Monday, 3 August 2026

రికార్డు స్థాయిలో రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు


  • ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత తొలిసారి.. 



న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారత్‌ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంది. జులై నెలలో రోజుకు 2.8 మిలియన్‌ బ్యారెళ్ల రష్యన్‌ క్రూడ్‌ను కొనుగోలు చేసినట్లు షిప్‌ ట్రాకింగ్‌ సంస్థ కెప్లర్‌ వెల్లడించింది. హర్మూజ్‌ జలసంధిలో పరిస్థితులు మెరుగుపడటంతో పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలు పెరిగినా, రష్యా నుంచి దిగుమతులు కూడా భారీగా కొనసాగడం విశేషం.

కెప్లర్‌ గణాంకాల ప్రకారం, జులైలో భారత్‌ ప్రపంచ దేశాల నుంచి రోజుకు 5 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంది. జూన్‌తో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. రష్యా నుంచి చమురు దిగుమతులు జూన్‌లో రోజుకు 2.7 మిలియన్‌ బ్యారెళ్ల ఉండగా, జులైలో 2.8 మిలియన్‌ బ్యారెళ్లకు పెరిగాయి. దీంతో భారత్‌ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 55.5 శాతానికి చేరుకుంది.

రష్యా నుంచి నిరంతరాయంగా చమురు అందుబాటులో ఉండటమే దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణమని కెప్లర్‌ ప్రధాన విశ్లేషకుడు నిఖిల్‌ దుబే తెలిపారు. మరోవైపు, ఎల్‌పీజీ దిగుమతుల్లో మాత్రం భారత్‌ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. జులైలో దిగుమతి చేసుకున్న 1.2 మిలియన్‌ టన్నులకు పైగా ఎల్‌పీజీలో దాదాపు 73 శాతం అమెరికా నుంచే కొనుగోలు చేసినట్లు నివేదిక పేర్కొంది.

అదే సమయంలో పశ్చిమాసియా దేశాల నుంచి కూడా భారత్‌ చమురు కొనుగోళ్లను పెంచుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి దిగుమతులు జూన్‌లో రోజుకు 2.9 లక్షల బ్యారెళ్ల నుంచి జులైలో 4.2 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఇరాక్‌, కువైట్‌ల నుంచి కూడా సరఫరాలు తిరిగి ఊపందుకున్నాయి. అయితే యూఏఈ నుంచి దిగుమతులు కొంత తగ్గినప్పటికీ, భారత్‌కు రెండో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఆ దేశం కొనసాగుతోంది.

No comments:

Post a Comment

Featured post

బీజేపీ క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేస్తున్న పార్టీ: సాయోని ఘోష్‌

విపక్షాల్లో తీవ్ర గందరగోళం.. ప్రజలకు ప్రస్తుతం నమ్మదగిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అధికార పార్టీ వైపు ఉప ఎన్నికల్లో మొగ్గు సాధారణమే.. ప్రజ...