- విజయ్ సినిమాపై నటి ఆనంది అజయ్ ఆవేదన!
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) ఇటీవల థియేటర్లలోకి వచ్చి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో తన సన్నివేశాలన్నింటినీ తొలగించారంటూ నటి ఆనంది అజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 'జననాయగన్' చిత్రం కోసం తాను దాదాపు ఏడాది పాటు ఎంతో కష్టపడి పనిచేశానని తెలిపారు. విజయ్ నటించే చివరి సినిమా కావడం, ఆయనతో కలసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంపై ఎంతో ఆనందపడ్డానని.. కానీ తీరా సినిమా విడుదలయ్యాక తన సీన్లను పూర్తిగా కట్ చేయడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంది, క్లాసికల్ డ్యాన్సర్ , యోగా ట్రైనర్‌గానూ సుపరిచితమే.
సెన్సార్ బోర్డు నుంచి ఎదురైన సాంకేతిక ఇబ్బందుల వల్లే చిత్రబృందం 'జననాయగన్'లోని కొన్ని కీలక సన్నివేశాలను తొలగించాల్సి వచ్చినట్లు సమాచారం. సెన్సార్ సభ్యులు దాదాపు 12 మార్పులు (కట్స్) చేయాలని ఆదేశించడంతోనే ఆనంది అజయ్ నటించిన సన్నివేశాలు కూడా ఎడిటింగ్‌లో పోయి ఉంటాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 78 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారత్‌లోనే తొలిరోజు రూ. 41 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు అంచనా వేస్తుండగా, అధికారిక వసూళ్ల ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
No comments:
Post a Comment