదని, సంఘటన స్థలంలో ఉన్న మేజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటారని చెప్పారు.

ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి ఇంత ప్రాథమిక విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని రిజిజు వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ తనే తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారని, "తానే తనను ఉచ్చులోకి నెట్టుకున్నారు" అని అన్నారు. ఆయన పరిస్థితి పట్ల తనకు బాధగా ఉందని కూడా పేర్కొన్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రతిపక్ష నేత సభలో నిర్మాణాత్మక చర్చకు తోడ్పడతారని తాను ఎప్పుడూ ఆశిస్తానని, అయితే ఈసారి రాహుల్ గాంధీ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని కిరణ్ రిజిజు విమర్శించారు.

జెన్-జెడ్‌తో భారత రాజకీయ పార్టీల ‘సిట్యుయేషన్‌షిప్’

ఒకప్పుడు రాజకీయపార్టీలు యువతను ఆకర్షించాలంటే ఎన్నికల హామీలు, ఉద్యోగాల ప్రకటనలు, సంక్షేమ పథకాలు సరిపోతాయని భావించేవి. కానీ నేటి జెన్-జెడ్ (1997-2012 మధ్య జన్మించిన తరం) పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ముందుకు వస్తోంది. వీరిని కేవలం హామీలతో గానీ, సోషల్ మీడియా ప్రచారంతో గానీ ప్రభావితం చేయడం అంత సులభం కాదు. వీరి ఆలోచనా విధానం, భాష, ఆశయాలు, నిరసన తెలిపే శైలి, రాజకీయాలపై దృష్టి అన్నీ గత తరాల కంటే విభిన్నంగా ఉండటంతో భారత రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక విచిత్రమైన "సిట్యుయేషన్‌షిప్"లో చిక్కుకున్నాయి. జంతర్ మంతర్‌లో కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఉద్యమం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష సంబంధం లేకుండా, సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని, మీమ్స్‌, వీడియోలు, సృజనాత్మక ప్రచారం, చర్చలు, వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా ఈ తరం తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించగలదని నిరూపించింది.



జెన్-జెడ్‌ను చాలామంది అహంకారంతో కూడిన తరం, సౌకర్యాలు మాత్రమే కోరుకునే యువతగా చిత్రీకరిస్తుంటారు. ఉద్యోగంలో మైక్రో మేనేజ్‌మెంట్ వద్దు, ఇంటి నుంచే పని చేసే అవకాశం ఉండాలి, జాయినింగ్ బోనస్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వంటి డిమాండ్లు వారి స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావిస్తారు. అయితే అదే సమయంలో నిరుద్యోగం, తీవ్రమైన పోటీ, కెరీర్‌పై అనిశ్చితి, పరీక్షలలో అవకతవకలు వంటి అంశాలు వారిలో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహాన్ని కూడా రేకెత్తిస్తున్నాయి. బయటకు ఆత్మవిశ్వాసంగా కనిపించే ఈ తరం లోపల తీవ్రమైన భవిష్యత్ ఆందోళనతో జీవిస్తోంది. అయితే జెన్-జెడ్‌ను ఒకే కోణంలో చూడడం పొరపాటే. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్ కావాలని కలలు కనే యువత ఉన్నారు. మరోవైపు మెట్రో నగరాల్లో ఆధునిక జీవనశైలిని అనుసరించే యువత కూడా ఉన్నారు. కులం, భాష, ఆర్థిక స్థితి, ప్రాంతం వంటి అనేక అంశాల్లో వీరిలో వైవిధ్యం ఉన్నప్పటికీ, ఒక విషయంలో మాత్రం అందరూ ఒకేలా ఉంటారు. తమను ఎవరూ తక్కువ అంచనా వేయడం వీరికి ఇష్టం ఉండదు. తాము సరైందని నమ్మితే ఎంతటి అధికారాన్నైనా ప్రశ్నించడానికి వెనుకాడరు.


సీజేపీ ఉద్యమం మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అధికారికంగా అనుబంధం లేకపోయినా, అవసరమైతే అత్యంత క్రమశిక్షణతో ఉద్యమాన్ని నడిపించగల సామర్థ్యం ఈ తరానికి ఉందని చూపించింది. సోషల్ మీడియా, మీమ్స్‌, స్టాండ్-అప్ కామెడీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, వైరల్ వీడియోలు వీరి రాజకీయ చైతన్యానికి కొత్త వేదికలుగా మారాయి. గతంలో పత్రికల సంపాదకీయాలు, టీవీ చర్చలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని సోషల్ మీడియా కంటెంట్ ఆక్రమిస్తోంది. ఈ మార్పును రాజకీయ పార్టీలు ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా యువతతో అనుసంధానం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సీజేపీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువతకు చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ జెన్-జెడ్‌కు కేవలం ప్రచారం కాదు, తమ మాట వినే నాయకత్వం కావాలి. వారికి ఉపన్యాసాల కంటే సంభాషణ ముఖ్యం. ప్రచారం కంటే పారదర్శకత అవసరం.


జెన్-జెడ్ భాష కూడా రాజకీయ నాయకులకు కొత్త సవాలుగా మారింది. "గ్యాస్‌లైటింగ్", "రెడ్ ఫ్లాగ్", "నో క్యాప్", "బెట్" వంటి పదాలు వీరి రోజువారీ సంభాషణలో భాగమయ్యాయి. అదే సమయంలో భగత్‌సింగ్‌, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి చారిత్రక నాయకుల చిత్రాలను ప్రదర్శిస్తూ, మరోవైపు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో కూడిన వ్యక్తీకరణలను కూడా వినియోగిస్తున్నారు. సంప్రదాయం, ఆధునికత రెండింటినీ కలిపి ముందుకు సాగే ఈ తరం రాజకీయ విశ్లేషకులకు కూడా కొత్త పాఠాలు నేర్పుతోంది. ఈ తరం స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో త్యాగాలకు సిద్ధపడే ఆదర్శవాదులు కాకపోవచ్చు. కానీ తమ హక్కులు, అవకాశాలు, భవిష్యత్తు విషయంలో మాత్రం రాజీ పడే స్వభావం వీరిది కాదు. అందుకే వీరి నిరసనలు భావోద్వేగాల కంటే ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి. పరీక్షల్లో పారదర్శకత, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, మెరుగైన పాలన వంటి అంశాలపై స్పష్టమైన డిమాండ్లతో ముందుకు వస్తున్నారు.


ఇటీవలి తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆర్థికాభివృద్ధి, సంక్షేమ పథకాల పరంగా మంచి పనితీరు కనబరిచినప్పటికీ డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. సోషల్ మీడియాలో చురుకుగా ప్రచారం నిర్వహించిన టీవీకే యువతను ప్రభావితం చేయడంలో విజయవంతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. యువత తమ కుటుంబ సభ్యుల ఓటింగ్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగల స్థాయికి చేరుకుందని ఈ ఎన్నికలు సూచించాయి. భారత రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. జెన్-జెడ్‌ను కేవలం ఓటు బ్యాంకుగా చూడడం, ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకోవడం, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం ద్వారా వారి మద్దతు పొందడం ఇక సాధ్యం కాదు. ఈ తరం ఆలోచనా విధానాన్ని, ఆశయాలను, ఆందోళనలను, కమ్యూనికేషన్ శైలిని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఏర్పడింది.


క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్ నుంచి టీ20 ఫార్మాట్‌కు మారినంత పెద్ద మార్పు ఇప్పుడు భారత రాజకీయాల్లో చోటుచేసుకుంటోంది. పాత రాజకీయ వ్యూహాలు కొత్త తరంపై పనిచేయడం లేదు. జెన్-జెడ్ విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే రాజకీయ పార్టీలు ముందు వారిని అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ "పాలిటికల్ సిట్యుయేషన్‌షిప్" ఎప్పటికీ నిజమైన రాజకీయ సంబంధంగా మారకపోవచ్చు.

కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మరింత దుమారం

 


విద్యార్థులపై తీవ్ర విమర్శలు, మీడియా-సీజేపీతో మాటల యుద్ధం

న్యూఢిల్లీ, జూలై 29: ఇటీవలి విద్యార్థుల ఆందోళనలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సమర్థించుకుంటూ కొత్త వీడియో విడుదల చేయడంతో వివాదం మరింత ముదిరింది. విద్యార్థి నిరసనల్లో పాల్గొన్న జెన్-జెడ్ యువతను ఉద్దేశించి ఆమె "ఫెమీ-నాజీలు", "గట్టర్ ఛాప్" వంటి పదాలను ఉపయోగించగా, కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలతో కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు.

గత కొన్ని రోజులుగా పరీక్షలలో అవకతవకలకు వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని కంగనా వరుస పోస్టులు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే జెన్-జెడ్‌ను "గట్టర్ జనరేషన్"గా, వారి సోషల్ మీడియా రీల్స్‌ను "వాంతులు తెప్పించేలా ఉంటాయి" అంటూ విమర్శించిన ఆమె వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి.

బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో మీడియాపైనే కంగనా తీవ్ర విమర్శలు చేశారు. కొందరు నిరసనకారులు పిల్లలు, మహిళలు, పెద్దల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించారని, అలాంటి "గట్టర్ ఛాప్" ప్రవర్తనను సమాజం ఎప్పటికీ అంగీకరించదని చెప్పారు. పిల్లలు లైంగిక సంకోచానికి గురయ్యేలా చేసే ప్రవర్తనను సమర్థించలేమని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కొందరు నిరసనకారులు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపించిన కంగనా, కొందరు ఆయనను నాయకుడిగా, మరికొందరు కుటుంబ సభ్యుడిగా, ఇంకొందరు దేవుడిగా భావిస్తారని అన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం ఆధునికత కాదని, ఇది ప్రాథమిక సామాజిక మర్యాద అని పేర్కొంటూ, "ఫెమీ-నాజీల ప్రభావానికి లోనై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు" అని యువతకు సూచించారు.

తన వ్యాఖ్యలను విమర్శించిన ఓ మహిళా యాంకర్‌ను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో మరో ఘాటు పోస్టు చేసిన కంగనా, ఆమె వీధుల్లోకి వెళ్లి దుస్తులు విప్పి తిట్లు తిట్టే స్వేచ్ఛను ప్రదర్శించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో వివాదం మరింత ముదిరింది.

మరోవైపు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. యువతపై ఇలాంటి భాష ఉపయోగించడం మానసిక స్థిరత్వం ఉన్న వ్యక్తి లక్షణం కాదని, తన పార్టీ సభ్యులే ఆమెను సీరియస్‌గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం ద్వారా ప్రచారం పొందాలని కంగనా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనికి కంగనా కూడా ఘాటుగానే స్పందించారు. సౌరవ్ దాస్ పూర్తిగా పనిలేని వ్యక్తి అని, 28 ఏళ్ల వయస్సులో కూడా తాను విద్యార్థినేనని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తన వయస్సులో తాను ఇప్పటికే రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని, తాను కొత్త ఎంపీ అయినప్పటికీ సినీ దర్శకురాలు, నటి, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పారు. తనలాంటి బిజీ జీవితాన్ని సౌరవ్ దాస్ వంటి నిరుద్యోగి ఎప్పటికీ అర్థం చేసుకోలేడని విమర్శించారు.

కంగనా వ్యాఖ్యలను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఏఐఎంఐఎం నేతలు తీవ్రంగా ఖండించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు అయిన జెన్-జెడ్ యువతను అవమానించడం ఒక ప్రజాప్రతినిధికి తగదని అన్నారు. యువత తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారికి సంభాషణ ద్వారా సమాధానం చెప్పాలే తప్ప అవమానించడం సరికాదని పేర్కొన్నారు.

నటుడు సోనూ సూద్ కూడా కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు. "జెన్-జెడ్‌ను గట్టర్ జనరేషన్ అని పిలిచి ఉంటే అది చాలా సిగ్గుచేటు. మాట్లాడే ముందు ఆలోచించాలి. ప్రజలు దేవుడి మరో రూపం" అని వ్యాఖ్యానించారు.

జూన్ 20న జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన సీజేపీ నేతృత్వంలోని విద్యార్థి ఉద్యమం జూలై 25న ముగిసింది. ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా కీలక అంశాలపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిరసనలను విరమించారు.

ఇజ్రాయెల్–ఇరాన్ రహస్య చమురు పైప్‌లైన్‌పై మళ్లీ చర్చ

 


హౌతీల దాడులతో సౌదీకి అదే ప్రత్యామ్నాయ మార్గమా?

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా చమురు మౌలిక సదుపాయాలు, ఎర్ర సముద్రంలోని చమురు రవాణా మార్గాలపై వరుస దాడులు కొనసాగిస్తుండటంతో రియాద్‌కు ఐరోపాకు ముడి చమురు ఎగుమతి చేయడం మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్, అప్పటి షా పాలనలో ఉన్న ఇరాన్ కలిసి అత్యంత రహస్యంగా నిర్మించిన ఒక చమురు పైప్‌లైన్ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఐరోపాకు చమురు సరఫరా చేయడానికి ఈ పైప్‌లైన్ కీలక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవలి రోజుల్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ అరామ్‌కోకు చెందిన జజాన్, యాన్‌బు చమురు కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించగా, సౌదీ ప్రభుత్వం పలువురు డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది. రాయిటర్స్ కథనం ప్రకారం జూలై 27న జరిగిన దాడి తర్వాత రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న జజాన్ రిఫైనరీ కార్యకలాపాలను సౌదీ అరామ్‌కో తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ దాడిలో రిఫైనరీకి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్యాసిఫికేషన్ కాంప్లెక్స్, నిల్వ ట్యాంకులు దెబ్బతిన్నాయని, మరమ్మతులు ఆగస్టు మధ్య వరకు కొనసాగే అవకాశముందని పేర్కొంది.

సౌదీ అరేబియా ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని తప్పించేందుకు తూర్పు ప్రాంతాల నుంచి యాన్‌బు వరకు చమురును తరలించే ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌ను వినియోగిస్తోంది. అయితే అక్కడి నుంచి ఐరోపాకు వెళ్లాలంటే బాబ్ అల్-మందెబ్ జలసంధి మీదుగానే చమురు ట్యాంకర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుతం హౌతీల దాడుల కారణంగా ఈ మార్గం కూడా ప్రమాదకరంగా మారడంతో సౌదీ కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని ఎర్ర సముద్ర తీర నగరం ఎయిలాత్‌ను మధ్యధరా సముద్రంలోని అష్కెలాన్‌తో అనుసంధానించే 254 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌పై దృష్టి పడింది. 1960ల చివర్లో అప్పటి ఇరాన్ షా మొహమ్మద్ రెజా పహ్లవీ పాలనలో ఇరాన్ పెట్టుబడులతో, ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో ఈ పైప్‌లైన్‌ను అత్యంత రహస్యంగా నిర్మించారు. అప్పట్లో ఇరాన్ నుంచి ఎయిలాత్‌కు చేరిన ముడి చమురును ఈ పైప్‌లైన్ ద్వారా అష్కెలాన్‌కు తరలించి అక్కడి నుంచి ఐరోపాకు పంపేవారు. ఈ మార్గం ద్వారా సూయజ్ కాలువను పూర్తిగా తప్పించవచ్చనే వ్యూహాత్మక ప్రయోజనం ఉండేది.

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) డీక్లాసిఫై చేసిన పత్రాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు అప్పట్లో అమెరికా కూడా అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం ఇచ్చింది. భారీ సూపర్ ట్యాంకర్లు ఎయిలాత్‌లో చమురును దించి, అక్కడి నుంచి 42 అంగుళాల పైప్‌లైన్ ద్వారా అష్కెలాన్‌కు తరలించి, అక్కడి నుంచి చిన్న నౌకల్లో ఐరోపాకు పంపే విధంగా దీన్ని రూపొందించారు. మొదట ఏడాదికి రెండు కోట్ల టన్నుల చమురును తరలించే సామర్థ్యంతో నిర్మించగా, తర్వాత దానిని ఐదు నుంచి ఆరు కోట్ల టన్నులకు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గం సూయజ్ కాలువ లేదా ఆఫ్రికా దక్షిణ తీరంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా CIA అంచనా వేసింది.

ఈ మౌలిక సదుపాయాలను నిర్వహించే సంస్థ ప్రస్తుతం **యూరప్–ఏషియా పైప్‌లైన్ కంపెనీ (EAPC)**గా కొనసాగుతోంది. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోవడంతో ఈ సంస్థపై ఇజ్రాయెల్ పూర్తిగా నియంత్రణ సాధించింది. అనంతరం స్విట్జర్లాండ్‌లోని మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఇరాన్‌కు 1.1 బిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చినా, శత్రుదేశాల చట్టాల కారణంగా ఆ మొత్తాన్ని చెల్లించలేమని ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలపై 1968లో అమల్లోకి వచ్చిన ప్రత్యేక గోప్యతా నిబంధనలు కొనసాగుతున్నాయి.

ఇజ్రాయెల్ ఇంధన మంత్రి ఎలి కోహెన్ ఇప్పటికే సౌదీ నుంచి ఎయిలాత్ వరకు సుమారు 700 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ నిర్మాణ ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు జే లెట్నీ వెల్లడించారు. 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో విఫలమైన ఒప్పందం తర్వాత ఇలాంటి ప్రతిపాదనను అధికారికంగా ముందుకు తీసుకురావడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రణాళిక పూర్తిగా సౌదీ రాజకీయ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.

ఈ ప్రణాళిక అమలైతే సౌదీ చమురు ముందుగా ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్ ద్వారా యాన్‌బుకు చేరి, అక్కడి నుంచి ట్యాంకర్లు ఎర్ర సముద్రం మీదుగా గల్ఫ్ ఆఫ్ అకాబాలోని ఎయిలాత్‌కు వస్తాయి. అక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా అష్కెలాన్‌కు చేరిన చమురును మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపాకు తరలిస్తారు. ప్రస్తుతం ఈ పైప్‌లైన్ రోజుకు గరిష్ఠంగా 12 లక్షల బ్యారెళ్ల చమురును తరలించే సామర్థ్యం కలిగి ఉంది. అయితే సౌదీ రోజువారీ మొత్తం ఎగుమతులు 60 లక్షల నుంచి 75 లక్షల బ్యారెళ్ల వరకు ఉంటాయి. అందువల్ల ఇది మొత్తం ఎగుమతులకు ప్రత్యామ్నాయం కాకపోయినా, అత్యవసర పరిస్థితుల్లో 5 నుంచి 15 శాతం వరకు చమురును తరలించే సహాయక మార్గంగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే ఈ ప్రణాళిక అమలుకు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎయిలాత్ పోర్టు సామర్థ్యం సౌదీ స్థాయి చమురు ఎగుమతులను నిర్వహించేందుకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. హౌతీల దాడుల కారణంగా ఎయిలాత్ పోర్టు కార్యకలాపాలు ఇప్పటికే 90 శాతానికి పైగా తగ్గిపోయాయని, పెద్ద చమురు ట్యాంకర్లు నిలిపేందుకు లోతు పెంపు, భారీ నిల్వ ట్యాంకులు, అత్యాధునిక భద్రతా వ్యవస్థల కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.

