- జూన్ నెలలో సరికొత్త రికార్డు దిశగా రష్యా చమురు దిగుమతులు
- గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన భద్రత కోసం భారత్ వ్యూహాత్మక అడుగులు
- వెనెజువెలా నుంచి భారీగా నౌకలు, అమెరికా దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా మార్గాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న తరుణంలో.. భారతదేశం తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి వ్యూహాత్మక అడుగులు వేసింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు నోచుకోవడానికి ముందే, భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ల నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారీగా పెంచినట్లు అంతర్జాతీయ నౌకాయాన విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 1 నుంచి జూన్ 19 వరకు గల కాలంలోనే భారత్ రష్యా నుంచి రోజుకు సగటున 26.6 లక్షల బారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలలో నమోదైన 19.1 లక్షల బారెళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. తద్వారా భారతదేశానికి అత్యంత పెద్ద చమురు సరఫరాదారుగా రష్యా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. చౌక ధరలు, ఆకర్షణీయమైన డిస్కౌంట్ల వల్లే రష్యా చమురు భారత్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అటు యూఏఈ నుంచి దిగుమతులు కూడా రికార్డుస్థాయికి చేరువగా రోజుకు 6,36,000 బారెల్స్‌గా నమోదయ్యాయి.
అమెరికా, ఇస్లామిక్ దేశాల దాడుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో గత కొన్ని నెలలుగా గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, ఎల్‌ఎన్‌జీ (LNG), ఎల్‌పీజీ (LPG) సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రపంచవ్యాప్త చమురు వినియోగంలో 20 శాతం వాటా ఈ జలసంధి గుండానే సాగుతుంది కాబట్టి సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలపై భారత్ ఆధారపడటం తగ్గించాల్సి వచ్చింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్ తన కొనుగోలు వనరులను వైవిధ్యభరితంగామార్చుకుంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా (రోజుకు 3,84,000 బారెళ్లు) తర్వాతి స్థానంలో వెనెజువెలా దేశం రోజుకు 2,09,000 బారెళ్ల సరఫరాతో భారత్‌కు నాల్గవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. అయితే, ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతులు మే నెలలో ఉన్న 2,52,000 బారెళ్ల నుంచి జూన్ నాటికి ఏకంగా 91,000 బారెళ్లకు దారుణంగా పడిపోవడం గమనార్హం.
కెప్లర్ సీనియర్ మేనేజర్ సుమిత్ రిటోలియా విశ్లేషణ ప్రకారం.. హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం వల్ల భారతదేశానికి ఎదురవుతున్న లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కొరతకు అత్యంత వేగంగా ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ సంక్షోభం వల్ల భారత్‌లో ఎల్‌పీజీ సరఫరానే అత్యంత దారుణంగా దెబ్బతింది. ముడిచమురు , ఎల్‌ఎన్‌జీ దిగుమతులు ఇతర దేశాల (రష్యా, బ్రెజిల్, ఒమన్, నైజీరియా) ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొంతవరకు నిలకడగానే సాగాయి. హార్ముజ్ జలసంధి తెరిచిన ప్రారంభ దశలో నౌకాశ్రయాలలో చిక్కుకుపోయిన సరుకును క్లియర్ చేయడంపైనే గల్ఫ్ దేశాలు దృష్టి పెడతాయని, కాబట్టి సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం ఇరు దేశాల ఒప్పందం ప్రకారం మూడు భారతీయ చమురు నౌకలు, ఒక ఎల్‌ఎన్‌జీ నౌక ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించడం సానుకూల పరిణామమే అయినప్పటికీ.. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఇరాన్ చేస్తున్న ఆరోపణల వల్ల ఈ తాత్కాలిక శాంతి ఎంతవరకు నిలుస్తుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
No comments:
Post a Comment