Thursday, 23 July 2026

మన సమాధానం పువ్వులు మాత్రమే కావాలి


  • జంతర్ మంతర్ వద్ద హింసను ఖండిస్తూ సోనమ్ వాంగ్‌చుక్ శాంతి పిలుపు


నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ అక్రమాలపై దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపడుతున్న ఆందోళన 26వ రోజుకు చేరుకున్న సందర్భంలో, ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన మద్దతుదారులకు, నిరసనకారులకు అత్యంత ఆవేదనతో శాంతియుత పిలుపునిచ్చారు. ఈ శాంతియుత ప్రజా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కొన్ని అసాంఘికశక్తులు ప్రయత్నిస్తున్నాయనే ఆందోళనల మధ్య, ఆయన గాంధేయ మార్గంలో హింసకు తావులేకుండా నిరసనలు సాగించాలని మరోసారి స్పష్టం చేశారు.  ప్రధాన నిరసన ప్రదేశం వెలుపల కొన్ని అసాంఘికశక్తులు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలను రేకెత్తించడానికి, అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయనే వార్తలపై వాంగ్‌చుక్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా సంపూర్ణ నిగ్రహాన్ని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. 



ఈ మేరకు ఆయన 'ఎక్స్' (X) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "26వ రోజు: శాంతి, కేవలం శాంతి ఒక్కటే నా మార్గం! జంతర్ మంతర్ వద్ద నిరసనలు శాంతియుతంగా జరుగుతుంటే, బయట కొందరు అసాంఘికశక్తులు ఈ అవకాశాన్ని వాడుకుని హింసను ప్రేరేపిస్తున్నారని తెలిసి తీవ్రంగా బాధపడ్డాను. ఎదుటివారు ఏది చేసినా, మన సమాధానం కేవలం పువ్వులు మాత్రమే కావాలి. ఏది ఏమైనా ఈ శాంతియుత సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు.  సఫ్రదర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించిన అనంతరం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. 25 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష వల్ల ఆయన 11 కిలోల బరువు తగ్గినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన కట్టుబాటు మారలేదని తెలిపారు. 'చలో సంసద్' ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన లేదా కక్షసాధింపు హెచ్‌ఐఆర్‌లు (FIRs), అరెస్టులు ఉండవని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే తాను దీక్ష విరమిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులపై బలప్రయోగానికి దిగవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, హామీ లభిస్తే వెంటనే దీక్ష విరమించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

విద్యార్థుల ఆందోళనకు మురళీ మనోహర్ జోషి మద్దతు

  పోలీసుల బలప్రయోగంపై బీజేపీ సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన బాట పట్ట...