- మహిళలను కించపరిచే స్క్రిప్టులను తిరస్కరించాలంటూ యువ నటీనటులకు పిలుపు
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో మహిళలను కేవలం ఒక గ్లామర్ వస్తువులా (ఆబ్జెక్టిఫికేషన్) చూపించారంటూ వస్తున్న విమర్శలపై బాలీవుడ్ సీనియర్ నటి, ఒకప్పటి ‘ఆషికీ’ స్టార్ అను అగర్వాల్ స్పందించారు. వెండితెరపై మహిళా పాత్రలను గౌరవప్రదంగా చూపించాల్సిన అవసరం ఉందన్న ఆమె, సినిమా పరిశ్రమలో తన పాత రోజులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం దర్శకులు, ప్రేక్షకులపైనే కాకుండా.. కథలను ఎంచుకునేటప్పుడు నటీనటులపై కూడా అంతే సమానంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు అను అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పాత ఫోటోలను పంచుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చలు, తాను మూడు దశాబ్దాల కిందట సినిమా పరిశ్రమలో తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయాన్ని గుర్తుకు తెచ్చాయని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో మహిళా పాత్రలకు మరింత గౌరవం ఇవ్వాలని గళమెత్తుతున్న నేటి తరం ప్రేక్షకులను ఆమె మనస్ఫూర్తిగా అభినందించారు. అయితే ఈ బాధ్యత కేవలం ప్రేక్షకులు లేదా దర్శకులది మాత్రమే కాదని, నటీనటులది కూడా అని స్పష్టం చేశారు. దాదాపు 30 ఏళ్ల కిందట ‘ఆషికీ’ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత, తాను సంతకం చేసే ప్రతి సినిమా కథను ముందే పూర్తిగా వినాలనే నియమం పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఆ రోజుల్లో సినిమాల్లో మహిళలను ఒక వస్తువులా చూపించడం సర్వసాధారణంగా ఉండేదని, కానీ తాను ఆ సంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను చేసిన సినిమాలే అందుకు నిదర్శనమని, చివరికి తాను చిత్ర పరిశ్రమకు దూరం కావడానికి కూడా ఒక రకంగా ఈ ఆలోచనా విధానమే ప్రధాన కారణమని ఆమె వివరించారు.
https://www.instagram.com/p/DZRX6xWCJRJ/?utm_source=ig_web_button_share_sheet
నేటి తరం యువ నటీనటులకు అను అగర్వాల్ ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ఏ సినిమా ఒప్పుకునే ముందైనా కథను పూర్తిగా వినాలని, పాత్రల ప్రాధాన్యంపై దర్శకులను ప్రశ్నలు అడగాలని సూచించారు. ఒకవేళ ఆ పాత్ర లేదా కథ మానవ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉంటే, నిర్మొహమాటంగా ‘నో’ చెప్పే ధైర్యాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రేక్షకులు మంచి చిత్రాలను డిమాండ్ చేసినప్పుడు మాత్రమే కాదు, నటీనటులుగా తాము నమ్మని, ఇష్టం లేని విషయాలలో భాగస్వాములు కాబోమని తిరస్కరించినప్పుడు కూడా కథల్లో మార్పు వస్తుందని అను అగర్వాల్ బలంగా ఆకాంక్షించారు.
No comments:
Post a Comment