- రూ. 7 కోట్లతో తీసి రూ. 1,600 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘అబ్సెషన్’ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాలీవుడ్ సైకలాజికల్ హర్రర్చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మేకింగ్, ఎడిటింగ్ , సౌండ్ డిజైన్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూ.. ‘నేను అబ్సెషన్‌తో అబ్సెస్ అయిపోయాను’ (నాకు ఈ సినిమా పిచ్చి పట్టుకుంది) అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. కేవలం అగ్ర నటులు, భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవనే పరిశ్రమ పాత నమ్మకాలను ఈ సినిమా పూర్తిగా మార్చేసిందని ఆర్‌జీవీ కొనియాడారు. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 7 కోట్ల (750,000 డాలర్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా రూ. 1,600 కోట్లకు పైగా (179 మిలియన్ డాలర్లు) వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని వర్మ గుర్తుచేశారు.
ఈ సినిమాలో పెద్ద నటులు, అందమైన విదేశీ లోకేషన్లు, ఆడంబరమైన ప్రొడక్షన్ డిజైన్ లేదా అగ్ర సాంకేతిక నిపుణులు ఎవరూ లేరని ఆర్‌జీవీ విశ్లేషించారు. సాంకేతిక నిపుణుల ఫీజులు పక్కన పెడితే, కేవలం ఒక చిన్న ఇల్లు, కారు ,ఒక చిన్న స్టోర్.. ఇలా కేవలం మూడు ప్రదేశాలలోనే సినిమా మొత్తాన్ని చిత్రీకరించారని, దీని అసలు మేకింగ్ ఖర్చు రూ. 70 లక్షల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని అంచనా వేశారు. దర్శకుడు కర్రీ బార్కర్ అనుసరించిన విజువల్ స్టైల్, ముఖ్యంగా ఫ్రేమ్‌లలో తల భాగం పైన ఎక్కువ ఖాళీ స్థలాన్ని (హెడ్‌స్పేస్) వదిలేయడం వంటి కొత్త ప్రయోగాలు సినిమా మూడ్‌ను అద్భుతంగా పెంచాయని మెచ్చుకున్నారు. ఎడిటింగ్‌ను కేవలం ఒక సాంకేతిక ప్రక్రియగా కాకుండా, ప్రేక్షకులను మానసికంగా భయపెట్టే ఒక ఆయుధంగా దర్శకుడు ఉపయోగించారని, ఇంటర్వెల్ సీన్‌లో హీరోయిన్ నిక్కీ ముఖాన్ని చాలా సేపు ఒకే షాట్‌లో చూపించడం ద్వారా ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచారని ఆర్‌జీవీ వివరించారు.
సినిమాలోని పాత్రలు మానసికంగా అస్థిరంగా ఉన్నప్పుడు, చూసే ప్రేక్షకుడికి కూడా అదే ఫీలింగ్ వచ్చేలా ఎడిటింగ్ రూల్స్‌ను పక్కన పెట్టి చేసిన ప్రయోగం అద్భుతంగా పనిచేసిందని వర్మ కొనియాడారు. తలుపు వేయడం, నవ్వడం, గుండె చప్పుడు వంటి శబ్దాలకు అనుగుణంగా సీన్లను కట్ చేసిన విధానం , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ఫించర్ శైలిని తలపించేలా సింగిల్-సోర్స్ లైటింగ్ ఉపయోగించిన తీరు అద్భుతమని ప్రశంసించారు. బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ వసూళ్ల కంటే కూడా, ఈ సినిమాలో ఉపయోగించిన వినూత్నమైన ఎడిటింగ్, సౌండ్ డిజైన్ ,క్యారెక్టర్ డిజైనింగ్ గురించి సినిమా విద్యార్థులు ఎక్కువగా అధ్యయనం చేయాలని ఆర్‌జీవీ సూచించారు. మైఖేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక అలౌకిక శక్తులున్న బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం మే 29న భారతదేశంలో విడుదలై ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
No comments:
Post a Comment