Thursday, 20 August 2026

పార్లమెంటరీ కమిటీల పునర్వ్యవస్థీకరణకు ఎదురుచూపులు



  • నైతికత నుంచి ఆర్థిక పర్యవేక్షణ వరకు పెండింగ్‌లోనే!


న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పలు కమిటీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఎంపీల నైతిక ప్రవర్తనపై ఫిర్యాదులను పరిశీలించే ఎథిక్స్‌ కమిటీ సహా పలు కమిటీల గత పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త కమిటీల ఏర్పాటు, చైర్మన్ల నియామకం జరగలేదు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు, శాసన ప్రక్రియలో కీలకమైన పర్యవేక్షణ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రూల్స్‌ కమిటీ, ఎథిక్స్‌ కమిటీ సహా పలు పార్లమెంటరీ ప్యానెళ్లు ప్రస్తుతం అధికారికంగా పునర్వ్యవస్థీకరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యమైన శాఖలకు సంబంధించిన స్థాయీ కమిటీలను నిర్ణీత వ్యవధుల్లో పునర్వ్యవస్థీకరిస్తున్నప్పటికీ, అంతర్గత వ్యవహారాలు, ప్రత్యేక అంశాలకు సంబంధించిన కొన్ని కమిటీల విషయంలో మాత్రం పరిపాలనా జాప్యం కొనసాగుతోంది.


కీలక కమిటీలు ఇంకా ఏర్పాటు కాలేదు


పునర్వ్యవస్థీకరణ కోసం ఎదురుచూస్తున్న వాటిలో రైల్వే కన్వెన్షన్‌ కమిటీ కూడా ఉంది. కేంద్ర సమీకృత నిధి, రైల్వే ఆర్థిక వ్యవహారాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. లోక్‌సభ సభ్యుల పట్ల ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించడం, అనుచితంగా వ్యవహరించడం వంటి ఫిర్యాదులను పరిశీలించే కమిటీకి కూడా ప్రస్తుతం చైర్మన్‌ లేరు. ఎంపీల నైతిక, అనైతిక ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించే ఎథిక్స్‌ కమిటీ కూడా ఇంకా పునర్వ్యవస్థీకరణకు నోచుకోలేదు. సభ అంతర్గత వ్యవహారాలు, విధి నిర్వహణకు సంబంధించిన అంశాల్లో స్పీకర్‌కు సలహాలు ఇచ్చే జనరల్‌ పర్పసెస్‌ కమిటీ సైతం ప్రస్తుతం ఏర్పాటు కాలేదు.


శాసన ప్రక్రియపైనా ప్రభావం


ప్రభుత్వం సభ ముందు ప్రవేశపెట్టే పత్రాలు, నివేదికలు చట్టబద్ధ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించే పేపర్స్‌ లెయిడ్‌ ఆన్‌ ది టేబుల్‌ కమిటీ కూడా పునర్వ్యవస్థీకరణ కోసం ఎదురుచూస్తోంది. ఎంపీలు ప్రవేశపెట్టే ప్రైవేట్‌ మెంబర్స్‌ బిల్లులు, తీర్మానాలను పరిశీలించి వాటికి సభా సమయాన్ని కేటాయించే ప్రైవేట్‌ మెంబర్స్‌ బిల్స్‌ అండ్‌ రిజల్యూషన్స్‌ కమిటీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. లోక్‌సభలో కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల్లో మార్పులు, సవరణలను సిఫారసు చేసే రూల్స్‌ కమిటీకి కూడా ప్రస్తుతం చైర్మన్‌ లేరు. ఎంపీలకు కేటాయించే నివాసాలు, ఇతర సౌకర్యాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే హౌస్‌ కమిటీ పునర్వ్యవస్థీకరణ కూడా పెండింగ్‌లో ఉంది.


ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 ప్రకారం ఒక నిర్దిష్ట పదవిని చేపట్టడం వల్ల ఎంపీగా కొనసాగేందుకు అనర్హత ఏర్పడుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించే జాయింట్‌ కమిటీ ఆన్‌ ఆఫీసెస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ కూడా ఇంకా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. కీలకమైన ఈ కమిటీల ఏర్పాటు ఆలస్యం కావడంతో పార్లమెంటరీ పర్యవేక్షణ, శాసన వ్యవహారాలపై వాటి పాత్ర పూర్తిస్థాయిలో కొనసాగడంలో జాప్యం ఏర్పడుతోందన్న చర్చ జరుగుతోంది.

No comments:

Post a Comment

Featured post

నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌ హవా

చిరంజీవి కెరీర్‌లో ఈ ఐదు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే! టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని మరపురా...