- ఏక్‌నాథ్ షిండే వైపు ఆరుగురు ఎంపీల చూపు; శ్రీకాంత్ షిండే నివాసంలో రహస్య భేటీ
- కొనుగోలు బేరసారాలంటూ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు!
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఊహించని మలుపు తిరిగాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న తిరుగుబాటు తరహాలోనే.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీకి చెందిన పలువురు లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన పలువురు ఎంపీల మొబైల్ ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ రావడం, వారు పార్టీ అగ్రనేతలకు ‘నాట్ రీచబుల్’ మారడంతో శివసేన ఉద్ధవ్ వర్గంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఊహాగానాల నడుమ బుధవారం ఉదయాన్నే ఢిల్లీలోని శ్రీకాంత్ షిండే (ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు) అధికారిక నివాసంలో ఉద్ధవ్ వర్గపు తిరుగుబాటు ఎంపీలు సమావేశం కాబోతుండటం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కీలక భేటీలో సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అసలైన శివసేనతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ ఎంపీల జాబితాలో సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నాగేష్ పాటిల్ అస్తికార్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహబ్ వాక్‌చౌరే , సంజయ్ జాదవ్ ఉన్నారు. వీరికి అదనంగా రాజాభౌ వాజే కూడా ఈ తిరుగుబాటు గ్రూపులో చేరే అవకాశం ఉందని గట్టిగా వినబడుతోంది. వీరంతా మొదట శ్రీకాంత్ షిండే నివాసంలో భేటీ అయి, ఆపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవడానికి సమయం కోరినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ఉద్ధవ్ వర్గం నుండి విడిపోయి ముందుగా ఒక ప్రత్యేక గ్రూపుగా (ఫ్యాక్షన్) ఏర్పడి, ఆ తర్వాత ఆ సమూహాన్ని అధికారికంగా ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీలో విలీనం చేయడానికి వ్యూహాత్మక చట్టపరమైన కసరత్తులు పూర్తి చేసినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, ఈ సంక్షోభాన్ని ముందే ఊహించిన ఉద్ధవ్ థాకరే, ఇతర అగ్రనేతలు సదరు ఎంపీలను బుజ్జగించడానికి వ్యక్తిగతంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్ధవ్‌కు అత్యంత విధేయులైన లోక్‌సభ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ బుధవారం అత్యవసరంగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పటికే ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు. ముంబైలోని ఉద్ధవ్ నివాసంలో ఆదివారం జరిగిన అత్యవసర సమావేశానికి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే భౌతికంగా హాజరుకావడం, మిగిలిన ఐదుగురు ఎంపీలు వ్యక్తిగత కారణాలు చెప్తూ ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా మాత్రమే మాట్లాడటంతోనే ఈ తిరుగుబాటుకు పునాది పడిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్.. ముంబై సమావేశాన్ని ఎగ్గొట్టి, సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్‌తో రహస్యంగా భేటీ కావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
ఈ పరిణామాలపై అధికార శివసేన నేత, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ స్పందిస్తూ.. ప్రజాప్రతినిధులకు తమ సొంత నాయకత్వంపై నమ్మకం పోయినప్పుడు, వారు శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే ఆశయాలను నమ్మి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోకి రావాలనుకుంటే తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ పరిణామాలను తీవ్రంగా ఖండించిన సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా అధికార కూటమిపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర ఎంపీలను కొనుగోలు చేయడానికి (ఆపరేషన్ టైగర్) ఒక్కొక్కరికి ఏకంగా రూ.15 కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇస్తున్నారంటూ ‘అప్నా సప్నా మనీ.. మనీ!’ అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీలెవరూ పార్టీని వీడటం లేదని, మీడియానే తప్పుడు ప్రచారం చేస్తోందని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. బుధవారం ఢిల్లీలో జరగబోయే రాజకీయ పరిణామాలు ఠాక్రే వర్గానికి కోలుకోలేని దెబ్బ తీసేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.