Tuesday, 30 June 2026

కాళేశ్వరం కూలినా వరిసాగులో తెలంగాణే నంబర్ వన్

  • కేసీఆర్ పాపాలు నా నెత్తిన పెట్టారు.. 
  • మోడీ, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు
  • రూ. లక్ష కోట్లు లూటీ చేసినా బోరు బావుల కిందే పంటలు
  • సర్పంచుల బిల్లులు ఎగ్గొట్టింది బీఆర్ఎస్సే.. 
  • 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా జమ, 
  • శిల్పకళావేదిక వేదికగా సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం వేల కోట్ల రూపాయల కమీషన్ల కోసమే ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఆ రూ. లక్ష కోట్ల ప్రాజెక్టు ఇవాళ కూలిపోయినా.. తెలంగాణ రైతులు తమ కష్టార్జితంతో వరిసాగులో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారని కొనియాడారు. రైతులు తమ సొంత ఖర్చులతో బోరు బావుల కింద పంటలు పండిస్తుంటే.. అదంతా కాళేశ్వరం మహిమ అంటూ గత పాలకుడు కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోని శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా నిర్వహించిన సభలో రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.



కేసీఆర్ హయాంలో రైతుల రుణమాఫీ ఎప్పుడైనా పూర్తిగా జరిగిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం వంటి ఏ ఒక్క హామీనైనా కేసీఆర్ నెరవేర్చారా అని నిలదీశారు. తెలంగాణలోని ఊరూరా బెల్ట్ షాపులు తెచ్చి తాగుడు సంస్కృతిని నేర్పించిన కేసీఆర్, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ‘వరి వేస్తే ఉరే’ అని రైతులను బెదిరించి, ధాన్యం కొనకుండా ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ నేతలు, ఫామ్‌హౌస్‌లలో కూర్చుని భార్యాభర్తలు మాట్లాడుకునే వ్యక్తిగత ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ దొంగచాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని స్వయంగా కేసీఆర్ కుమార్తె (కవిత) ఒప్పుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా విరుచుకుపడుతూ.. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామన్న ప్రధాని మోడీ మాట ఏమైందని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ లో సాగిన బీజేపీ పప్పులు తెలంగాణలో ఉడకవని, అక్కడ గెలవడానికే ఆ పార్టీకి 15 ఏళ్లు పడితే.. తెలంగాణలో గెలవడానికి మరో 15 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వం చేసిన రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతికి అప్పగించారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు కేవలం రూ. 60 వేల కోట్లు అయితే, కేసీఆర్ ఒక్కడే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. 2023 నాటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) వంటి ఐఏఎస్ అధికారులకే ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉండేదని, బడి పిల్లల అన్నం బిల్లులను కూడా వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని మండిపడ్డారు. గ్రామాల్లో సర్పంచుల బిల్లులను వేల కోట్లు పెండింగ్ పెట్టింది కేసీఆర్ అయితే.. ఆ బద్నాం, నిందలు మాత్రం తాను మోయాల్సి వస్తోందని, ఇప్పుడు ఆ సర్పంచులు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ఢిల్లీకి వెళ్తే తెలంగాణ పరువు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. అయినప్పటికీ.. ఒక్కో సమస్యను చక్కబెట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చామని, కేవలం రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించామని వివరించారు. ఈసారి ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు వేసుకోవాలని సూచిస్తూ.. వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు కేవలం 9 రోజుల్లోనే రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment

Featured post

కాళేశ్వరం కూలినా వరిసాగులో తెలంగాణే నంబర్ వన్

కేసీఆర్ పాపాలు నా నెత్తిన పెట్టారు..  మోడీ, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు రూ. లక్ష కోట్లు లూటీ చేసినా బోరు బావుల కిందే పంటలు సర్పం...