Sunday, 26 July 2026

రెండు రోజులుగా అన్నం తినలేదు


  • అయినా చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
  • వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం



భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, మహిళల 48 కిలోల విభాగంలో వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పోటీల్లో ఆమె అద్భుత ప్రదర్శనతో కామన్వెల్త్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. బరువు నియంత్రణ కోసం రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పాటు మూడు రోజులుగా నీళ్లు కూడా తాగకుండా పోటీలకు సిద్ధమైనప్పటికీ, అసాధారణ పట్టుదలతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. 31 ఏళ్ల మీరాబాయి చాను స్నాచ్‌లో 85 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 105 కిలోలు ఎత్తి మొత్తం 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తింది. దీంతో స్నాచ్‌లో కామన్వెల్త్, కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు క్లీన్ అండ్ జర్క్, మొత్తం లిఫ్ట్‌లో కూడా కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను నెలకొల్పింది.


స్వర్ణ పతకం అందుకున్న అనంతరం జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మీరాబాయి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. త్రివర్ణ పతాక రంగుల రిబ్బన్లు ధరించి పోడియంపై నిలిచిన ఆమె తొలి స్పందన కూడా అందరినీ కదిలించింది. "త్వరగా పూర్తి చేయండి... నేను రెండు రోజులుగా ఏమీ తినలేదు" అని మీడియాతో చెప్పింది. ఈ విజయానంతరం మాట్లాడిన మీరాబాయి, తన తల్లి , కోచ్ విజయ్ శర్మ అందించిన అండదండలను గుర్తు చేసుకుంటూ మరోసారి భావోద్వేగానికి గురైంది. కష్టసుఖాల్లో వారు ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచారని, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆశలు నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ గేమ్స్‌లో ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా పోటీపడాలని భావించినప్పటికీ తొలి ప్రయత్నంలో విఫలమైన తర్వాత తాను, కోచ్ కలిసి వ్యూహాన్ని మార్చుకున్నామని వెల్లడించింది. ఈ పోటీలో మీరాబాయి ఆధిపత్యం ఎంత గొప్పదో ఫలితాలే చెబుతున్నాయి. నైజీరియాకు చెందిన రూత్ అసుకోవో న్యాంగ్ మొత్తం 168 కిలోలు మాత్రమే ఎత్తి రెండో స్థానంలో నిలవగా, మీరాబాయి 22 కిలోల భారీ ఆధిక్యంతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.


అయితే ఆమె ప్రయాణం ఆరంభంలో కొంత ఉత్కంఠ నెలకొంది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంగా 82 కిలోల బరువును ఎత్తడంలో విఫలమైన మీరాబాయి, ఏమాత్రం నిరాశ చెందకుండా రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తి ఆ తర్వాత రికార్డుస్థాయి ప్రదర్శన చేసింది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ రెండో ప్రయత్నంలో 105 కిలోలను సునాయాసంగా ఎత్తి స్వర్ణంతో పాటు కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పోటీ అప్పటికే తన ఆధీనంలోకి రావడంతో, రెండు నెలల్లో జరగనున్న ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని మూడో ప్రయత్నాన్ని ఆమె స్వచ్ఛందంగా విరమించుకుంది. తన బరువును నియంత్రించడం ఎంత కష్టమో కూడా మీరాబాయి వివరించింది. సాధారణంగా తన బరువు 50.5 కిలోలుగా ఉంటుందని, 49 కిలోల విభాగానికి తగ్గించడం ఒక సవాల్ అయితే, 48 కిలోల విభాగానికి చేరుకోవడం మరింత క్లిష్టమని చెప్పింది. ఈసారి బరువు పరిమితిని చేరుకోవడానికి ఆహారం పూర్తిగా మానేయాల్సి వచ్చిందని, మూడు రోజుల పాటు నీళ్లు కూడా తాగలేదని వెల్లడించింది. అయినప్పటికీ దేశం కోసం మరోసారి స్వర్ణ పతకాన్ని సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.

No comments:

Post a Comment

Featured post

పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం

లోక్‌సభలో సవరణ బిల్లు ప్రవేశం..  మంగళవారం విస్తృత చర్చకు అన్ని పార్టీల అంగీకారం నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వరుసగా ఆరు రోజులుగా పా...