- బీజేపీ వీడే యోచనలో అన్నామలై
- ఢిల్లీలో హైకమాండ్‌తో భేటీ
తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో కీలక భేటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా , తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, బీజేపీలో తనకు భవిష్యత్తు లేదని భావిస్తున్నట్లు ఆయన అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. ఇకపై రాజకీయంగా తన సొంత దారిని ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన అగ్రనాయకత్వానికి తెలియజేశారు. అయితే, మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చూసేందుకు అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జాతీయస్థాయిలో ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై స్పందించిన అన్నామలై, మరో రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ , తదుపరి రాజకీయ అడుగులపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, ఆయన ఒక నూతన ప్రాంతీయ పార్టీని లేదా జాతీయ భావజాలంతో కూడిన ఉద్యమాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
No comments:
Post a Comment