- భారత్-కెనడా బంధంలో సరికొత్త అధ్యాయం
- 50 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ!
న్యూఢిల్లీ: భారత్ , కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని, రెండు దేశాల బంధం ఒక 'కాంతి సంవత్సరం' (లైట్ ఇయర్) మేర భారీ పురోగతిని సాధించిందని ప్రధానిత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జరిగిన భేటీ అనంతరం ప్రధాని మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే కొద్ది ఏళ్లలో 50 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.15 లక్షల కోట్లు) చేర్చడమే లక్ష్యంగా ఒక భారీ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. గతంలో నెలకొన్న దౌత్యపరమైన చిక్కుముడులను అధిగమించి, పరస్పర గౌరవం , విశ్వాసంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించామని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.
ఈ చరిత్రాత్మక భేటీలో వాణిజ్యంతో పాటు టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, కృత్రిమ మేధ (AI) , కీలక ఖనిజాల సరఫరాపై ప్రధానంగా ఒప్పందాలు కుదిరాయి. కెనడా వద్ద ఉన్న అపారమైన సహజ వనరులు, భారత్‌లో ఉన్న అద్భుతమైన మానవ వనరులు , మార్కెట్ అవకాశాలు కలిస్తే ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సెమీకండక్టర్ల తయారీ, గ్రీన్ హైడ్రోజన్ , అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులు పెట్టడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ మాట్లాడుతూ, భారత్ వంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థతో భాగస్వామ్యం కెనడాకు అత్యంత ఆవశ్యకమని, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా తుడిచివేసిందని పేర్కొన్నారు.
భద్రతా పరమైన అంశాలపై కూడా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ,వేర్పాటువాద శక్తుల పట్ల ఉమ్మడి పోరాటం చేయాలని, ఇరు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని నిర్ణయించారు. ఈ చర్చల ద్వారా భారత్-కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యం మరో స్థాయికి చేరిందని, ఇది కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న గ్యాప్ పూర్తిగా తొలగిపోయిందని, ఇది భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment