- టీ20 ప్రపంచకప్ ఫైనల్: భారత్ vs న్యూజిలాండ్..
అహ్మదాబాద్: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, తొలిసారి కప్పు కొట్టాలని కసిగా ఉన్న న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపోటములను శాసించే ఐదుగురు కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. వీరిలో భారత్ నుంచి ముగ్గురు, కివీస్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు తమ అద్భుత ఫామ్‌తో మ్యాచ్ గమనాన్ని మార్చగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంజూ శాంసన్ (భారత్): టీమ్ ఇండియా ఓపెనర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో 97 , 89 పరుగులతో అదరగొట్టిన శాంసన్, ఫైనల్‌లో కూడా భారత్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
జస్ ప్రీత్ బుమ్రా (భారత్): భారత బౌలింగ్ వెన్నెముక అయిన బుమ్రా, ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో ఇతను అత్యంత కీలకం కానున్నాడు.
ఫిన్ అలెన్ (న్యూజిలాండ్): కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై కేవలం 33 బంతుల్లోనే శతకం బాది సంచలనం సృష్టించాడు. పవర్‌ప్లేలో ఇతను గనుక నిలదొక్కుకుంటే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.
వరుణ్ చక్రవర్తి (భారత్): ఈ టోర్నీలో 13 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. గత మ్యాచ్‌లో కొంచెం ఖరీదైన బౌలింగ్ చేసినప్పటికీ, మధ్య ఓవర్లలో తన 'మిస్టరీ' స్పిన్‌తో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టగల సామర్థ్యం ఇతని సొంతం.
మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్): కివీస్ కెప్టెన్ సాంట్నర్ అటు బంతితోనూ, ఇటు బ్యాటుతోనూ రాణించగల ఆల్‌రౌండర్. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టడంలో ఇతను కీలక పాత్ర పోషించనున్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మహా సంగ్రామంలో ఈ ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శన టైటిల్ విజేతను నిర్ణయించనుంది.
No comments:
Post a Comment