- ఇంతటి ‘పిరికి’ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
- ఇరాన్ నౌక మునకపై జైరాం రమేష్ ఘాటు విమర్శలు!
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక 'IRIS దేనా'ను అమెరికా జలాంతర్గామి ముంచేసిన ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిశ్శబ్దాన్ని ఆయన తప్పుబడుతూ, భారతదేశ చరిత్రలోనే ఇంతటి "పిరికి , భయపడే" (Timid and Fearful) ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. శ్రీలంక తీరానికి సమీపంలో, భారత్‌కు అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఇటువంటి దాడి జరిగినా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక స్పందన లేకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
ఈ ఘటన భారత భద్రత , దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జైరాం రమేష్ హెచ్చరించారు. ముఖ్యంగా, గత నెల ఫిబ్రవరి 19 నుండి 25 వరకు విశాఖపట్నంలో భారత నౌకాదళం నిర్వహించిన 'మిలన్-2026' (MILAN) విన్యాసాల్లో అమెరికా , ఇరాన్ నౌకలు రెండూ పాల్గొన్నాయని ఆయన గుర్తుచేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న అతిథి నౌకపై, మన ముంగిట దాడి జరిగితే కేంద్రం కనీసం స్పందించకపోవడం అత్యంత అసాధారణమైన విషయమని ఆయన విమర్శించారు. ఇరాన్‌లో జరిగిన వరుస హత్యల విషయంలో కూడా మోడీ ప్రభుత్వం మౌనం వహించిందని, ఇప్పుడు మన సముద్ర జలాల సమీపంలో దాడి జరిగినా అదే తీరును కనబరుస్తోందని దుయ్యబట్టారు.
భారత్ తన విదేశీ విధానంలో ఉండాల్సిన నైతిక ధైర్యాన్ని కోల్పోయిందని, అంతర్జాతీయ రాజకీయాల్లో మన గొంతు నొక్కుకుపోతోందని కాంగ్రెస్ ఆరోపించింది. పశ్చిమాసియా సంక్షోభం మన పొరుగుకే చేరుకున్న తరుణంలో, భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో విఫలమవుతోందని జైరాం రమేష్ విశ్లేషించారు. ప్రభుత్వం వెంటనే తన వైఖరిని స్పష్టం చేయాలని, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
No comments:
Post a Comment