- అజిత్ దోవల్, వాంగ్ యీ కీలక భేటీ
న్యూఢిల్లీ: భారతదేశం , చైనా దేశాల మధ్య గత నాలుగేళ్లకు పైగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన తూర్పు లడఖ్ సరిహద్దు వివాదానికి ముగింపు పలికి, ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ పునరుద్ధరించే దిశగా అత్యంత కీలకమైన అడుగు పడింది. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం న్యూఢిల్లీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సదస్సుకు హాజరయ్యేందుకు విచ్చేసిన వాంగ్ యీ.. ఈ సదస్సు మైదానంలో అజిత్ దోవల్ తో విడిగా భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య కొంతకాలంగా సాగుతున్న దౌత్యపరమైన పురోగతిని సమీక్షించిన ఈ సమావేశం అత్యంత "నిర్మాణాత్మకంగా, భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో సాగిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ అత్యున్నత స్థాయి భేటీలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రాయబారి విక్రమ్ దొరైస్వామిలతో పాటు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ లు కూడా పాల్గొన్నారు.
ఈ కీలక చర్చల సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న భారత్, చైనాల మధ్య స్థిరమైన, ఊహించదగిన, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉండటం ఎంతో ఆవశ్యకమని ఉద్ఘాటించారు. ఇటువంటి సానుకూల వాతావరణం ఇరుపక్షాల మధ్య పరస్పర నమ్మకాన్ని, పారదర్శకతను , మెరుగైన అవగాహనను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని చైనా మంత్రికి స్పష్టం చేశారు. గత 2020 లో జరిగిన ఘోరమైన గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు చరిత్రలోనే అత్యంత దిగువస్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది కాలంగా ఇరుదేశాలు దౌత్య, సైనిక మార్గాల ద్వారా చేపట్టిన నిరంతర చర్చల ఫలితంగా.. తూర్పు లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి గల పలు ఉద్రిక్త ప్రాంతాల నుండి ఇరు దేశాలు తమ సైన్యాలను విజయవంతంగా వెనక్కి తీసుకున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 2024 లో డెప్సాంగ్, డెమ్‌చోక్ ల వద్ద సైన్యాల ఉపసంహరణకు కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఈ పురోగతికి మైలురాయిగా నిలిచింది.
ఆ తర్వాత రష్యాలోని కజాన్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ.. ఇరుదేశాల బంధాన్ని సరికొత్త మలుపు తిప్పింది. ఆ ఊపు ను కొనసాగిస్తూ.. గత ఏడాది చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగిన ఎస్సీఓ (SCO) సదస్సు సందర్భంగా కూడా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు విస్తృతంగా చర్చలు జరిపారు. ఆనాడు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్, చైనా దేశాలు పరస్పర నమ్మకం, పరస్పర గౌరవం మరియు ఒకరి సున్నితత్వాన్ని మరొకరు గౌరవించుకుంటూ ముందుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్-చైనాలు కేవలం అభివృద్ధి భాగస్వాములు మాత్రమే కానీ, శత్రువులు కాదని ఇరు దేశాల అధినేతలు అంగీకరించారు. గత ఆగస్టులో న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల (SR) 24వ రౌండ్ చర్చల తర్వాత సరిహద్దుల్లో శాంతిభద్రతలు స్థిరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో 2.8 బిలియన్ల జనాభా కలిగిన ఈ రెండు ఆసియా దేశాల మధ్య మరింత పటిష్టమైన ఆర్థిక, వ్యూహాత్మక బంధం ఏర్పడటానికి తాజా అజిత్ దోవల్ - వాంగ్ యీ భేటీ ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

No comments:
Post a Comment