'భూమ్మీద మానవాళి మనుగడ కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. మనవల్ల భూమికి భారం పెరగకుండా చూసుకోవాలి'- భగత్ పూరణ్ సింగ్, పర్యావరణవేత్త
కొవిడ్ కు ముందు ఒక లెక్క తర్వాత మరో లెక్క అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు సంభవించాయి. ఆ మహమ్మారి చేసిన హెచ్చరిక ఈ భూభాగంపై జీవరాశుల్లో అత్యంత తెలివిగలవాడు, అత్యంత ప్రమాదకారి మనిషే అని చెప్పకనే చెప్పింది. అందుకే లాక్‌డౌన్ కాలంలో ఆధునిక అభివృద్ధికి చిహ్నాలుగా కనిపించే హైవే రోడ్లపైకి అడవిలో ఉండే జంతువులు వచ్చాయి. మనుషులు కనిపించనిచోట మనల్ని ఎవడు రా ఆపేది అన్నట్టు ఆ కాలమంతా స్వేచ్ఛగా తిరిగాయి. వాటికి కొవిడ్ భయం లేదు. వ్యాక్సిన్ వాటికి అవసరం కాలేదు. గుంపులు గుంపులుగా ఉండొద్దు అన్న నిబంధనలేవీ వాటికి వర్తించలేదు. స్థూలంగా చెప్పాలంటే ప్రకృతి ప్రపంచానికి చాలా ఇచ్చింది. వాటిని మనిషి తన అవసరం మేరకే వాడుకోవాలని తదుపరి భవిష్యత్తు తరాలకు మిగల్చాలని సూచన చేసింది. ప్రకృతి తనను కాపాడితే కడుపులో పెట్టుకుంటానని, లేకపోతే కన్నెర్ర చేస్తానని అప్పుడప్పుడు పాఠాలు చెబుతూనే ఉంటుంది. అందుకే మన కోసం అన్నీ ఇస్తున్న నేచర్‌కు మనం కృతజ్ఞులుగా ఉండాలి.
కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నది? బడిత ఉన్న వాడిదే బర్రె అన్నట్టు ఆర్థికంగా, ఆయుధపరంగా బలంగా ఉన్న దేశాలు బలహీనదేశాలపై దాడులు చేస్తున్నాయి. ఫలితంగా యుద్ధంతో సంబంధంలేని అనేక దేశాల్లోని మారుమూల గ్రామాల్లో గ్యాస్ కొరత, నిత్యావసర వస్తువుల పెరుగుదల, పెట్రోల్, డీజీల్ ధరల మోత, ఎరువుల కొరత ఇట్లా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రెండు ప్రపంచయుద్ధాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి మనుషులు ఇంకా గుణపాఠాలు నేర్చుకోవడం లేదని అనిపిస్తుంది. యుద్ధం వల్ల పర్యావరణం దెబ్బతింటున్నది. వేలల్లో మనుషులు చనిపోతున్నారు. కోట్లల్లో నిరాశ్రయులు అవుతున్నారు. ఉపాధి కోల్పోయి వలస బాట పడుతున్నారు. కొంతమంది స్వార్థాలకు కోట్లాదిమంది బలవుతున్నారు.
ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే.. ఈ మద్య నా ఇంటర్మీడియట్ దోస్తు స్వామి కాల్ చేసి మన గోదావరిఖనిలో ఉండలేకపోతున్నాం రా. ఎండల తీవ్రత అట్లా ఉన్నది. పెద్ద పెద్ద కూలర్లు కూడా పనిచేయడం లేదన్నాడు. 80వ, 90వ దశకం పిల్లలు ఇదే నడీ ఎండకాలంలోనూ సింగరేణి స్టేడియంలో పొద్దంతా క్రికెట్ ఆడినరోజులున్నాయి. కానీ ఇప్పుడు బైటికి వస్తే వడదెబ్బకు బలవుతారు అన్నట్టు పరిస్థితులు నెలకొన్నాయి. కోల్‌బెల్ట్ ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ లాంటి పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉపాధి కోసం ఊళ్లు వదిలి గోదావరిఖని వచ్చిన వాళ్లు ప్రమాదకర పరిస్థితుల మధ్య పని చేశారు. సంస్థ అభివృద్ధికి తమ చెమట చుక్కలు ధారపోశారు. కాలం గడిచే కొద్దీ ఉత్పత్తి పెరిగింది. ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పర్యావరణం విధ్వంసమైంది. ఇవాళ జూన్ 5.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా అనేక ఏళ్లుగా ప్రతిజ్ఞలు చేస్తున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి సరిగా అమలుచేయలేకపోతున్నాం. పర్యావరణ వరణ పరిరక్షణ అన్నది నినాదంగా కాకుండా మనిషి జీవన విధానంగా మారనంత కాలం అనేక విపత్తులు వస్తుంటాయి. తద్వారా ప్రకృతి తనను తాను ప్రక్షాళన చేసుకుంటుంది. తన పరిరక్షణ బాధ్యతను తానే తీసుకుంటున్నది. ప్రకృతి హెచ్చరికలను అనుక్షణం గుర్తుచేసుకుంటూ బాధ్యతగా మెలిగితే ప్రపంచం బాగుటుంది. ప్రకృతి బాగుంటుంది. భూమ్మీద మనమూ బాగుంటాం కదా!
No comments:
Post a Comment