Friday, 24 July 2026

అలాంటి వ్యక్తిని గెలిపించినందుకు నన్ను క్షమించండి


  • తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు



తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ తనపై చేసిన విమర్శలు, ఆరోపణలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తనని నమ్మి మందుల సామేల్‌ను గెలిపించినందుకు తుంగతుర్తి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తనను క్షమించాలని ఆయన బహిరంగంగా కోరారు. శుక్రవారం భువనగిరి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, సామేల్‌కు పార్టీ టికెట్ ఇప్పించి, గెలుపు కోసం శ్రమించిన తనకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.  శాసనసభ ఎన్నికల సమయంలో తాను పార్టీ అధిష్ఠానాన్ని అడిగిన రెండు స్థానాల్లో తుంగతుర్తి ఒకటని, సామేల్‌కు టికెట్ ఇప్పించి గెలిపించడంలో కీలక పాత్ర పోషించానని గుర్తుచేశారు. "నా అభిమానుల మద్దతుతో, నేను ఇప్పించిన టికెట్‌తో గెలిచిన వ్యక్తి.. ఈ రోజు నాపైనే విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా" అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉన్న నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన రాజగోపాల్‌రెడ్డి, సామేల్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కోమటిరెడ్డి సోదరుల అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.  కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని గౌరవిస్తామని, అదే సమయంలో ఏళ్ల తరబడి కష్టపడిన పాత కార్యకర్తలను విస్మరించి ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిజమైన కార్యకర్తల హక్కులను కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. నియోజకవర్గంలో నమ్మకమైన కార్యకర్తలకు న్యాయం జరిగేలా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  

No comments:

Post a Comment

Featured post

రీజినల్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

వచ్చే వారం అమెరికాలో నెతన్యాహు పర్యటన, ధృవీకరించిన ట్రంప్ వాషింగ్టన్, జూలై 25 (తెలుగుప్రభ): పశ్చిమాసియాలో రీజినల్ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలు...