Friday, 21 August 2026

వందేమాతరం వివాదం.. షర్మిలా ఠాగూర్‌ వర్సెస్‌ కంగనా రనౌత్‌



  • మతపరమైన ప్రస్తావనలపై ఫర్మిలా అభ్యంతరం
  • కళను మతానికి పరిమితం చేయొద్దన్న కంగనా


న్యూఢిల్లీ: దేశభక్తి గీతం ‘వందేమాతరం’పై మరోసారి రాజకీయ, సాంస్కృతిక చర్చ మొదలైంది. సినీ దిగ్గజం షర్మిలా ఠాగూర్‌, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ ఈ అంశంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. వందేమాతరంలోని కొన్ని చరణాల్లో దేవతల ప్రస్తావన ఉండటంపై షర్మిలా ఠాగూర్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కవిత్వాన్ని, కళను కేవలం మతపరమైన కోణంలో చూడటం సరికాదని కంగనా రనౌత్‌ ఘాటుగా స్పందించారు.


ఇటీవల పార్లమెంట్‌ జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా వందేమాతరానికి అవమానాల నుంచి రక్షణ కల్పించడంతో పాటు జాతీయ గీతంతో సమానమైన ప్రాధాన్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకున్నారు. అంతకుముందు జనవరిలో కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేస్తూ.. జాతీయ గీతంతో పాటు వందేమాతరం రెండింటినీ ఆలపించే సందర్భంలో ముందుగా పూర్తి వందేమాతరాన్ని పాడాలని సూచించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం స్వాతంత్య్రానికి ముందు అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తూ వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని ప్రకటించడం తాజాగా వివాదానికి దారితీసింది.


  • వందేమాతరంలోని మతపరమైన ప్రస్తావనలపై షర్మిలా ఠాగూర్‌


వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో షర్మిలా ఠాగూర్‌ మాట్లాడుతూ.. భారతదేశంలో అనేకమంది ఒకే దేవుడిని విశ్వసించే మతాలకు చెందినవారని, అందువల్ల వందేమాతరంలోని తర్వాతి చరణాల్లో ఉన్న మతపరమైన ప్రస్తావనలు కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చని అన్నారు. ముఖ్యంగా కాళీ, దుర్గ వంటి దేవతల ప్రస్తావనలను ఆమె ప్రస్తావించారు. ఏకేశ్వరవాదాన్ని విశ్వసించే మతాలకు చెందిన వారు అలాంటి చరణాలను ఆలపించడంలో ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని అన్నిమతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుంటే తొలి రెండు చరణాలు అందరికీ అనుకూలంగా ఉంటాయని షర్మిలా ఠాగూర్‌ పేర్కొన్నారు.


  • షర్మిలా వ్యాఖ్యలపై కంగనా ఘాటు స్పందన


షర్మిలా ఠాగూర్‌ వ్యాఖ్యలతో విభేదించిన కంగనా రనౌత్‌.. ఆమె వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. షర్మిలాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు గౌరవం ఉందని చెబుతూనే, ఒక కళాకారిణిగా ఆమె కళ, కవిత్వాన్ని ఇంత పరిమితమైన దృష్టితో ఎలా చూడగలిగారో ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. కవిత్వంలో, పాటల్లో పదాలు తరచూ రూపకాలుగా ఉంటాయని కంగనా వివరించారు. కవి లేదా కళాకారుడు తన భావాన్ని బలంగా వ్యక్తీకరించేందుకు ఊహలు, ప్రతీకలు, ఉపమానాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. వందేమాతరం కేవలం ఒక మతపరమైన గీతం కాదని.. అది భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే మహత్తర రచన అని కంగనా అన్నారు. బంకించంద్ర ఛటోపాధ్యాయ దేశంలో అంతర్లీనంగా ఉన్న శక్తిని మేల్కొలిపేందుకు వందేమాతరాన్ని రచించారని పేర్కొన్నారు.

వివేకానందుడు ‘ఇనుము వంటి శరీరం, ఉక్కు వంటి ఎముకలు, పిడుగులా ప్రవహించే శక్తి కలిగిన యువత కావాలి’ అని చెప్పిన విషయాన్ని కంగనా ప్రస్తావించారు. అది వాతావరణం గురించి చెప్పిన మాటలు కాదని, ప్రజల్లోని శక్తి మేల్కొనాలని ఆయన ఇచ్చిన పిలుపు అని వివరించారు. మతాల మధ్య విభేదాల దృష్టితో కాకుండా వందేమాతరాన్ని చూడాలని కంగనా సూచించారు. ఒకే దేవుడిని విశ్వసించే వారు కూడా ‘శక్తి’ అనే భావనను అర్థం చేసుకోగలరని పేర్కొంటూ.. పరస్పరం ఆత్మీయతతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.


వందేమాతరం చుట్టూ సాగుతున్న ఈ తాజా చర్చలో.. ఒకవైపు గీతంలోని మతపరమైన ప్రతీకలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు వాటిని భారతీయ సంస్కృతి, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకలుగా చూడాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured post

నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌ హవా

చిరంజీవి కెరీర్‌లో ఈ ఐదు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే! టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని మరపురా...