Saturday, 13 June 2026

ఆదివారమే ఇరాన్‌తో చరిత్రాత్మక ఒప్పందం


  • హార్ముజ్ జలసంధి అందరికీ ఓపెన్
  • ట్రంప్ సంచలన ప్రకటనతో విభేదించిన టెహ్రాన్
  • నేడు సంతకాలు జరగడం లేదంటూ విదేశాంగ శాఖ స్పష్టీకరణ!

పశ్చిమాసియా భీకర యుద్ధానికి తెరదించే చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంతర్జాతీయ శాంతి ఒప్పందం ఆదివారమే (జూన్ 14, 2026) ఖరారు కాబోతున్నదని, ఈ ముసాయిదాపై సంతకాలు ముగిసిన తక్షణమే ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి ‘హార్ముజ్ జలసంధి’ని ప్రపంచ దేశాల రవాణా కోసం పూర్తిస్థాయిలో తెరిచి ఉంచుతామని ట్రంప్ ప్రకటించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో పెట్టిన పోస్ట్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్‌తో కుదుర్చుకున్న ‘జేసీపీఓఏ’ (JCPOA) అణు ఒప్పందాన్ని తీవ్రంగా ఎండగట్టారు. ఒబామా చేసిన తప్పుడు ఒప్పందం ఇరాన్ సులువుగా అణుబాంబు తయారు చేసుకోవడానికి, ఆ దేశ అణు లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి ఒక అందమైన రాజమార్గాన్ని పరిచిందని.. దానికి భిన్నంగా తన ప్రస్తుత ఒప్పందం ఇరాన్ అణుబాంబును తయారు చేయకుండా అడ్డుకునే ఒక బలమైన గోడ లాంటిదని ఆయన అభివర్ణించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ఇకపై అణు ఆయుధాలను కోరుకోవడం లేదని, భవిష్యత్తులో కొనుగోలు ద్వారా లేదా స్వంత అభివృద్ధి ద్వారా ఇరాన్ అణుబాంబును సాధించలేదని ట్రంప్ స్పష్టం చేశారు.



ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను (Enriched Uranium) అమెరికా తన స్వాధీనంలోకి తీసుకుని పూర్తిగా నాశనం చేయబోతోందనే కీలక సంకేతాన్ని కూడా ట్రంప్ ఇచ్చారు. అంతా ప్రశాంతంగా మారిన తర్వాత.. అత్యంత శక్తివంతమైన గ్రానైట్ పర్వతాల కింద భూగర్భంలో దాచిన ‘అణు ధూళి’ని (యురేనియంను) తమ అద్భుతమైన బి-2 బాంబర్ విమానాలు, మేధావులైన పైలట్ల సహాయంతో వెలికితీస్తామని.. ఆ నిల్వలను ఇరాన్‌లో లేదా అమెరికాలో పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరాన్ , యావత్ పశ్చిమాసియాతో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని చెబుతూనే.. ఈ శాంతి ప్రణాళికను ఇరాన్ పూర్తిగా అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ ప్రక్రియ అంతా త్వరగా, సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నానని.. ఒకవేళ అలా జరగకపోతే తమ వద్ద అత్యంత భయంకరమైన ప్రత్యామ్నాయ మార్గం (సైనిక చర్య) సిద్ధంగా ఉందని, దానిని ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని కోరుకుంటున్నట్లు ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు.


అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ఆకస్మిక ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం తక్షణమే తోసిపుచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ శనివారం రాత్రి టెహ్రాన్‌లో మాట్లాడుతూ.. అమెరికాతో కుదుర్చుకోబోయే ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ (Islamabad Memorandum) పై ఆదివారం సంతకాలు జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ చరిత్రాత్మక ఒప్పందం ఖరారయ్యే అవకాశాలను తాము తోసిపుచ్చడం లేదని.. అయితే అవతలి పక్షం (అమెరికా) ఊగిసలాట ధోరణి , కొన్ని సాంకేతిక అంశాలపై వారి సంకోచాల కారణంగా, ఒప్పందం జరిగే కచ్చితమైన తేదీపై ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని, మీడియా ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ట్రంప్ ఆదివారమే సంతకాలు అంటూ హడావిడి చేస్తుండగా.. ఇరాన్ మాత్రం ఆ తేదీని తిరస్కరించడంతో ఈ అంతర్జాతీయ శాంతి ఒప్పందం చుట్టూ ఉన్న ఉత్కంఠ మరింతగా పెరిగింది.

No comments:

Post a Comment

Featured post

అమెరికా ఆర్డర్లకు లొంగిపోయిన ప్రధాని

గల్ఫ్‌లో ముగ్గురు భారతీయ నావికుల మృతిపై మోడీ మౌనాన్ని నిలదీసిన రాహుల్  అగ్రరాజ్యం క్షమాపణలు చెప్పకపోగా హుకుం జారీ చేస్తోందని ఆగ్రహం ఒమన్ తీర...