- మోడీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ధ్వజం
- పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్.
- గ్యాస్ ధరల పెరుగుదలపై ఆందోళన
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. కేరళలో ఎల్‌డీఎఫ్ , యూడీఎఫ్ కూటముల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న ప్రధాని ఆరోపణలను తిప్పికొడుతూ, అసలు పొత్తు ఎవరి మధ్య ఉందో కేరళ ప్రజలందరికీ బాగా తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం మారదని, ప్రజలు సత్యాన్ని గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కేంద్ర సంస్థలు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాజకీయ విమర్శలతో పాటు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భారత్‌పై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. యుద్ధం వంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయడం తమ ఉద్దేశ్యం కాదని, అయితే దీనివల్ల తలెత్తుతున్న సవాళ్లకు పరిష్కారాలను వెతకడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు.
పశ్చిమాసియా సంక్షోభం విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ముందస్తు ప్రణాళికలు ,సన్నద్ధతను పార్లమెంట్ వేదికగా దేశానికి వెల్లడించాలని ప్రియాంక కోరారు. ఇంధనం , గ్యాస్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పారదర్శకత ఉండాలని, అప్పుడే అందరం కలిసి భవిష్యత్తు వ్యూహాలపై పని చేయగలమని ఆమె చెప్పారు. ప్రధాని మోడీ కేవలం పరిస్థితిని వివరించడం కాకుండా, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరపడం ద్వారా ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు.
No comments:
Post a Comment