- అసలైన తృణమూల్ మాదే
- రెబెల్ నేత రితబ్రతపై మమతా బెనర్జీ వ్యూహాత్మక ఎదురుదాడి
- తిరిగి కాళీఘాట్‌కు క్యూ కడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలో మొదలైన అంతర్గత పోరు ఇప్పుడు ‘అసలైన తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది?’ అనే స్థాయికి చేరుకుంది. 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 60 మంది మద్దతు తనకే ఉందంటూ కొత్తగా అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన రెబెల్ నాయకుడు రితబ్రత బెనర్జీ, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని కేవలం ఒక ‘సలహాదారు’ పాత్రకే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత రితబ్రత తిరుగుబాటు సజావుగానే సాగినట్లు కనిపించినప్పటికీ, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నమ్మకంగా ఉన్న అసలైన లాయలిస్ట్ వర్గం వ్యూహాత్మక ఎదురుదాడికి తెరలేపింది.
ఈ సంక్షోభాన్ని తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ వర్గం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటగా, రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఇది పార్టీ అధినాయకత్వానికి అంతర్గతంగా పుంజుకోవడానికి తగిన సమయాన్ని ఇస్తుంది. ఇక రెండో వ్యూహంలో భాగంగా, అసంతృప్త రెబెల్ నేతలతో రాయబారాలు నడుపుతూ వారిని తిరిగి సొంత గూటికి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ వ్యూహం ఇప్పటికే పలించిందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శోభన్ దేబ్ ఛటర్జీ ‘ఎన్డీటీవీ’తో పేర్కొన్నారు. రితబ్రతను అనుసరించి ‘న్యూ తృణమూల్’ (కొత్త తృణమూల్) నినాదాన్ని ఎత్తుకున్న చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మనసు మార్చుకుని, కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసమైన కాళీఘాట్‌కు నిరంతరం ఫోన్లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. తాము తిరిగి పాత తృణమూల్ గూటికి వచ్చేస్తామని కోరుతున్నారని చెప్పారు. అలాగే రితబ్రత బెనర్జీ స్పీకర్‌కు సమర్పించిన 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల సంతకాల జాబితా ఫోర్జరీ అని, దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తమ వైపు ప్రస్తుతం 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ క్యాంపులో కూడా అప్పుడే అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయి. మమతా బెనర్జీని కేవలం ‘గైడ్’ లేదా ‘సలహాదారు’గా మార్చి ఆమెను రాజకీయ సన్యాసంలోకి నెట్టాలనే రితబ్రత ఆలోచనను పంచ్లా టీఎంసీ ఎమ్మెల్యే గుల్షన్ మల్లిక్ తీవ్రంగా వ్యతిరేకించారు. మమతా బెనర్జీయే తమ శాశ్వత నాయకురాలని, ఆమె నాయకత్వం విషయంలో ఎలాంటి రాజీ లేదని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. అయితే రితబ్రత బెనర్జీ మాత్రం ఎంటల్లీ ఎమ్మెల్యే సందీపన్ సాహా నివాసంలో జావేద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ వంటి నేతలతో కలిసి సమావేశమై, తమ వైపు మరికొంత మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారని, ఆ సంఖ్య ఎక్కడికి చేరుతుందో వేచి చూడాలని సవాల్ విసిరారు.
ఈ అస్తిత్వ సంక్షోభం ఎదురైనప్పటికీ మమతా బెనర్జీకి పార్టీ అగ్రనేతల మద్దతు గట్టిగానే ఉంది. శుక్రవారం ఆమె కాళీఘాట్ నివాసంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ, మదన్ మిత్ర వంటి కీలక నేతలు హాజరయ్యారు. ఈ అసంతృప్తి అంతా మమతపై కాదని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ శైలిపైనేనని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పార్టీ మాత్రం ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పూర్తిస్థాయిలో సమర్థిస్తోంది. అలాగే పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలిగా చంద్రిమా భట్టాచార్యను, మహిళా విభాగానికి మాలా రాయ్‌ను నియమించారు. కాగా, దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారనే వార్తలు , బెంగాల్‌లో తృణమూల్ అవినీతిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో, ఈ అంతర్గత అసమ్మతి వెనుక అధికార బీజేపీ హస్తం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
No comments:
Post a Comment