Monday, 27 July 2026

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు



  • లోపాల్లేని చట్టం కావాలన్న ప్రతిపక్షం, కఠిన శిక్షలకు బీజేపీ మద్దతు


పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బిల్లులోని ప్రతి నిబంధనను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లోపాలు లేకుండా రూపొందించాలని ప్రతిపక్ష సభ్యులు కోరగా, పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునే శక్తివంతమైన చట్టంగా ఇది నిలుస్తుందని బీజేపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు.


జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎంపీ మహువా మాజీ మాట్లాడుతూ, ప్రతి బిల్లుపై సమగ్ర చర్చ జరగాల్సిందేనని, అయితే అధికార పార్టీ తరచూ చర్చలను నివారిస్తోందని విమర్శించారు. బిల్లులోని నిబంధనలు భవిష్యత్తులో కొత్త సమస్యలకు దారితీయకుండా, అమాయక విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని అన్నారు. గతంలో కూడా పేపర్ లీక్‌లు జరగవని హామీలు ఇచ్చినా పరిస్థితి మారలేదని, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టం ఉండాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాకముందే విద్యార్థులు 22 రోజుల పాటు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారని, అప్పుడు ప్రభుత్వం వారితో ఎందుకు చర్చించలేదని మహువా మాజీ ప్రశ్నించారు. స్పందన రాకపోవడంతోనే విద్యార్థులు 'పార్లమెంట్ చలో' పిలుపునిచ్చారని, అక్కడ వారికి లాఠీచార్జి, టియర్ గ్యాస్‌తో సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం బిల్లు తీసుకొస్తున్నందున ప్రతిపక్ష సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని అమాయకులు శిక్షపడని విధంగా లోపాల్లేని చట్టాన్ని రూపొందించాలని ఆమె సూచించారు.


కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతం మాట్లాడుతూ, పేపర్ లీక్‌లపై బిల్లు తీసుకురావడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. అయితే ఈ సంక్షోభానికి కారణమైన పరిస్థితులను కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వరుస పేపర్ లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని, ఈ అంశంపై రాజకీయ ఆరోపణలకు బదులుగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. విద్యార్థులు న్యాయం కోసం చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని ఆమె వ్యాఖ్యానించారు.


బీజేపీ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఈ బిల్లును స్వాగతిస్తూ, పేపర్ లీక్‌లు, కాపీయింగ్, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే సంఘటిత ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా చర్చించి వారి ఆందోళనలను వినడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్టంలో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా వంటి కఠిన నిబంధనలు ఉండటం వల్ల పరీక్షల మాఫియాలు ఇలాంటి నేరాలకు పాల్పడేందుకు కూడా భయపడతాయని అన్నారు.


పరీక్షల వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న అవకతవకలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూడా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మిట్టల్ పేర్కొన్నారు. మాజీ ఇస్రో చైర్మన్ సహా పలువురు నిపుణులతో కూడిన ఈ కమిటీ లోతైన విచారణ జరిపి, దోషులను వేగంగా గుర్తించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షించేలా సిఫార్సులు చేస్తుందని తెలిపారు.


మరో బీజేపీ ఎంపీ శశాంక్ మణి త్రిపాఠి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును రక్షించే దిశగా ఈ బిల్లు ఒక అర్థవంతమైన చర్య అని అన్నారు. ప్రతిపక్షం ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తోందని విమర్శించిన ఆయన, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఏర్పడిన తర్వాత పరీక్షల సంస్కరణల విషయంలో తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎవరూ విస్మరించలేరని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.


No comments:

Post a Comment

Featured post

పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం

లోక్‌సభలో సవరణ బిల్లు ప్రవేశం..  మంగళవారం విస్తృత చర్చకు అన్ని పార్టీల అంగీకారం నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వరుసగా ఆరు రోజులుగా పా...