Tuesday, 3 March 2026

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ముజ్తబా ఖమేనీ


  • తండ్రి మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన కుమారుడు
  • పశ్చిమాసియాలో పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలు!

టెహ్రాన్: ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఆయన కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఇరాన్‌లోని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఆయనను తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు , భార్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత 36 ఏళ్లుగా ఇరాన్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన ఖమేనీ అంత్యక్రియలు పవిత్ర నగరమైన మషద్‌లో జరగనున్నాయి. దీనికిముందు రాజధాని టెహ్రాన్‌లో భారీ వీడ్కోలు సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ఖమేనీ మరణం తర్వాత తాత్కాలికంగా ముగ్గురు సభ్యుల కౌన్సిల్ బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఇప్పుడు ముజ్తబా ఎన్నికతో ఇరాన్ నాయకత్వంలో స్పష్టత వచ్చింది.



మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం నాలుగోరోజుకు చేరడంతో పరిస్థితులు మరింత భీకరంగా మారాయి. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతినబూనగా, చర్చలకు సమయం మించిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు దుబాయ్, అబుదాబి, ఖతార్ , బహ్రెయిన్ వంటి గల్ఫ్ ప్రాంతాల్లోని చమురు నిల్వ కేంద్రాలు, అమెరికా రాయబార కార్యాలయాలపై పడ్డాయి. మంగళవారం దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై జరిగిన డ్రోన్ దాడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధృవీకరించారు, అయితే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇటు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లోకి చొచ్చుకువెళ్లి హెజ్ బొల్లాతో పోరాడుతుండటంతో, ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

No comments:

Post a Comment

Featured post

కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు  కాళేశ్వరం విచారణలో కీలక మలుపు హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ...