- కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
- 21 ఏళ్ల లంక రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా వండర్ కిడ్
- 29 బంతుల్లో 94 పరుగులతో దంబుల్లాలో సునామీ ఇన్నింగ్స్
- సచిన్ 36 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొడుతూ భారత జట్టుకు ఎంపిక!
ట్రై-నేషన్ సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో చోటుచేసుకున్న చేదు అనుభవాలకు, మైదానంలో జరిగిన గొడవకు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తోనే అత్యంత భీకరమైన సమాధానం ఇచ్చాడు. నాడు సూపర్ ఓవర్ ఉత్కంఠలో భారత్ ఓడిపోయిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లతో జరిగిన ఘర్షణ క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. సూర్యవంశీ ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సరైన సమయం కోసం వేచి చూసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, లంకతో ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "100" అని రాసి సవాల్ విసిరాడు. మైదానంలోకి దిగిన తర్వాత పూర్తి ప్రతికారేచ్ఛతో ఊగిపోతూ కేవలం 29 బంతుల్లోనే 8 సిక్సర్లు, 10 ఫోర్ల సహాయంతో 94 పరుగులు చేసి శ్రీలంక ‘ఎ’ బౌలింగ్ విభాగాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా లిస్ట్-ఎ (List A) క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. తద్వారా శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే పేరిట 21 ఏళ్లుగా ఉన్న 12 బంతుల రికార్డును సూర్యవంశీ తిరగరాశాడు.
భారత ‘ఎ’ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ టీనేజ్ సంచలనానికి ఇది తొలి అర్ధశతకం కావడం విశేషం. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఫిఫ్టీ మార్కును దాటిన సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. అయితే, ఇన్నింగ్స్ 9వ ఓవర్లో శ్రీలంక ‘ఎ’ కెప్టెన్ సహన్ అరాచిగే బౌలింగ్‌లో అవుట్ కావడంతో కేవలం 6 పరుగుల దూరంలో ప్రపంచ రికార్డు సెంచరీని , తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్న 100 పరుగుల లక్ష్యాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అయినప్పటికీ, అతని ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టించింది.
ఈ అద్భుత ప్రదర్శనకు ముందే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు 2026 కోసం ప్రకటించిన భారత పురుషుల టీ20 (T20I) జట్టులో ఈ యువ ఆటగాడికి తొలిసారిగా స్థానం దక్కింది. కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట 36 ఏళ్లుగా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 1989లో పాకిస్తాన్‌పై తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. రాబోయే పర్యటనలో సూర్యవంశీ కనుక తుది జట్టులో ఆడితే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రికార్డును తన సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం భారత టీ20 క్రికెట్‌లో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), వన్డేల్లో సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 238 రోజులు) పేరిట ఉన్న అత్యంత యువ ఆటగాళ్ల రికార్డులను సూర్యవంశీ తిరగరాయడానికి సిద్ధమయ్యాడు.
No comments:
Post a Comment