Saturday, 20 June 2026

‘నా ప్రజాదరణ గురించి మీకేం పట్టింపు.. ముందు మీ సంగతి మీరు చూసుకోండి!’

 

  • డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆగ్రహం
  •  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘాటు కౌంటర్..
  •  ఇటలీ ఎవరికీ లొంగిపోయే సత్రం కాదు, సార్వభౌమాధికారం గల దేశమంటూ స్పష్టీకరణ!

ఫ్రాన్స్ జీ7 సదస్సు ఫొటో వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని  తీవ్రంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేసిన "అకారణ దాడులు"గా అభివర్ణించిన ఆమె, ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా శ్వేతసౌధ అధినేతకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తన సొంత దేశంలో ప్రజాదరణ పెంచుకోవడానికి ట్రంప్‌తో స్నేహం కోసం తాను పాకులాడుతున్నాననే ప్రచారాన్ని మెలోని పూర్తిగా కొట్టిపారేశారు. "అధ్యక్షుడు ట్రంప్, ఎలాంటి కారణం లేకుండా మీరు చేస్తున్న ఈ నిరంతర దాడులు అర్థరహితమైనవి. నా ప్రజాదరణ విషయానికి వస్తే.. మీతో స్నేహం చేయడం వల్ల దానికి ఎలాంటి లాభం జరగలేదు, అది మీతో ఉండే సంబంధాలపై ఎంతమాత్రం ఆధారపడి లేదు. నా దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడే నా సామర్థ్యంపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది.. నేను ఎల్లప్పుడూ దాన్నే చేస్తూ వచ్చాను. అయినా, నా పాపులారిటీ గురించి మీకేం పట్టింపు లేదు.. దానికి బదులు ముందు మీ ప్రజాదరణ సంగతి ఏంటో మీరు చూసుకుంటే మంచిది" అని మెలోని అత్యంత కఠినమైన పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు.

ఇదే సమయంలో ఇరాన్ యుద్ధ కాలంలో ఇటలీలోని అమెరికా సైనిక స్థావారాలను (మిలిటరీ బేసెస్) ,రన్‌వేలను ఉపయోగించుకోవడానికి అనుమతించలేదంటూ ట్రంప్ వెళ్లగక్కిన అసహనంపై కూడా ప్రధాని మెలోని స్పష్టత ఇచ్చారు. ఇటలీలోని సైనిక స్థావరాల వినియోగం అనేది ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల నిబంధనలకు లోబడి ఉంటుందని, ఆ నిబంధనలను తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తూనే వస్తోందని ఆమె గుర్తుచేశారు. అయితే, ఆ నిబంధనలను ఉల్లంఘించి ఇటలీ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే మాత్రం.. తాను ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం అలాంటి వాటిని ఎంతమాత్రం అనుమతించే ప్రసక్తే లేదని ట్రంప్‌కు తేల్చిచెప్పారు. "ఇటలీ ఎప్పటికీ ఒక స్వతంత్ర సార్వభౌమాధికార దేశం" అని ప్రకటిస్తూ, తమ దేశ అంతర్గత రాజకీయాలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె పూర్తిగా త్రోసిపుచ్చారు.



అంతకుముందు, డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో మెలోనిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జీ7 సదస్సులో ఫొటో కోసం మెలోని తనను పదే పదే బతిమిలాడిందని, ఇటలీలో ఆమె ప్రజాదరణ దారుణంగా పడిపోవడంతో.. తిరిగి ఆ గ్రాఫ్‌ను పెంచుకోవడానికే (గెట్ హర్ నంబర్స్ అప్) ఇప్పుడు అమెరికాతో మళ్లీ స్నేహం కోసం చూస్తోందంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఇరాన్ అణు నిల్వలను ధ్వంసం చేసే మిలిటరీ ఆపరేషన్‌లో ఇటలీ తమ యుద్ధ విమానాలకు రన్‌వేలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు సృష్టించిందని ట్రంప్ మండిపడ్డారు. ఇటలీ టీవీ ఛానెల్ ‘La7’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం "మెలోని ఫొటో కోసం నన్ను యాచించింది, అందుకే జాలిపడి ఫొటోకు అంగీకరించాను" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇటలీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఇటలీలోని అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఖండించగా, ప్రస్తుతం ఇరు దేశాధినేతల మధ్య రేగిన ఈ అంతర్జాతీయ వాగ్వాదం అమెరికా-ఇటలీ దౌత్య సంబంధాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.

No comments:

Post a Comment

Featured post

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన ప్రారంభం మాత్రమే

రాబోయే అనేక దశాబ్దాలు దేశంలో బీజేపీ, ఎన్డీఏ రాజ్యమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా కొల్హాపూర్‌లో రూ.500 కోట్ల మహాలక్ష్మి అమ్మవారి కారిడార్ ప...