Sunday, 5 July 2026

యూపీ లో ప్రధాని మోదీ, సీఎం యోగి నాయకత్వంలో భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తాం

 



  •  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్


లక్నో:ఉత్తరప్రదేశ్‌లో రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కూటమి ఘనవిజయం సాధించి, భారీ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా లక్నో చేరుకున్న ఆయన, కూటమి భాగస్వామ్య పక్షాలు , పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సేవా దృక్పథంతో ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులే ఎన్‌డీఏ కూటమిని క్లీన్ స్వీప్ వైపు నడిపిస్తాయని ఆయన విలేకరులకు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.



ఇదే వేదికపై సమాజ్‌వాదీ పార్టీ (SP) లక్ష్యంగా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీ రాష్ట్ర మంత్రి భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ కేవలం కులాలు, మతాలు మరియు ప్రాంతాల వారీగా సమాజాన్ని విభజించి దేశాన్ని బలహీనపరచాలనే ప్రతికూల ఎజెండాతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దీనిని సమర్థిస్తూ.. గతంలో ఉన్న గుండారాజ్యం, మాఫియా సంస్కృతి, అల్లర్లు మరియు వారసత్వ రాజకీయాలను ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని గుర్తుచేశారు. నేటి యూపీ కేవలం అభివృద్ధి, సుపరిపాలన , మహిళల భద్రతను మాత్రమే కోరుకుంటోందని, అందుకే రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలంతా అభివృద్ధి వైపే నిలబడాలని నిశ్చయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

తెలంగాణలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్:రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడ...