- ‘మోడీ చాలీసా’ పఠనం కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్‌కు పూజలు నిర్వహించడం, ‘మోడీ చాలీసా’ను పఠించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాల్లో ప్రధాని మోడీని దేవుడి రూపంలో చూపించేలా ఏర్పాటు చేసిన కటౌట్ కనిపించింది. కార్యక్రమంలో ‘మోడీ చాలీసా’ పేరుతో రూపొందించిన భక్తిగీతాన్ని కూడా చదివారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రెస్ క్లబ్ నిర్వహణపై కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. “ఈ రోజు మా ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఆ కార్యక్రమాన్ని క్లబ్ నిర్వహించలేదని స్పష్టం చేస్తున్నాం” అని తెలిపింది. ఓ సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశం కోసం ప్రెస్ క్లబ్ హాల్‌ను అద్దెకు తీసుకుందని, అయితే హాల్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను నిర్వాహకులు ఉల్లంఘించడంతో క్లబ్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని నిలిపివేశారని వెల్లడించింది.
మోడీ ఆలయ నిర్మాణానికి ప్రణాళిక
కాగా, ఈ కార్యక్రమ నిర్వాహకుడిగా పేర్కొంటున్న బిహార్ స్టేట్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఆలయం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. “ట్రాన్స్‌జెండర్ సమాజానికి హక్కులు కల్పించేందుకు తొలిసారిగా ప్రధాని మోడీ చర్యలు తీసుకున్నారు. అలాంటి వ్యక్తికి ఆలయం నిర్మించాలనుకుంటే తప్పేంటి?” అని రాజన్ సింగ్ ప్రశ్నించారు. బిహార్‌లో ఐదు ఎకరాల స్థలంలో సుమారు రూ.112 కోట్ల వ్యయంతో ‘శ్రీ నరేంద్ర మోడీ’ ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానికి దేవుడి స్థానం కల్పించడంపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ట్రాన్స్‌జెండర్ సమాజానికి ప్రస్తుత ప్రభుత్వం తొలిసారిగా హక్కులు కల్పించిందని, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (రక్షణ హక్కులు) సవరణ చట్టంపై కూడా రాజన్ సింగ్ స్పందించారు. లింగ స్వీయ నిర్ణయ హక్కును ఈ చట్టం దెబ్బతీస్తోందంటూ వస్తున్న విమర్శలను ప్రస్తావించగా, “ట్రాన్స్‌జెండర్ సమాజం ఈ చట్టానికి వ్యతిరేకం కాదు. ప్రతిపక్షమే దీనిని వ్యతిరేకించింది” అని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో మోడీ కటౌట్‌కు పూజలు నిర్వహించిన ఘటనపై వివరణ ఇచ్చినప్పటికీ, నిర్వాహకుల వ్యాఖ్యలు, మోడీ ఆలయ నిర్మాణ ప్రతిపాదన ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
No comments:
Post a Comment