- బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా అవగాహన ఒప్పందంపై అధికారిక సంతకాలు
- గల్ఫ్ యుద్ధానికి స్వస్తి పలికే మెగా దౌత్య పర్వానికి ముస్తాబవుతున్న స్విస్ వేదిక!
అమెరికా , ఇరాన్ దేశాల మధ్య పశ్చిమాసియా భీకర యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికే చరిత్రాత్మక అవగాహన ఒప్పందం అధికారిక సంతకాల వేదిక ఖరారైంది. అంతర్జాతీయ దౌత్య రంగానికి అత్యంత నమ్మకమైన చిరునామాగా నిలిచే స్విట్జర్లాండ్ దేశం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. జూన్ 19వ తేదీ శుక్రవారం నాడు స్విట్జర్లాండ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, సుందరమైన ‘బర్గెన్‌స్టాక్’ (Burgenstock) రిసార్ట్‌లో ఈ అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద సంతకాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతోందని స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారంఅధికారికంగా ప్రకటించింది. కొన్నిరోజులుగా ఈ దౌత్యపరమైన వేదికపై అంతర్జాతీయ మీడియాలో రకరకాల ఊహాగానాలు రాగా.. వాటన్నింటికీ తెరదించుతూ స్విస్ ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటనను వెలువరించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన 15 వారాల గల్ఫ్ సంక్షోభాన్ని ముగించడంలో, చమురు రవాణాకు ఆయువుపట్టైన హార్ముజ్ జలసంధిని తిరిగి అంతర్జాతీయ నౌకల కోసం తెరిపించడంలో ఈ అవగాహన ఒప్పందం అత్యంత కీలకమైన మైలురాయిగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వాషింగ్టన్ దౌత్య ప్రతినిధులు, టెహ్రాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ శాంతి పత్రాలపై బర్గెన్‌స్టాక్ వేదికగా సంతకాలు చేయనున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయడానికి , ఇరు దేశాల రక్షణ ప్రతినిధులకు అత్యున్నతస్థాయి భద్రతతో కూడిన నిష్పాక్షిక వాతావరణాన్ని కల్పించడానికి స్విస్ విదేశాంగ శాఖ ఇప్పటికే అన్నిరకాల పరిపాలనాపరమైన, రక్షణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
గతంలో కూడా అనేక అంతర్జాతీయ శాంతి చర్చలకు, వివాదాల పరిష్కారాలకు వేదికగా నిలిచిన చరిత్ర బర్గెన్‌స్టాక్ పర్వత రిసార్ట్‌కు ఉంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం కుదిరిన తర్వాత.. ఇరాన్ అణు కార్యక్రమాల పరిమితులు, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల శాశ్వత రద్దు ,ఫ్రీజ్ చేసిన ఇరాన్ అంతర్జాతీయ ఆస్తుల బదిలీ వంటి అత్యంత సంక్లిష్టమైన రక్షణ అంశాలపై ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు సుదీర్ఘ సాంకేతిక చర్చలు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్, కతార్ వంటి దేశాల తెరవెనుక మధ్యవర్తిత్వంతో సాధ్యమైన ఈ అంతర్జాతీయ దౌత్య విజయం.. జూన్ 19న స్విట్జర్లాండ్ వేదికగా అధికారిక చట్టరూపం దాల్చబోతుండటంతో యావత్ అంతర్జాతీయ సమాజం ఈ చరిత్రాత్మక రోజు వైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
No comments:
Post a Comment