- 114 డాలర్లకు చేరిన ముడి చమురు
- ఖతార్ గ్యాస్ కేంద్రాలపై దాడులతో ఐరోపాలో ధరలు 30 శాతంపైకి
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం జరిగిన తాజా పరిణామాల్లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఖతార్‌కు చెందిన ఎల్‌ఎన్‌జీ (LNG) మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 114 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. సప్లై చైన్ దెబ్బతింటుందనే ఆందోళనల మధ్య ఇంధన ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటం ప్రపంచదేశాల ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నది.
ముఖ్యంగా గ్యాస్ దిగుమతుల కోసం ఖతార్‌పై ఎక్కువగా ఆధారపడే ఐరోపా దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై దాడుల వార్త వెలువడిన కొద్దిగంటల్లోనే ఐరోపాలో సహజ వాయువు ధరలు ఏకంగా 30 శాతం మేర పెరిగాయి. యుద్ధం కారణంగా ఇప్పటికే రష్యా నుంచి సరఫరా తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న ఐరోపాకు, ఇప్పుడు ఖతార్ సంక్షోభం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. ఈ పరిణామాల వల్ల విద్యుత్ ఉత్పాదన, పారిశ్రామిక కార్యకలాపాల వ్యయం భారీగా పెరగనున్నది. యుద్ధ మేఘాలు తొలగి పరిస్థితులు చక్కబడకపోతే రానున్న రోజుల్లో ఇంధన కొరత మరింత తీవ్రమై ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment