Sunday, 2 August 2026

వరుసగా మూడో కామన్వెల్త్ స్వర్ణం

 

చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు–2026లో విజయవంతమైన ప్రదర్శనతో భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 2014లో రజతం, అనంతరం వరుసగా మూడు ఎడిషన్లలో స్వర్ణం సాధిస్తూ మొత్తం నాలుగు కామన్వెల్త్ పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. “భారత్‌కు పతకం సాధించడం ఎంతో గర్వంగా ఉంది. నేను మణిపూర్‌కు చెందిన వ్యక్తిని కావడం మరింత ఆనందంగా ఉంది. దేశం కోసం ఏదో సాధించగలిగినందుకు సంతోషంగా ఉంది” అని చాను తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఢిల్లీ మీతేయి కోఆర్డినేటింగ్ కమిటీ ఘన స్వాగతం పలికింది.




భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టు ప్రధాన కోచ్ విజయ్ శర్మ జట్టు ప్రదర్శనను ప్రశంసిస్తూ, మీరాబాయి చాను సాధన అసాధారణమని కొనియాడారు. వరుసగా నాలుగు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన మహిళ ప్రపంచంలోనే మీరాబాయి ఒక్కరేనని, ఆమె క్రమశిక్షణ, అంకితభావమే ఈ విజయానికి కారణమని అన్నారు. ఇకపై ఆసియా క్రీడలపై దృష్టి సారించి అక్కడ కూడా పతకాలు సాధించడమే లక్ష్యమని వెల్లడించారు.

మహిళల 53 కిలోల విభాగంలో రజత పతకం గెలిచిన జ్ఞానేశ్వరి యాదవ్ ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ తమకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పురుషుల 60 కిలోల విభాగంలో రజత విజేత రిషికాంత్ సింగ్ ఈ విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, భవిష్యత్ పోటీల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని సంకల్పించానని చెప్పారు. 110 కిలోల హెవీవెయిట్ విభాగంలో రజతం సాధించిన లవ్‌ప్రీత్ సింగ్ వచ్చే నెల జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించారు.

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టు మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. మీరాబాయి చాను స్వర్ణం గెలవగా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, వల్లూరి అజయ బాబు, లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకాలు సాధించారు. బింద్యారాణి దేవి కాంస్య పతకంతో భారత్‌కు మరో గౌరవాన్ని తీసుకొచ్చారు.

English #Tags:

No comments:

Post a Comment

Featured post

దేశమంతటా వానల విలయతాండవం

అస్సాంలో 82కి చేరిన మృతులు కేరళలో ఎనిమిది మంది బలి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చడంతో పలు ...