Monday, 27 July 2026

‘సార్క్’ పునరుద్ధరణే ప్రాంతీయ శాంతికి మార్గం



  • మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ పిలుపు

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్)ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, సభ్యదేశాలన్నీ తమ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ పిలుపునిచ్చారు. మాల్దీవుల 61వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 43 దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 113 మంది దౌత్యవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం సార్క్ ఎదుర్కొంటున్న స్తబ్దతను తొలగించడానికి, ప్రాంతీయ శాంతి, సహకారాన్ని పెంపొందించడానికి సభ్యదేశాలన్నీ తిరిగి చర్చల పట్టిక వద్దకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా మాల్దీవులు సిద్ధంగా ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం సైతం తమ వివాదాలను శాంతియుత మార్గంలోనే పరిష్కరించుకోవాలని తమ దేశ విదేశాంగ విధానాన్ని వివరిస్తూ ఉద్ఘాటించారు.


మరోవైపు ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ కూడా సార్క్ వేదికగా దక్షిణాసియా దేశాల మధ్య సహకారం పెరగాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించింది. సార్క్‌ను క్రియాశీలకం చేయడానికి బలమైన అమలు సామర్థ్యం, ఆర్థిక బలం, సమర్థవంతమైన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ పేర్కొన్నారు. సభ్యదేశాలతో చర్చించి త్వరలోనే ఉన్నతాధికారుల సమావేశం, అలాగే ప్రత్యేక మంత్రివర్గ సమాలోచనలు నిర్వహించే దిశగా బంగ్లాదేశ్ యోచిస్తోందని వెల్లడించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక సభ్యదేశాలుగా ఉన్న ఈ సార్క్ కూటమి, ఆర్థిక ప్రగతి , ప్రాంతీయ వికాసం లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ.. పాకిస్తాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాద చర్యల కారణంగా గత కొన్నేళ్లుగా ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయింది.

No comments:

Post a Comment

Featured post

పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం

లోక్‌సభలో సవరణ బిల్లు ప్రవేశం..  మంగళవారం విస్తృత చర్చకు అన్ని పార్టీల అంగీకారం నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వరుసగా ఆరు రోజులుగా పా...