Tuesday, 3 March 2026

మావోయిస్టుల ‘సింహస్వప్నం’ ఈ లేడీ ఆఫీసర్

 


  • అగ్రనేత దేవుజీ లొంగుబాటు వెనుక ఐపీఎస్ సుమతి వ్యూహం..
  •  ‘సవారీ’ మార్చిన ఇంటెలిజెన్స్ ఐకాన్!





హైదరాబాద్: తెలంగాణ పోలీసు విభాగంలో అత్యంత కీలకమైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) అధిపతిగా ఉన్న ఐపీఎస్ అధికారిణి బి. సుమతి, మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ లొంగుబాటు వెనుక సూత్రధారిగా నిలిచారు. 40 ఏళ్లకు పైగా అడవుల్లో ఉంటూ, కోటి రూపాయల రివార్డు కలిగిన సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు , పొలిట్ బ్యూరో సభ్యుడైన దేవుజీని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆమె ప్రదర్శించిన ఓర్పు, వ్యూహాత్మక చాతుర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో దేవుజీతో పాటు మరో కీలక నేత మల్లా రాజీరెడ్డి లొంగిపోయిన సందర్భంలో... ఆ విజయంలో సుమతి . ఆమె బృందం పోషించిన పాత్రను డీజీపీ ప్రత్యేకంగా కొనియాడారు. కేవలం లాఠీతో కాకుండా, పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెప్పి ఒప్పించడం ద్వారానే ఈ చరిత్రాత్మక మార్పు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

సుమతి 2001లో డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రస్తుతం తెలంగాణ ఎస్ఐబీ ఐజీగా పనిచేస్తున్న తొలి మహిళా అధికారిణిగా రికార్డు సృష్టించారు. 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల సమయంలో యువ అధికారిణిగా ఉన్న ఆమె, ఇప్పుడు అదే మావోయిస్టుల అగ్ర నాయకత్వాన్ని ఆయుధాలు వదిలేలా చేయడంలో కీలకపాత్ర పోషించడం విశేషం. గడిచిన రెండేళ్లలో ఆమె పర్యవేక్షణలో సుమారు 591 మంది మావోయిస్టు నేతలు, కార్యకర్తలు లొంగిపోవడం ఆమె పనితీరుకు నిదర్శనం. మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణిస్తే ‘అమరవీరులు’ అవుతారని, అరెస్ట్ అయితే ‘హీరోలు’ అవుతారని, కానీ లొంగిపోతేనే ఉద్యమం ‘జీరో’ అవుతుందనే ఇంటెలిజెన్స్ వ్యూహాన్ని ఆమె విజయవంతంగా అమలుచేశారు.

మహారాష్ట్రలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను వలె కాకుండా, దేవుజీకి మొదట్లో లొంగిపోయే ఉద్దేశం ఏమాత్రం లేదు. అయితే, రెండేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలు, మారుతున్న రాజకీయ , సామాజిక పరిస్థితులను వివరించడం ద్వారా సుమతి గారు ఆయన మనసు మార్చగలిగారు. "మావోయిస్టులను చంపడం కంటే వారిని పునరావాసం కల్పించి మార్చడమే శాశ్వత పరిష్కారం" అని నమ్మే ఆమె, దేవుజీ లాంటి అగ్రనేత నోటి నుంచే "దేశ చట్టబద్ధమైన చట్రంలో పని చేయాలనుకుంటున్నాను" అని చెప్పించడంలో విజయం సాధించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు సమస్యను పరిష్కరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యం దిశగా తెలంగాణ పోలీస్ సాధించిన ఈ విజయం, సుమతి నాయకత్వ పటిమకు దక్కిన మరో మైలురాయి.

No comments:

Post a Comment

Featured post

మావోయిస్టుల ‘సింహస్వప్నం’ ఈ లేడీ ఆఫీసర్

  అగ్రనేత దేవుజీ లొంగుబాటు వెనుక ఐపీఎస్ సుమతి వ్యూహం..  ‘సవారీ’ మార్చిన ఇంటెలిజెన్స్ ఐకాన్! హైదరాబాద్: తెలంగాణ పోలీసు విభాగంలో అత్యంత కీలకమై...