ఆంధ్రజ్యోతిలో జర్నలిజం విద్యార్థిగా (2007 సెప్టెంబర్) లో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అప్పటి మా ఎడిటర్ రామచంద్ర మూర్తి సార్. ఇంటర్వ్యూలో ఎండీ రాధాకృష్ణతో పాటు మూర్తి సారే పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. శిక్షణ కాలం పూర్తి చేసుకున్న తర్వాత రంగారెడ్డి డెస్క్ లో సబ్ ఎడిటర్ గా వేశారు. అప్పుడు డెస్క్ ఇన్‌ఛార్జి చందనం శ్రీకాంత్ సార్. అప్పుడు పని అంతా కొత్తగా వింతగా అనిపించింది. ఫ్యాక్స్ ద్వారా కొన్ని వార్తలు వచ్చేవి. ఆపరేటర్ వేణు వాటిని చేసేవాడు. నేను కొత్తగా జాయిన్ అవ్వడంతో నాకు చందనం సార్ టాస్క్ ఇచ్చారు. వార్తలను కంపోజ్ చేసే సమయంలోనే మంచి హెడ్డింగ్, లీడ్ ఉండాలి. నీ వార్తలు నువ్వే రాసుకోవాలి. పేజీ పెట్టుకోవాలన్నారు. అట్లా పదిహేను రోజులు చేసిన తర్వాత ఎడిట్ పేజీకి సబ్ ఎడిటర్ కావాలన్నారు. మా బ్యాచ్‌లో వర్తమాన, రాజకీయ అంశాలపై అవగాహన ఉన్నది ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు అప్పటి మా జర్నలిజం ప్రిన్సిపాల్ కట్టా శేఖర్ రెడ్డి, మా వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, మాకు పేజీ నేషన్ నేర్పిన కేపీలు అంతా నా పేరు సూచించారు. అట్లా ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలోకి ఎంట్రీ అయ్యాను. ఆంధ్రజ్యోతి ఎడిట్పేజీకి బాగా క్రేజ్ ఉండేది. అప్పుడు ఆర్టికల్స్ కంపోజ్ చేయడంతో పాటు ఎడిటింగ్ చేయడం, మంచి శీర్షికలు పెట్టడం నేర్చుకున్నాను. కరి చక్రపాణి సార్, జ్యోతింద్రనాథ్, సుధాకర్ సార్లతో కలిసి పనిచేశాను. ఎడిటింగ్‌లో మా పరాంకుశం వేణుగోపాల స్వామి నేర్పిన మెళకువలు నాకు వృత్తిలో బాగా ఉపయోగపడ్డాయి. అట్లా దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ఎడిట్‌పేజీలో సడ్ ఎడిటర్‌గా పనిచేశాను. అప్పుడు క్వాలిటీ సెల్ లో జగన్నాథస్వామి,మా వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. ఎందుకు అని అడిగితే చాలా సీనియర్లకు అందులో పనిచేసే అవకాశం వస్తుంది. కానీ నీకు కెరీర్ ప్రారంభలో మంచి అవకాశం వచ్చిందన్నారు.
రామచంద్రమూర్తి సార్ కాలమ్ 'సకాలం' పేరుతో ప్రతి ఆదివారం వచ్చేది. సార్ ఆర్టికల్ పంపిన తర్వాత మేము రెండు మూడు హెడ్డింగ్‌లు పెడితే అందులో నుంచి ఆయన ఒకటి సెలక్ట్ చేసేవారు. నన్ను కూడా చదివి హెడ్డింగ్ పెట్టమని చక్రపాణి సార్ అంటే అట్లా ఆయన కాలమ్‌కు హెడ్డింగ్ పెట్టాను. అందరం వివిధ హెడ్డింగ్ లు సార్ కు పెడితే నేను పెట్టింది బాగుందని అదే పెట్టమన్నారు. అట్లా ప్రతీవారం చదవడం సార్ విశ్లేషణను అర్థం చేసుకోవడం మంచి శీర్షిక పెట్టడం అలవాటు అయింది. నాకు తెలిసి వరుసగా రెండు మూడు వారాలు నేను పెట్టిన హెడ్డింగ్ నే మూర్తి సార్ ఫైనల్ చేశారు. ఆ తర్వాత సార్ హెచ్ ఎం టీవీకి వెళ్లిపోయారు. జర్నలిజంలో మాకు ఒకటి రెండు రోజులు పాఠాలు చెప్పినప్పుడు గాని, తర్వాత గాని సార్‌తో ఫొటో దిగే అవకాశం రాలేదు. మొన్న మా తెలుగు ప్రభ రీ లాంచ్ సందర్భంగా మా ఎడిటర్ సమయమంత్రి చంద్రశేఖర శర్మ సార్ ఉద్యోగులకు సంస్థలో షేర్లు ఇచ్చారు. దానికి సంబంధించిన పత్రాన్ని మా గురువు రామచంద్ర మూర్తి గారి చేతుల మీదుగా అందుకున్నాను. చాలా ఏళ్ల తర్వాత సార్‌ను కలవడం ఆయనతో ఈ పత్రాన్ని అందుకోవడం గొప్ప అనుభూతి. సార్ తో కరచాలనం తర్వాత నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.