పైప్‌లైన్ భద్రత కూడా మరో ప్రధాన సవాలుగా మారనుంది. గత ఐదేళ్లలో కనీసం 11 సాంకేతిక లోపాలు, తొమ్మిది విధ్వంసక చర్యలు లేదా మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. 2021లో రాకెట్ దాడి కూడా జరిగింది. 2025లో ఇరాన్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లోని బజాన్ చమురు కేంద్రాలు దెబ్బతినగా, కరిష్, లెవియథాన్ గ్యాస్ క్షేత్రాల కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయినప్పటికీ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఒకటి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే సాంకేతిక సమస్యల కంటే రాజకీయ అడ్డంకులే పెద్దవిగా కనిపిస్తున్నాయి. పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటుకు స్పష్టమైన మార్గం కనిపించకపోతే ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ జరగదని సౌదీ అరేబియా పలుమార్లు ప్రకటించింది. గాజాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ఇటీవల సౌదీతో శాంతి సంబంధాలు తన కల అని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ వ్యూహకర్తలు సౌదీతో సంబంధాల సాధారణీకరణ ఎప్పుడనేది మాత్రమే ప్రశ్న, అది జరుగుతుందా లేదా అనేది కాదనే ధోరణితో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సౌదీ మాత్రం పాలస్తీనా అంశంలో పురోగతి లేకుండా ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. అందువల్ల ఈ పైప్‌లైన్ ప్రణాళిక ఇంధన భద్రతకు ఉపయోగపడినా, దాన్ని అమలు చేయడానికి అవసరమైన రాజకీయ అంగీకారం ఇప్పట్లో లభిస్తుందా అన్నది అనిశ్చితంగా ఉంది.

ఇప్పటి ఉపగ్రహ సాంకేతికత, అంతర్జాతీయ వాణిజ్య పర్యవేక్షణ వ్యవస్థల కారణంగా ఇలాంటి చమురు రవాణాను పూర్తిగా రహస్యంగా నిర్వహించడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. చిన్న స్థాయిలో కొంతకాలం గోప్యంగా ఉంచినా, భారీ స్థాయిలో చమురు ప్రవాహాలను దాచడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఒప్పందం కుదిరితే ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముందని, హౌతీలు కూడా ఈ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించడం, సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడం, ఐరోపాకు ప్రత్యామ్నాయ చమురు మార్గాన్ని అందించడం వంటి కారణాలతో అమెరికా మాత్రం ఈ ప్రణాళికకు పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌కు చైనా నుంచి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు


  • అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత రక్షణ బలోపేతానికి భారీ ఒప్పందం



అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరిగిన యుద్ధం తర్వాత తన వైమానిక రక్షణ వ్యవస్థలో బయటపడిన లోపాలను సరిదిద్దుకునేందుకు ఇరాన్ భారీ స్థాయిలో ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో చైనా తయారు చేసిన భుజంపై మోసుకెళ్లే గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలు (MANPADS) కొనుగోలు చేసేందుకు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే కొన్ని వారాల్లో తొలి విడతలో చైనా నుంచి క్షిపణి లాంచర్లు ఇరాన్‌కు చేరనున్నాయని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ముగ్గురు వర్గాలు తెలిపాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం ప్రారంభమైన తర్వాత స్వల్ప శ్రేణి వైమానిక రక్షణను బలోపేతం చేసేందుకు ఇరాన్ చేపట్టిన అతిపెద్ద ప్రయత్నాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు 60 నుంచి 70 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.520-610 కోట్ల మధ్య)గా అంచనా వేస్తున్నారు. ఒప్పందం కింద 300 నుంచి 400 వరకు చైనా తయారు చేసిన QW-12, FN-16 రకం మాన్‌పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు (MANPADS) కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. హాంకాంగ్‌కు చెందిన జోంగ్‌కింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అనే సంస్థ ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిందని వర్గాలు వెల్లడించాయి.


కొన్ని నెలలుగా సాగిన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్, వైమానిక రక్షణ కేంద్రాలపై దాడులు చేయగా, ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. ఈ యుద్ధం వల్ల స్థిరమైన సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలను అత్యాధునిక యుద్ధ విమానాలు, ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాల నుంచి రక్షించడం ఎంత కష్టమో ఇరాన్‌కు స్పష్టమైంది. దీంతో తక్షణమే తరలించగలిగే, చిన్న బృందాలు సులభంగా నిర్వహించగలిగే పోర్టబుల్ వైమానిక రక్షణ వ్యవస్థలను పెంచాలని ఇరాన్ నిర్ణయించినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు.


ఈ ఒప్పందం కుదిరిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ మాత్రం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, చైనా ఎల్లప్పుడూ శాంతి నెలకొల్పేందుకు, ఘర్షణలు ముగిసేందుకు మాత్రమే కృషి చేస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో ఒప్పందంలో మధ్యవర్తిగా పేర్కొన్న సంస్థ కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరోవైపు పాకిస్థాన్ ద్వారా ఈ ఆయుధాలు ఇరాన్‌కు తరలించనున్నట్లు వచ్చిన కథనాలను కూడా పాకిస్థాన్ సైన్యం పూర్తిగా ఖండించింది.


వివిధవర్గాల సమాచారం ప్రకారం తొలి విడత సరఫరా పశ్చిమ చైనాలోని ఉరుమ్కీ నుంచి ప్రారంభమై పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చేరేలా ప్రణాళిక రూపొందించారు. అయితే రవాణా పూర్తిగా విమానాల ద్వారానా లేదా భూమార్గంలోనా అన్న విషయాన్ని వెల్లడించలేదు. ఇదే సమయంలో పాశ్చాత్య నిఘా వర్గాల సమాచారం ప్రకారం QW-12తో పాటు QW-18, QW-19 వంటి మరింత ఆధునిక క్షిపణి వ్యవస్థల కొనుగోలుపైనా ఇరాన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. QW-12, FN-16 క్షిపణులు భుజంపై మోసుకెళ్లే ఇన్‌ఫ్రారెడ్ గైడెడ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ వ్యవస్థలు. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేయగలవు. అవసరమైన చోటుకు వెంటనే తరలించి సైనిక స్థావరాలు, ఇంధన నిల్వలు, వ్యూహాత్మక ప్రాంతాల రక్షణకు వినియోగించవచ్చు. QW-18, QW-19 వంటి తాజా మోడళ్లతో పోలిస్తే QW-12 సామర్థ్యం తక్కువే అయినప్పటికీ, డ్రోన్లు మరియు తక్కువ ఎత్తులో వచ్చే లక్ష్యాలపై సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుందని రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


పాశ్చాత్య నిఘా వర్గాలు, ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం చైనా నుంచి సైనిక సామగ్రి, ద్వంద్వ వినియోగ పరికరాలను మరింత గోప్యంగా తరలించేందుకు భూమార్గాల వినియోగంపైనా ఇరాన్ పరిశీలిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ స్వదేశీ ఆయుధ తయారీతో పాటు విదేశీ సరఫరాదారులపై కూడా ఇరాన్ ఇప్పటికీ ఆధారపడుతోందని ఈ ఒప్పందం మరోసారి స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో చైనా నుంచి యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలుపైనా ఇరాన్ మరో ప్రత్యేక ఒప్పందానికి చేరువలో ఉన్నట్లు గతంలో రాయిటర్స్ వెల్లడించినప్పటికీ, ఆ ఒప్పందం అమలులోకి వచ్చిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక



ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలో భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో బుధవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.


కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జోరు

 


 సెమీస్‌కు సాక్షి చౌదరి, చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు మరోసారి సత్తా చాటుతున్నారు. మహిళల 51 కిలోల బాక్సింగ్ విభాగంలో సాక్షి చౌదరి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రైయర్స్‌ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు చేరడంతో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దీంతో ఈ గేమ్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసుకున్న ఐదో బాక్సర్‌గా నిలిచింది. ఇప్పటికే లవ్లీనా బోర్గొహైన్ (75 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియా ఘంగాస్ (60 కేజీలు), జాదుమణి సింగ్ (పురుషుల 55 కేజీలు) పతకాలు ఖాయం చేసుకున్నారు.

పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. 27 నిమిషాల 49.78 సెకన్లలో రేసును పూర్తి చేసిన గుల్వీర్, ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.

మహిళల 69 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ 227 కిలోల మొత్తం బరువు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకుంది. బర్మింగ్‌హామ్ 2022లో కాంస్యం సాధించిన ఆమెకు ఇది వరుసగా రెండో కామన్వెల్త్ పతకం. గ్లాస్గో గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఏడో పతకం.

దీంతో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.

సంప్రదాయ కళాకారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్‌లో భారతీయ సంప్రదాయ కళారూపాలను ప్రతినిధ్యం వహిస్తున్న కళాకారులను కలుసుకుని వారి కళాఖండాలను పరిశీలించారు. 'ఆర్టిస్ట్స్-ఇన్-రెసిడెన్స్' కార్యక్రమంలో భాగంగా బనారస్ మ్యూరల్, థాంకా, నాయక, కేరళ మ్యూరల్, బసోహ్లీ, సుర్‌పూర్, మైసూర్ వంటి 12 సంప్రదాయ కళారూపాలకు చెందిన కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లో నివసిస్తూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం భారత కళా సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పడమే కాకుండా, జీవంతంగా కొనసాగుతున్న సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నంగా రాష్ట్రపతి భవన్ పేర్కొంది.



'నషా ముక్త యువ–వికసిత్ భారత్'

 


ఆదివారంప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్' జాతీయ ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ బుధవారం వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువత పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే వారందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని 'నషా ముక్త ప్రతిజ్ఞ' చేయనున్నట్లు చెప్పారు.

100 వారాల పాటు దేశవ్యాప్తంగా సాగే ఈ ప్రజా భాగస్వామ్య ఉద్యమం ద్వారా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఆదివారం యువత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 'మై భారత్' వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్), యువజన సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు 'మై భారత్' వేదిక ద్వారా నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన చట్టబద్ధ రక్షణ

 

  • రాజ్యసభలో జాతీయ గౌరవ పరిరక్షణ సవరణ బిల్లు ఆమోదం

'వందే మాతరం'కు జాతీయ గీతం 'జనగణమన'తో సమాన చట్టబద్ధ రక్షణ కల్పించే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు–2026ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. 1971లో అమల్లోకి వచ్చిన జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు చేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, ఉద్దేశపూర్వకంగా 'వందే మాతరం'ను అవమానించడం, ఆలపించకుండా అడ్డుకోవడం లేదా దాని గానం జరుగుతున్న సమయంలో అంతరాయం కలిగించడం జాతీయ గీతాన్ని అవమానించినట్లుగానే నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, ఇది కేవలం చట్టసవరణ మాత్రమే కాదని, భారత జాతీయ చైతన్యం, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర్య సమర ఆదర్శాల పట్ల దేశం కలిగి ఉన్న సామూహిక నిబద్ధతకు ప్రతీక అని అన్నారు. 1971లో తీసుకొచ్చిన చట్టం ద్వారా జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం 'జనగణమన'కు గౌరవాన్ని పరిరక్షించే నిబంధనలు తీసుకొచ్చామని, ఇప్పుడు అదే రక్షణను 'వందే మాతరం'కూ కల్పిస్తున్నామని తెలిపారు. ఇకపై 'వందే మాతరం'ను ఉద్దేశపూర్వకంగా అవమానించినా, అడ్డుకున్నా ప్రస్తుతం జాతీయ గీతానికి ఉన్న చట్టాల ప్రకారమే శిక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 'వందే మాతరం' చరిత్రను కూడా మంత్రి ప్రస్తావించారు. 1875లో బంకిమ్ చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని గుర్తుచేశారు. 1935లో జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 'వందే మాతరం'ను కేవలం రెండు చరణాలకు మాత్రమే పరిమితం చేశారని ఆరోపించారు. అయితే 1928లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ గీతానికి సంపూర్ణమైన, గౌరవప్రదమైన సంగీత రూపాన్ని సిద్ధం చేయాలని తిమిర్ బరన్ బెనర్జీని కోరారని చెప్పారు. అలాగే 1947 ఆగస్టు 15 ఉదయం స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆకాశవాణి ద్వారా పూర్తి 'వందే మాతరం'ను పాడాలని సర్దార్ వల్లభభాయ్ పటేల్, పండిట్ ఓంకార్‌నాథ్ ఠాకూర్‌ను కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

1950 జనవరి 24న రాజ్యాంగ సభలో తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటనను కూడా నిత్యానంద్ రాయ్ ప్రస్తావించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన 'వందే మాతరం'కు 'జనగణమన'తో సమాన గౌరవం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారని పేర్కొన్నారు. 'వందే మాతరం'ను వ్యతిరేకించడం దేశ గౌరవాన్ని దెబ్బతీసే ప్రసన్నీకరణ రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

చర్చను ప్రారంభించిన బీజేపీ ఎంపీ డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 123 సంవత్సరాలుగా 'వందే మాతరం'ను అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ గీతం స్ఫూర్తితోనే అనేక మంది విప్లవకారులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. 1923లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు 'వందే మాతరం'ను అవమానించారని ఆరోపించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గొల్ల బాబూరావు ఈ బిల్లును స్వాగతిస్తూ, జాతీయ గీతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందన్నారు. 'వందే మాతరం' కేవలం ఒక పాట మాత్రమే కాదని, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రాణత్యాగాలకు స్ఫూర్తినిచ్చిన జాతీయ చైతన్య గీతమని పేర్కొన్నారు. ఈ గీతం స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిందని చెబుతూ బిల్లును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేడీకి చెందిన సులతా దేవో, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఏఐఏడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం. తంబిదురై తదితరులు కూడా చర్చలో పాల్గొన్నారు.

బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టగా, సభ్యులు పలు అత్యవసర ప్రజా సమస్యలను ప్రస్తావించారు. అనంతరం సభను గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.



అమిత్ షాపై రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో దుమారం


  • క్షమాపణ డిమాండ్‌తో ప్రతిష్ఠంభన
  • మూజువాణి ఓట్‌తో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం


లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జూలై 20న కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా నిరసనకారులపై కాల్పులు జరపాలని అమిత్ షానే ఆదేశించారని రాహుల్ గాంధీ ఆరోపించడంతో అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎన్డీయే సభ్యులు స్పీకర్‌ను కోరగా, ఈ అంశంపై ఏర్పడిన ప్రతిష్ఠంభనతో సభ సజావుగా సాగలేదు. చివరకు ప్రతిపక్ష నిరసనల మధ్యే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను మూజువాణి ఓట్ ద్వారా లోక్‌సభ ఆమోదించింది.



పార్లమెంటువర్గాల సమాచారం ప్రకారం.. బిల్లుపై చర్చ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ అమిత్ షాపై ఈ ఆరోపణలు చేశారు. వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లేచి, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు, ఆ వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రిజిజు అభిప్రాయానికే మద్దతు తెలిపారు. ఈ ఘటనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో, రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని పూర్తి చేయకముందే మధ్యాహ్నం సుమారు 1.40 గంటలకు లోక్‌సభను వాయిదా వేశారు. అనంతరం కిరణ్ రిజిజు పార్లమెంట్ భవనంలో అమిత్ షాను కలిసి పరిణామాలను వివరించారు. ఆ సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ మీడియా ఇన్‌చార్జ్ అనిల్ బలూనీ, పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా పాల్గొన్నారు.


తర్వాత రిజిజు స్పీకర్ ఓం బిర్లాను కలిసి అధికారికంగా నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కే.సీ. వేణుగోపాల్, గౌరవ్ గోగోయ్ కూడా స్పీకర్‌ను కలిసేందుకు వచ్చారు. స్పీకర్ ఆదేశాల మేరకు రిజిజు తిరిగి సమావేశానికి హాజరై కాంగ్రెస్ నేతల సమక్షంలో చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆదేశాల మేరకే కాల్పులు జరిగాయని చెప్పడం అత్యంత తీవ్రమైన, సున్నితమైన ఆరోపణ అని, దీనిపై రాహుల్ గాంధీ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని రిజిజు స్పష్టం చేసినట్లు సమాచారం.


మరోవైపు, రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. అయితే క్షమాపణ చెప్పే వరకు సభను ముందుకు సాగనివ్వబోమని రిజిజు స్పష్టం చేసినట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. అనంతరం రిజిజు మరోసారి అమిత్ షాను కలిసి తాజా పరిణామాలను వివరించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోతే ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం అనంతరం బిల్లును ఆమోదించాలని అధికార పక్షం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మాట్లాడాల్సిన ప్రతిపక్ష సభ్యులు ఇంకా ఉన్నప్పటికీ, వారికి అవకాశం ఇవ్వకుండా బిల్లును ముందుకు తీసుకెళ్లారు.


మధ్యాహ్నం 3 గంటల తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పుడు జితేంద్ర సింగ్ చర్చకు సమాధానం ఇవ్వడానికి లేచారు. అయితే కాంగ్రెస్ సభ్యులు సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీకి ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్యే జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఒక్కొక్కటిగా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీకి పాలనా వ్యవహారాలపై అవగాహన లేదని వ్యాఖ్యానించిన జితేంద్ర సింగ్, కాల్పులు జరపాలనే ఆదేశాలు ఇచ్చే అధికారం ఏ మంత్రికీ ఉండదని స్పష్టం చేశారు. అలాంటి అధికారాలు కేవలం  మేజిస్ట్రేట్ లేదా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)కే ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా, జూలై 20న జరిగిన ఘటనలో ఎలాంటి కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే ప్రయోగించామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. కాల్పులే జరగనప్పుడు వాటికి ఆదేశాలు ఇచ్చారనే ప్రశ్నే తలెత్తదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను వాయిస్ ఓట్ ద్వారా లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మధ్యాహ్నం 3.25 గంటలకు సభను గురువారానికి వాయిదా వేశారు.

