- టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ చమురు నిల్వలే లక్ష్యంగా క్షిపణుల వర్షం
- సైనిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు ఐడీఎఫ్ భారీ స్కెచ్
టెహ్రాన్/టెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న వేళ, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అత్యంత వ్యూహాత్మకమైన దాడులు ప్రారంభించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసరాల్లో ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)కి చెందిన ప్రధాన ఇంధన నిల్వ కేంద్రాలు, సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వాయుసేన ఆదివారం తెల్లవారుజామున విరుచుకుపడింది. ఇరాన్ సైనిక వాహనాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు,డ్రోన్ వ్యవస్థలకు అవసరమైన ఇంధన సరఫరాను పూర్తిగా నిలిపివేయడం ద్వారా వారి యుద్ధ యంత్రాంగాన్ని స్తంభింపజేయడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు వెల్లడించాయి. టెహ్రాన్‌లోని కీలక పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భారీ చమురు ట్యాంకర్లపై క్షిపణులు పడటంతో ఆ ప్రాంతమంతా భారీ అగ్నికీలలు, పొగతో నిండిపోయింది.
ఈ దాడుల వల్ల ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని, ముఖ్యంగా ఐఆర్‌జీసీ కార్యకలాపాలకు వెన్నెముక లాంటి ఇంధన కేంద్రాలు ధ్వంసం కావడంతో ఇరాన్ ప్రతిఘటన సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని రక్షణ రంగ విపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ మెరుపు దాడులతో టెహ్రాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇరాన్ తన దూకుడును తగ్గించుకోకపోతే వారి ఆర్థిక , సైనిక మూలాలను దెబ్బతీసే మరిన్ని దాడులు ఉంటాయని ఐడీఎఫ్ హెచ్చరించింది. మరోవైపు, తమ ఇంధన కేంద్రాలపై జరిగిన దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. తమ దేశ రక్షణ వ్యవస్థలను ఛేదించి లోపలికి రావడం అసాధ్యమని గతంలో ప్రకటించిన ఇరాన్, ఇప్పుడు రాజధాని నడిబొడ్డునే దాడులు జరగడంతో ఆత్మరక్షణలో పడింది. ఈ దాడుల పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment