- 'సర్కే చునారి' పాటపై నిషేధాన్ని సమర్థించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
సినిమా పాటల్లో పెరుగుతున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇటీవల విడుదలైన 'సర్కే చునారి' (Sarke Chunariya) అనే పాటపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో, ఆ పాటను ప్రభుత్వం అధికారికంగా నిషేధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. వాక్ స్వాతంత్య్రం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అయినప్పటికీ, అది సమాజం , సంస్కృతికి లోబడి ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. డిజిటల్ మాధ్యమాల ద్వారా చెడు ప్రభావం వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో, ముఖ్యంగా మహిళలు ,పిల్లల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.
- రాజ్యాంగ పరిమితులకు లోబడే స్వేచ్ఛ
భారత రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం వాక్ స్వాతంత్య్రంపై కొన్ని 'సముచితమైన పరిమితులు' ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ మర్యాదలు, నైతికత , ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా ఎవరూ ప్రవర్తించకూడదని ఆయన హితవు పలికారు. 'కేడీ: ది డెవిల్' అనే సినిమాలోని ఈ పాటలో నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించగా.. ఇందులోని సాహిత్యం , దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, తీవ్రమైన అశ్లీలతతో నిండి ఉన్నాయని విమర్శలు వచ్చాయి. హర్యానా, కర్ణాటక మహిళా కమిషన్లతో పాటు కంగనా రనౌత్, రవి కిషన్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ పాటను తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సెన్సార్ బోర్డు (CBFC) ద్వారా ఇటువంటి కంటెంట్‌పై నియంత్రణను మరింత కఠినతరం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
No comments:
Post a Comment