Tuesday, 28 July 2026

విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే లక్ష్యం


  • పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుపై లోక్‌సభ జితేంద్ర సింగ్


ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026 విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ బిల్లును ఆయన మంగళవారం లోక్‌సభలో చర్చ కోసం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన దీనిని భారత పార్లమెంట్ చరిత్రలో ఒక "మైలురాయి చట్టం"గా అభివర్ణించారు.నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2024లో తీసుకొచ్చిన ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) చట్టానికి ఇది సవరణ అని జితేంద్ర సింగ్ తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేశారు.



గత చట్టంతో పాటు ప్రస్తుత సవరణలు కూడా దేశంలోని విద్యార్థులు, యువత భవిష్యత్తును రక్షించేందుకు ప్రభుత్వం చూపుతున్న గట్టి నిబద్ధతకు నిదర్శనమని జితేంద్ర సింగ్ అన్నారు. భారత యువత భవిష్యత్తుతో ఎవరూ చెలగాటం ఆడకుండా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి ఈ బిల్లు ప్రతిరూపమని పేర్కొన్నారు. అందువల్ల ఈ చట్టాన్ని భారత పార్లమెంట్ చరిత్రలో కీలకమైన మైలురాయి చట్టంగా పరిగణించవచ్చని చెప్పారు.ఈ సవరణల ప్రధాన ఉద్దేశం చట్టాన్ని మరింత కఠినతరం చేయడం, వేగవంతమైన న్యాయం అందించడం ద్వారా పోటీ పరీక్షలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం అని మంత్రి వివరించారు.


కొత్త ప్రతిపాదనల ప్రకారం పరీక్షల్లో అక్రమ మార్గాలకు పాల్పడే వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న కనీస మూడేళ్ల జైలు శిక్షను ఐదేళ్లకు పెంచనున్నారు. గరిష్ఠ శిక్షను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచే ప్రతిపాదన ఉంది. అలాగే గరిష్ఠ జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచనున్నారు.పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సేవా సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాంటి సంస్థలకు గరిష్ఠ జరిమానాను రూ.5 కోట్లకు పెంచడంతో పాటు, ప్రజా పరీక్షలు నిర్వహించకుండా నిషేధించే కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పెంచాలని ప్రతిపాదించారు.వ్యవస్థీకృత పరీక్షల నేరాలకు సంబంధించి మరింత కఠిన నిబంధనలు తీసుకురానున్నారు. ప్రస్తుతం కనీసం ఐదేళ్లుగా ఉన్న జైలు శిక్షను ఏడేళ్లకు పెంచనున్నారు. గరిష్ఠ శిక్ష పదేళ్లుగానే కొనసాగుతుంది. జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచే ప్రతిపాదన ఉంది.


పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా ఈ బిల్లు కల్పిస్తుంది. కొత్తగా ప్రతిపాదించిన సెక్షన్ 12ఏ ప్రకారం దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, ఛార్జిషీట్ దాఖలైన మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించారు. ప్రతి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.


పరీక్షల అక్రమాల కేసుల్లో త్వరితగతిన న్యాయం అందించడం ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావించిన అంశమని జితేంద్ర సింగ్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అయినా దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల హయాంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలను కూడా జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఒకే జాతీయ పరీక్షా సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే వచ్చిందని గుర్తుచేశారు.2009లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు, 2011లో ఆల్ ఇండియా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, 2012లో ఏఐఐఎంఎస్ న్యూఢిల్లీ ప్రవేశ పరీక్ష, 2013లో మహారాష్ట్ర సెకండరీ సర్టిఫికెట్ పరీక్ష వంటి పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ బీఈడీ ప్రవేశ పరీక్ష, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షల్లోనూ అక్రమాలు వెలుగుచూశాయని వివరించారు.


దేశంలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ వంటి ప్రధాన నియామక సంస్థలు ఉన్నాయని, ఉన్నత విద్య ప్రవేశాల కోసం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను 2017లో తమ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని తెలిపారు.1992లో తొలిసారిగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒకే జాతీయ పరీక్షా సంస్థ ఏర్పాటు చేయాలనే సిఫార్సు వచ్చిందని, 2010లో యూపీఏ హయాంలో కూడా ఒక కమిటీ ఇదే సూచన చేసిందని చెప్పారు. కానీ ఆ సమయంలో ఈ ప్రతిపాదనను ఎందుకు అమలు చేయలేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాము గతంలో పూర్తి చేయాల్సిన అసంపూర్తి పనిని ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తి చేసిందని జితేంద్ర సింగ్ అన్నారు.


ప్రధానిని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు

 

పేపర్ లీక్‌లపై కేంద్రానికి అఖిలేశ్ ఘాటు విమర్శలు

ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలను ప్రస్తావిస్తూ, "ప్రధానిని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు" అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యార్థుల ఆందోళనల ఒత్తిడికే ప్రభుత్వం తలవంచి వారి డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చిందని అన్నారు.

లోక్‌సభలో మాట్లాడుతూ విద్యార్థుల ఉద్యమాన్ని అఖిలేశ్ యాదవ్ అభినందించారు. మొదట సరదాగా ప్రారంభమైన ఉద్యమం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారి, చివరకు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం గతంలో ప్రజలకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదని, కానీ విద్యార్థుల ఉద్యమం కారణంగా వారి నిరసనలను అనుమతించాల్సి వచ్చిందని అన్నారు.



"సర్కార్ భీ ఝుక్తీ హై, ఝుకానే వాలా చాహియే" (ప్రభుత్వం కూడా తలవంచుతుంది... కానీ దాన్ని తలవంచించే శక్తి ఉండాలి) అంటూ విద్యార్థుల పోరాటాన్ని ప్రశంసించారు. ప్రభుత్వాన్ని ప్రజల మాట వినేలా చేయడంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఆందోళనకారులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కేంద్రం తప్పకుండా అమలు చేస్తుందని ఆశిస్తున్నానని అఖిలేశ్ అన్నారు. అయితే ఈ ప్రభుత్వం హామీల కంటే "జుమ్లాలు" (ఖాళీ మాటలు) చెప్పడంలోనే ముందుంటుందని విమర్శించారు.

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తాను అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలాన్ని ప్రత్యక్షంగా చూడలేదని, కానీ గత వారం ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, ఇనుప రాడ్లు, విద్యుత్ బాటన్లతో దాడులు, పెల్లెట్ గన్స్ వినియోగం చూస్తే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చాయని వ్యాఖ్యానించారు.

2024లోనే పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ అక్రమాలు ఆగలేదని, ఇప్పుడు అదే చట్టానికి మళ్లీ సవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఫలితాలను ఇవ్వలేకపోయిందని విమర్శించారు.

ఈ సందర్భంగా అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దొంగతనం ఆరోపణలను కూడా అఖిలేశ్ యాదవ్ ప్రస్తావించారు. రామమందిర విరాళాల దొంగతనాన్ని అడ్డుకోలేని ప్రభుత్వం, ప్రశ్నపత్రాల లీక్‌లను కూడా అరికట్టలేకపోయిందని ఆరోపించారు. రామమందిర విరాళాల దుర్వినియోగానికి బాధ్యులైనవారే పేపర్ లీక్‌లను కూడా నిరోధించడంలో విఫలమయ్యారని అన్నారు.

రాంపూర్‌లోని జౌహర్ విశ్వవిద్యాలయానికి కూల్చివేత నోటీసులు జారీ చేసిన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. కొత్త విశ్వవిద్యాలయాలు నిర్మించలేని ప్రభుత్వం, ఇప్పుడు ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని బుల్డోజర్లు, సుత్తులతో కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఏటా ఒక కొత్త పేపర్ లీక్ కుంభకోణం వస్తోంది


  • కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు!


ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నప్పటికీ, పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్మరించలేమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్‌సభలో విమర్శించారు. పరిపాలన అనేది ప్రచార శీర్షికలతో కాకుండా ఫలితాలతో కొలవబడుతుందని పేర్కొంటూ, ప్రభుత్వం ప్రతి ఏడాది కొత్త వ్యవస్థ తీసుకొస్తామని హామీ ఇస్తున్నా, విద్యార్థులకు మాత్రం ప్రతి ఏడాది అదే పాత పేపర్ లీక్ కుంభకోణాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు.



లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ, పరీక్షల పేర్లు మారుతున్నాయని, బాధితుల పేర్లు మారుతున్నాయని, నిందితుల పేర్లు కూడా మారుతున్నాయని, కానీ నేరాలు మాత్రం మారడం లేదని, అలాగే ప్రభుత్వం కూడా మారడం లేదని విమర్శించారు. దేశంలో ఉపగ్రహాలను పర్యవేక్షించగలమని, క్షిపణులను గుర్తించగలమని, సైబర్ భద్రతను కాపాడగలమని ప్రభుత్వం చెబుతోందని, అయితే గోప్యమైన ప్రశ్నపత్రాలు మాత్రం ప్రభుత్వానికి తెలియకముందే బయటకు వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు.


నీట్ (Re-NEET) పరీక్ష కోసం ప్రశ్నపత్రాలను భారత వైమానిక దళానికి చెందిన విమానాల్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేసిన అభిషేక్ బెనర్జీ, యువతకు ఇలాంటి ప్రదర్శనలు అవసరం లేదని, వారికి కావాల్సింది కేవలం పారదర్శకత, న్యాయమైన పరీక్షల వ్యవస్థ మాత్రమేనని అన్నారు.


పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థుల మాట వినాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారికి బదులుగా బ్యారికేడ్లు, లాఠీలు, పెల్లెట్ గన్స్‌తో సమాధానం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. విద్యార్థులు పోటీని చూసి భయపడరని, అవినీతినే భయపడతారని అన్నారు. ప్రతిభను చూసి కాదు, వ్యవస్థలో జరిగే అక్రమాలను చూసే భయపడుతున్నారని పేర్కొన్నారు. పరీక్షలను కాదు, పరీక్షల నిర్వహణ వ్యవస్థనే యువత అనుమానిస్తోందని చెప్పారు. యువతకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తే, ప్రజాస్వామ్యమే బలహీనపడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు ప్రభుత్వ సానుభూతిని కోరుకోవడం లేదని, న్యాయం జరిగే వ్యవస్థపై భరోసా కోరుతున్నారని స్పష్టం చేశారు.

పరీక్షల సంస్కరణల్లో ప్రధాని సక్సెస్


  • మోదీ సరిగ్గా గుర్తించి చట్టంతో పరిష్కారం చూపారు
  •  జెన్-జెడ్ పదంతో కొత్త పరీక్షల చట్టాన్ని ప్రశంసించిన బన్సూరి స్వరాజ్



ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ జెన్-జెడ్ తరంలో ప్రాచుర్యం పొందిన "క్లాక్డ్ ఇట్" (Clocked It) అనే పదాన్ని ఉపయోగించారు. పరీక్షల వ్యవస్థలోని సమస్యలను ప్రధాని మోదీ సరిగ్గా గుర్తించి, వాటికి చట్టపరమైన పరిష్కారాన్ని అందించారని ఆమె వ్యాఖ్యానించారు. జెన్-జెడ్ భాషలో "క్లాక్డ్ ఇట్" అంటే ఒక అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సరైన పరిష్కారం చూపడం లేదా "కరెక్ట్‌గా గుర్తించారు", "అచ్చం సరైన నిర్ణయం తీసుకున్నారు" అనే అర్థంలో ఉపయోగిస్తారు.


ఈ బిల్లును "పరివర్తనాత్మక సవరణ"గా అభివర్ణించిన బన్సూరి స్వరాజ్, ఇది కేవలం అవసరమైన చట్టం మాత్రమే కాదని, ప్రస్తుత కాలం కోరుతున్న అత్యవసర సంస్కరణ అని పేర్కొన్నారు. ఈ బిల్లు మోదీ ప్రభుత్వ సున్నితత్వానికి, బాధ్యతాయుతమైన పాలనకు నిదర్శనమని అన్నారు.


పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయితే కేవలం విద్యార్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆమె చెప్పారు. పేపర్ లీక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ "పెద్ద నేరం"గా అభివర్ణించారని గుర్తుచేస్తూ, అది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదని, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పమే ఈ సవరణ బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకు వచ్చిందని వివరించారు.


ఈ బిల్లు విద్యార్థులకు న్యాయం జరిగేలా హామీ ఇస్తోందని బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధన ఇందులో ఉందని చెప్పారు. దర్యాప్తు సంస్థలు రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మూడు నెలల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని బిల్లు నిర్దేశిస్తోందన్నారు. ఈ కేసులను మాత్రమే వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పేపర్ లీక్ కేసుల్లో అవసరం లేని వాయిదాలు ఇవ్వకుండా ప్రత్యేక కోర్టులు విచారణ జరపాలని బిల్లులో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు.


వేగవంతమైన విచారణతో పాటు పేపర్ లీక్ నిందితులపై శిక్షలను కూడా మరింత కఠినతరం చేసినట్లు ఆమె వివరించారు. సాధారణ నిందితులకు ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఐదేళ్ల కనీస శిక్షగా, గరిష్ఠంగా పదేళ్ల వరకు పెంచారని చెప్పారు. పరీక్షల నిర్వహణలో భాగమైన సేవా సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఎనిమిదేళ్లపాటు పరీక్షల నిర్వహణ నుంచి అనర్హత విధించే నిబంధనను కూడా చేర్చినట్లు తెలిపారు.


పేపర్ లీక్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాల ప్రమేయం ఉంటే కనీస జరిమానాను రూ.10 కోట్లుగా నిర్ణయించారని, ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఈ సవరణలు ప్రతిభను కాపాడటంతో పాటు, పరీక్షల పారదర్శకతను నిలబెట్టి, భారత యువత కలలను రక్షిస్తాయని బన్సూరి స్వరాజ్ అన్నారు. ఇది బాధ్యతాయుతమైన మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సమర్థవంతమైన సంస్కరణ అని ఆమె పేర్కొన్నారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ సమస్య 2014 తర్వాతే ప్రారంభమైనట్లు ప్రతిపక్షాలు తప్పుడు కథనాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం యూపీఏ ప్రభుత్వ హయాంలో, అలాగే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో సుమారు 22 పేపర్ లీక్ ఘటనలు నమోదయ్యాయని చెప్పారు. పంజాబ్‌లో ఫార్మాస్యూటికల్ పరీక్షలో హైటెక్ పద్ధతిలో పేపర్ లీక్ జరిగిన విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.


ప్రతిపక్షాల ఆగ్రహం ఎంపిక చేసిన అంశాలకే పరిమితమైందని విమర్శించిన బన్సూరి స్వరాజ్, పంజాబ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరారా అని ప్రశ్నించారు. అలాగే 2014కు ముందు దేశంలో జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించే ప్రత్యేక సంస్థే లేదని, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) 2017లోనే ఏర్పాటు చేయబడిందని ఆమె గుర్తుచేశారు.

"విద్యార్థులు ఉగ్రవాదులా?"

 

నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంక గాంధీ

ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఢిల్లీలో పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్, లాఠీచార్జ్, వాటర్ కెనన్లు ఉపయోగించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. దేశ యువతపై ఇలాంటి బలప్రయోగం ఎందుకు చేశారని, విద్యార్థులు ఉగ్రవాదులా అని ఆమె నిలదీశారు.



లోక్‌సభలో మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీలతో దాడి చేయడం, వాటర్ కెనన్లను ప్రయోగించడం ఎందుకు అవసరమైందని ప్రశ్నించారు. యువతులను అవమానించడం, వారి దుస్తులు చించివేయడం, దారుణంగా కొట్టడం ఎందుకు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ యువతపై పెల్లెట్ గన్స్, ఏకే-47 తుపాకులు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, "వాళ్లు ఉగ్రవాదులా?" అని వ్యాఖ్యానించారు.

ఈ చర్యలకు ఆదేశాలు ఎవరు ఇచ్చారని కేంద్ర హోంమంత్రిని సమాధానం చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, పెల్లెట్ గన్స్ ప్రయోగించమని ప్రధానమంత్రి ఆదేశించారా? లేక హోంమంత్రి ఆదేశించారా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ప్రశ్న కేవలం కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదని, దేశ ప్రజలందరూ సమాధానం కోరుతున్నారని పేర్కొన్నారు.

జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అల్లర్ల నియంత్రణ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పోలీసులు దాడి చేయడంతో నిరసనకారులు అక్కడి నుంచి పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నిరసనలు ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాలకు విస్తరించాయి. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆందోళనలను విరమించారు.

దేశంలోని తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మొత్తం దేశమే ఈ ఘటనపై సమాధానం కోరుతోందని ప్రియాంక గాంధీ అన్నారు. దేశ యువతను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. యువత గళాన్ని అణిచివేసే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు.

ఇటీవలి రోజుల్లో వేలాది మంది విద్యార్థులు మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, శాంతియుతంగా పాటలు పాడుతూ, చిరునవ్వుతో తమ నిరసనను వ్యక్తం చేశారని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ గళాన్ని వినిపించే హక్కును వారు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రెండు రోజులకే ఆయన పార్లమెంట్‌కు వచ్చినప్పుడు అధికార పార్టీ ఎంపీలు "జిందాబాద్" నినాదాలతో స్వాగతం పలకడాన్ని కూడా ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అవమానకర పరిస్థితుల్లో రాజీనామా చేసిన మాజీ విద్యాశాఖ మంత్రిని సూపర్ స్టార్‌లా స్వాగతించడం ఎంత విరుద్ధమైన పరిస్థితో చూడాలని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, జూలై 20న జరిగిన నిరసనల్లో భద్రతా సిబ్బంది ప్రయోగించిన పెల్లెట్ గన్ వల్ల గాయపడినట్లు ఆరోపిస్తున్న విద్యార్థి సహిల్ లోచబ్‌ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గత శుక్రవారం మీడియా ముందుకు తీసుకొచ్చారు. శాంతియుతంగా చేతిలో జాతీయ పతాకంతో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తన సోదరుడికి పెల్లెట్ గన్ తాకిందని సహిల్ సోదరి చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అనంతరం సహిల్ గాయాలను మీడియాకు చూపిస్తూ, నిరసనకారులపై బలప్రయోగం జరిగిందని ఆరోపించారు.

