- నటాంజ్ లక్ష్యంగా విధ్వంసం.. ఐఏఈఏ కు ఫిర్యాదు చేసిన టెహ్రాన్!
వియన్నా/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అణు కేంద్రాల వరకు పాకాయి. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన నటాంజ్ (Natanz) అణు ఇంధన శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా వైమానిక దాడులు జరిపినట్లు ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఇరాన్ రాయబారి రెజా నజాఫీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. "శాంతియుత అవసరాల కోసం ఉపయోగిస్తున్న మా అణు కేంద్రాలపై నిన్న మళ్లీ అనాగరిక దాడులు జరిగాయి" అని ఆయన పేర్కొంటూ, నటాంజ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ', ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ రోరింగ్ లయన్'లో భాగంగానే ఈ విధ్వంసం జరిగినట్లు సమాచారం.
ఈ పరిణామాలపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రోస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అణు కేంద్రాలపై దాడుల వల్ల రేడియోధార్మికత వెలువడే ప్రమాదం ఉందని, దీనివల్ల పెద్ద నగరాలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు. అయితే, ప్రస్తుతం పొరుగు దేశాలలో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, ఇరాన్ అణు కేంద్రాలకు జరిగిన నష్టంపై ఇంకా స్పష్టమైన ఆధారాలు అందలేదని గ్రోస్సీ పేర్కొన్నారు. ఇరాన్‌తో పాటు యూఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా వంటి దేశాలలో కూడా అణు రియాక్టర్లు ఉన్నాయని, యుద్ధం వల్ల వీటికి ముప్పు వాటిల్లితే పెను విపత్తు సంభవిస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాలు మూసుకుపోవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.
No comments:
Post a Comment