Monday, 3 August 2026

ఝార్ఖండ్‌లో మరో పేపర్‌ లీక్‌ కలకలం

  • విద్యార్థుల ఆందోళనలకు సీజేపీ మద్దతు


రాంచీ: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చల్లారకముందే ఝార్ఖండ్‌లో మరో పరీక్షా వివాదం తెరపైకి వచ్చింది. ఝార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్‌సీ) ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు రాంచీలో పెద్దఎత్తున నిరసనలకు దిగారు. పరీక్షను రద్దు చేసి, ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని, నియామక వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మద్దతు ప్రకటించింది.

విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్‌ మహతో ఆదివారం జైపాల్‌ సింగ్‌ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. గత నెల విడుదలైన జేపీఎస్‌సీ ఫలితాల అనంతరం ముఖ్యమంత్రిని కలిసి పేపర్‌ లీక్‌కు సంబంధించిన ఆధారాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం, జేపీఎస్‌సీ తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారిలో నిరాశ పెరుగుతోందని, వారికి ధైర్యం చెప్పేందుకు, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

పేపర్‌ లీక్‌ ఆరోపణలు, నియామక ప్రక్రియలో అవకతవకలు, పాలనాపరమైన లోపాల కారణంగా తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్లు వైరల్‌ అయిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శిస్తూ, పరీక్షల నిర్వహణలో సంస్థాగత మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, నిరసనకారులతో మాట్లాడినట్లు తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, వారి పోరాటంలో అండగా నిలుస్తామని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

No comments:

Post a Comment

Featured post

బీజేపీ క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేస్తున్న పార్టీ: సాయోని ఘోష్‌

విపక్షాల్లో తీవ్ర గందరగోళం.. ప్రజలకు ప్రస్తుతం నమ్మదగిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అధికార పార్టీ వైపు ఉప ఎన్నికల్లో మొగ్గు సాధారణమే.. ప్రజ...