'అత్యాచార నిందితుల సమర్థకుడికి విద్యాశాఖా?'


  •  ప్రహ్లాద్ జోషి నియామకంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు


దేశ విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని అదనపు బాధ్యతలతో నియమించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ యువత, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలో అత్యాచార నిందితులను సమర్థించిన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా ఎంపిక చేయడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో మరెందరో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ప్రహ్లాద్ జోషినే ఎంపిక చేయడం విచిత్రమైన నిర్ణయమని అన్నారు.



ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రివర్గంలో అత్యంత అనుభవజ్ఞులైన నేతల్లో ఒకరు. 2018లో ఆయన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో, 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ముందస్తుగా విడుదల చేసే నిర్ణయానికి ఆయన మద్దతు తెలిపారు. ఆ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, నిందితులు చాలా కాలం జైలులో ఉన్నారని, చట్ట ప్రకారం విడుదలకు అవకాశం ఉందని జోషి సమర్థించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు చట్ట ప్రక్రియ ప్రకారమే నిర్ణయం తీసుకున్నారని, అందులో తప్పేమీ కనిపించడం లేదని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. అలాగే నిందితులు జైలులో ఉన్న సమయంలో మంచి ప్రవర్తన కనబరిచారనే కారణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే, 2024లో సుప్రీంకోర్టు ఆ ముందస్తు విడుదలను రద్దు చేస్తూ, ఆ క్షమాభిక్ష ఉత్తర్వులు చట్టబద్ధమైన అధికార పరిధిలో జారీ కాలేదని స్పష్టం చేసింది.


లోక్‌సభలో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు సంబంధించిన కొత్త బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యా వ్యవస్థపై దేశవ్యాప్తంగా యువత నిరసనలు వ్యక్తం చేస్తుంటే, అలాంటి సమయంలో అత్యాచార నిందితులను సమర్థించిన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం బీజేపీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేయగా, రాహుల్ గాంధీ స్పందిస్తూ విద్యార్థులు, యువత, మహిళలు పోలీసుల చేతుల్లో దాడులకు గురయ్యారని ఆరోపించారు.


అత్యాచార నిందితులను రక్షించాల్సిన అవసరం ఉందని భావించే వ్యక్తికంటే హీనమైన వ్యక్తి మరొకరు ఉండరని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తే ఇప్పుడు దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని విమర్శించారు. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఎన్నో మంది ఉన్నప్పటికీ వారిలో ఎవరినైనా ఎంపిక చేసే అవకాశం ఉండగా, అత్యాచార నిందితులను సమర్థించిన వ్యక్తినే ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని అన్నారు. అంతకుముందు లోక్‌సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పటికీ, ఆమె చేసిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించారు.


ఇదిలా ఉండగా, 2021 నుంచి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయాలన్నది ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ పంపిన కొద్ది గంటలకే నిరసనకారులు తమ ఆందోళనను విరమించారు. అదే రోజు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.

'యువత ప్రతిపక్షంతో ఉందనుకోవడం పెద్ద డెలులు'

  •  పేపర్ లీక్ బిల్లుపై కాంగ్రెస్‌కు తేజస్వి సూర్య కౌంటర్


ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ యువతకు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఏమి జరిగిందన్నది ముఖ్యం కాదని, భవిష్యత్తులో పరీక్షల వ్యవస్థను ఎవరు సరిచేస్తారన్నదే ప్రధాన అంశమని ఆయన అన్నారు. ప్రశ్నపత్రాల లీక్‌లు పూర్తిగా ఆగిపోయేలా వ్యవస్థను బలోపేతం చేయాలని యువత ఆశిస్తున్నారని, ఆ సామర్థ్యం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఆయన పేర్కొన్నారు.



తదుపరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి గత చరిత్ర గురించి ఆలోచించడంలేదని, ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి జరిగిందన్నదానిపై అతనికి ఆసక్తి లేదని తేజస్వి సూర్య అన్నారు. తన భవిష్యత్తును రక్షించేలా పరీక్షల వ్యవస్థను ఎవరు సరిదిద్దుతారన్నదే విద్యార్థికి ముఖ్యమని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పరీక్షల వ్యవస్థను శాశ్వతంగా మెరుగుపరిచే దిశగా పనిచేస్తోందనే నమ్మకం యువతలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.


పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ అంశంపై ప్రతిపక్షాలను విమర్శిస్తూ తేజస్వి సూర్య 'జెన్-జెడ్' తరానికి చెందిన "భ్రమలో బతకడం" (డెలులు) అనే పదాన్ని ఉపయోగించారు. యువత తమతో ఉందని ప్రతిపక్ష పార్టీలు భావించడం కంటే పెద్ద "భ్రమలో బతకడం" మరొకటి ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 'డెలులు' అనేది వాస్తవాలకు దూరంగా భ్రమల్లో జీవించడం లేదా అవాస్తవ నమ్మకాల్లో ఉండడాన్ని సూచించే యువతలో ప్రాచుర్యం పొందిన పదం.


కాంగ్రెస్‌పై మరింత ఘాటుగా స్పందించిన తేజస్వి సూర్య, 2010లో యూపీఏ ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకురాకపోవడం వల్ల ఇప్పటివరకు పేపర్ లీక్ కేసుల్లో సమర్థవంతమైన శిక్షలు అమలు కాలేదని ఆరోపించారు. విద్యార్థులకు నినాదాలు అవసరం లేదని, పరిష్కారం కావాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ బిల్లు అదే పరిష్కారాన్ని అందిస్తోందని, ముప్పై ఏళ్ల క్రితమే ఇలాంటి చట్టం రావాల్సి ఉన్నప్పటికీ దేశ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు.


లోక్‌సభలో జెన్-జెడ్ పదజాలం వినిపించడం ఇదే తొలిసారి కాదని, మరో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చట్టపరమైన పరిష్కారాన్ని అందించడం ద్వారా పరిస్థితిని సరిగా అర్థం చేసుకున్నారని ('క్లాక్డ్ ఇట్') వ్యాఖ్యానించారు.


ఇటీవల నీట్ (NEET) వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఘటనల నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత సవరణల ప్రకారం పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా, నిందితుల ఆస్తుల స్వాధీనం, అలాగే కేసులను మూడు నెలల్లో పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


దేశంలో విద్యా, పరీక్షల వ్యవస్థ మాత్రమే అభ్యర్థి ఇంటిపేరు, కుటుంబ ఆదాయం, కులం లేదా ఆర్థిక నేపథ్యం గురించి అడగకుండా ప్రతిభకు అవకాశం కల్పిస్తుందని తేజస్వి సూర్య అన్నారు. కష్టపడి చదివిన వారికి సమాన అవకాశాలు లభిస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉందని, అలాంటి వ్యవస్థలో ప్రశ్నపత్రాల లీక్‌లు చోటుచేసుకుంటే అది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాకుండా విద్యార్థుల నమ్మకానికి జరిగిన ద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు.

'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యతో లోక్‌సభలో దుమారం


  • ప్రియాంక గాంధీపై అనురాగ్ ఠాకూర్ ఎదురుదాడి


లోక్‌సభలో పరీక్షల వ్యవస్థ సంస్కరణల బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన "గోమూత్ర నిపుణుడు" వ్యాఖ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీలోని ఒక సభ్యుడిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రియాంక గాంధీపై ఘాటుగా విరుచుకుపడ్డారు.



జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వ్యవహారం తర్వాత దేశంలోని పరీక్షల వ్యవస్థను పటిష్ఠం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేయడాన్ని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధాని తన సలహాదారులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని, కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు. గతంలో ఏర్పాటైన రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల్లో ఒక్కటైనా ఇప్పటివరకు అమలు కాలేదని ఆమె ఆరోపించారు.


కొత్త కమిటీలో మాజీ ఐబీ అధికారి, ఒక ఐటీ సంస్థ యజమాని, అలాగే "గోమూత్ర నిపుణుడు" కూడా ఉన్నారని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఆమె ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశించినవేనని విస్తృతంగా భావించారు. ప్రజా పరీక్షలను లీక్‌లకు అవకాశం లేకుండా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌లో ప్రొఫెసర్ కామకోటి ఆరుగురు నిపుణుల్లో ఒకరిగా ఉన్నారు.


ప్రొఫెసర్ వి. కామకోటి గతంలో గోమూత్రంలోని ఔషధ గుణాలపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2025 జనవరిలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో గోమూత్రానికి శిలీంధ్ర నిరోధక, బ్యాక్టీరియా నిరోధక, వాపు తగ్గించే లక్షణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై పరిశోధనలు జరిగాయని, ఆ వాదనలకు మద్దతుగా శాస్త్రీయ పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని చెప్పారు. ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు విమర్శకులు ఆయన వ్యాఖ్యలను అశాస్త్రీయమని విమర్శించారు. అయితే, తన వాదనలకు మద్దతుగా సమీక్షిత శాస్త్రీయ జర్నళ్లలో ప్రచురితమైన ఐదు పరిశోధనా పత్రాలు ఉన్నాయని కామకోటి స్పష్టం చేశారు. హర్యానాలోని కర్నాల్‌లో ఉన్న ఐసీఏఆర్-నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన పరిశోధనతో పాటు ఇతర శాస్త్రీయ జర్నళ్లను కూడా ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.


ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్తను అవమానించడం బాధాకరమని అన్నారు. ప్రియాంక గాంధీ అమాయకంగా కనిపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి దేశానికి సేవలందించిన గొప్ప శాస్త్రవేత్త అని కొనియాడారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం కలిగి ఉంటే అందులో తప్పేమీ లేదని, ప్రియాంక గాంధీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరితే దేశభక్తి విలువలు నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు.


ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ కంటే భిన్నంగా ఉంటారని తాను భావించానని, కానీ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత ఇద్దరూ ఒకే మార్గంలో నడుస్తున్నారని అనిపిస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. వ్యంగ్యంగా స్పందిస్తూ, "బహుశా వారి మెదడు సరిగా పనిచేయకుండా చేసే ఏదో పదార్థాన్ని వారు తీసుకుంటున్నారేమో. దానికి బదులుగా గోమూత్రం తీసుకుంటే మంచిదేమో" అని వ్యాఖ్యానించారు.

Monday, 27 July 2026

రష్యా ఇరాన్‌కు సహాయం చేసి ఉంటే అది చాలా తక్కువ ప్రభావం చూపింది



  • పుతిన్‌ను అడిగి తెలుసుకుంటానన్న ట్రంప్

ఇరాన్‌కు రష్యా సహాయం అందిస్తోందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఒకవేళ రష్యా నిజంగానే ఇరాన్‌కు ఏమైనా సహాయం చేసి ఉంటే, దాని ప్రభావం చాలా తక్కువగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై తాను స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడి, అసలు నిజానిజాలు ఏమిటో అడిగి తెలుసుకుంటానని వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు , ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలపై అంతర్జాతీయంగా వివిధ చర్చలు జరుగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత తెచ్చుకునేందుకు పుతిన్‌తో చర్చలు జరుపుతానని, అంతర్జాతీయ భద్రత , ప్రాంతీయ శాంతికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

నేడు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' భేటీ


  • పేపర్ లీక్ వ్యతిరేక బిల్లు, సభా వ్యూహాలపై కీలక సమాలోచనలు  



భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పార్లమెంటరీ పార్టీ తన వారపు 'మంగళ్ మిలన్' సమావేశాన్ని మంగళవారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనుంది. న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఉన్న జీఎంసీ బాలుయోగి ఆడిటోరియంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామంగా, ఇటీవల ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) తొలిసారిగా పాల్గొనబోతోంది.  కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026'పై నాలుగు గంటల పాటు జరిగే చర్చలో పాల్గొనేందుకు ఎన్డీయే పలువురు యువ ఎంపీలను రంగంలోకి దించింది. బిజెపి ఎంపీలు బన్సూరి స్వరాజ్, తేజస్వి సూర్యలతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ ఎంపీ ఆలోక్ కుమార్ సుమన్, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఎన్సీపీ ఎంపీ సునీల్ తట్కరే, అప్నా దళ్ ఎంపీ అనుప్రియా పటేల్, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎంపీ అరుణ్ భారతి తదితరులు ఈ చర్చలో ప్రసంగించనున్నారు.  జూలై 20న జరిగిన 'సంసద్ చలో' నిరసన ప్రదర్శన సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని, అలాగే ప్రతిపాదిత బిల్లు సమర్థతను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న వేళ ఈ ఎన్డీయే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారం జరిగిన 'మంగళ్ మిలన్' సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని, పేపర్ లీకేజీల వ్యవహారం జాతీయ సమస్య అని, దీనిని రాజకీయం చేయకూడదని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహాలతో పరీక్షల అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. 

పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం


  • లోక్‌సభలో సవరణ బిల్లు ప్రవేశం..
  •  మంగళవారం విస్తృత చర్చకు అన్ని పార్టీల అంగీకారం


నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వరుసగా ఆరు రోజులుగా పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు మంగళవారం తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై అన్ని రాజకీయ పార్టీలు మంగళవారం చర్చకు అంగీకరించినట్లు పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవతో జరిగిన సంప్రదింపుల ఫలితంగా ఈ ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. బిల్లుపై చర్చ కోసం ఆరు గంటల సమయం కేటాయించిన స్పీకర్, అవసరమైతే సభ అభిప్రాయం మేరకు మరింత సమయం కూడా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు.






కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థులపై పోలీసుల చర్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షం పట్టుబట్టడంతో బిల్లుపై చర్చ జరగలేదు. మరోవైపు జూలై 20 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ కూడా ప్రతిపక్ష ఆందోళనలతో పదేపదే వాయిదా పడుతూ సోమవారం ఎలాంటి కార్యాచరణ చేపట్టలేకపోయింది. విద్యార్థులపై పోలీసు చర్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగించింది.


కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జూన్ 20న ప్రారంభమైన 36 రోజుల విద్యార్థి ఉద్యమం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ప్రభుత్వం పలు డిమాండ్లను అంగీకరించడం అనంతరం జూలై 25న ముగిసింది. ఆ ఉద్యమానికి ప్రతిస్పందనగానే ఈ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.


ఈ బిల్లు ప్రకారం ప్రశ్నపత్రాల లీక్ కేసుల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. పేపర్ లీక్ లేదా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు కనీసం ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో మోసాలకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు, వ్యవస్థీకృత నేరాలకు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష, కనీసం రూ.1 కోటి జరిమానా మాత్రమే ఉంది.


కొత్త బిల్లు ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం పొందుతాయి. చార్జిషీట్ దాఖలైన మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైతే పేపర్ లీక్ కేసుల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చు.


బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ నినాదాలు చేయడం కంటే బిల్లుపై సభలో చర్చించాలని, సభ్యులు సూచించే మంచి మార్పులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ప్రజా పరీక్షల వ్యవస్థను మెరుగుపర్చే దిశగా ఇది తొలి అడుగని ఆయన పేర్కొన్నారు.


2024లో పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి ఈ బిల్లు మరింత బలం చేకూరుస్తోంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వేలు, బ్యాంకింగ్ నియామక పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలు సహా అన్ని ప్రధాన ప్రజా పరీక్షల్లో అక్రమాలను అరికట్టడమే దీని లక్ష్యం. నీట్-యూజీ పేపర్ లీక్ ఘటనల తర్వాత ఇలాంటి కేసులపై కఠిన చట్టం తీసుకొస్తామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారణ జరిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అలాగే పరీక్షల వ్యవస్థను పూర్తిగా పేపర్ లీక్ రహితంగా మార్చేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ఇటీవలి కాలంలో ప్రజా పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకులు, ఇతర అక్రమాలు పరీక్షల పారదర్శకతను, విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని బిల్లు పేర్కొంది. పరీక్షా కేంద్రాల సిద్ధతపై ముందస్తు తనిఖీలు, అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు, భద్రతా ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల తయారీ, నిల్వ, పరీక్షల పర్యవేక్షణ, పరీక్షల అనంతర ప్రక్రియలు, స్క్రైబ్‌లకు సంబంధించిన మార్గదర్శకాలు వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలు రూపొందించే అధికారం కూడా ఇందులో ఉంది. ప్రశ్నపత్రాల లీక్, ఓఎంఆర్ షీట్లలో మార్పులు, నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ అడ్మిట్ కార్డుల జారీ వంటి మొత్తం 15 రకాల అక్రమాలను ఈ బిల్లు నేరాలుగా నిర్వచించింది.

విద్యార్థులపై కేసులు కొనసాగితే కొత్త బిల్లు ఎందుకు?



  • యాంటీ పేపర్ లీక్ బిల్లుపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ


ప్రజా పరీక్షల్లో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థులపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయనే వార్తలు నిజమైతే, కొత్త చట్టం తీసుకురావడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఇప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారనే సమాచారం తనకు అందిందని చెప్పారు. అయితే ఆ సమాచారం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి కొనసాగుతుంటే కొత్త యాంటీ పేపర్ లీక్ బిల్లు తీసుకురావడంలో అర్థమేంటని ప్రశ్నించారు.


ఇదిలా ఉండగా, లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు ముందు రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు మకర్ ద్వార్ వద్ద ఆందోళన చేపట్టారు. జూలై 20న నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంపై నిర్వహించిన ‘సంసద్ చలో’ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసులు అనుసరించిన వైఖరిపై అత్యవసర చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభలో వాయిదా తీర్మానాలు, రాజ్యసభలో వ్యాపారాల నిలిపివేత నోటీసులు సమర్పించాయి. ఈ అంశం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.


నీట్-యూజీ 2026 పరీక్షలో జరిగిన అక్రమాల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు సాంకేతిక, నిర్మాణాత్మక సంస్కరణలపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది.

Featured post

వందేమాతరం వివాదంపై కాంగ్రెస్‌ వివరణ

ఖర్గేకు కుర్చీ కోసమే సోనియా ఆదేశాలు: తారిఖ్‌ అన్వర్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై ఎలాంటి వివాదం జరగలేదని కాంగ...