హైదరాబాద్: ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొస్తామని, వచ్చే ఎన్నికల్లో అదే మెట్రోలో ప్రయాణించి వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తాను గతంలో ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీకి మెట్రో అవసరంపై అసదుద్దీన్ ఒవైసీ గతంలో లేవనెత్తిన ప్రశ్న నూటికి నూరు శాతం సరైనదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘మెట్రో రైలు మొత్తం న్యూ సిటీలో నిర్మించారు. మరి ఓల్డ్ సిటీలో రోజూ పనులకు వెళ్లే మన ముస్లిం సోదరులకు మెట్రో అవసరం లేదా? మేము మెట్రో ఎక్కకూడదా?’’ అని అసద్ సాబ్ అడిగారని గుర్తుచేశారు.ఆ ప్రశ్న తనను ఆలోచింపజేసిందని, అందుకే అప్పుడే తాను స్పందించానని సీఎం తెలిపారు. ‘‘సాబ్.. డబ్బులు నేను ఇస్తాను. రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాలను ఇప్పించే బాధ్యత మీది’’ అని తాను చెప్పినట్లు వెల్లడించారు.
మెట్రో పనులకు అవసరమైన 900 ఆస్తుల్లో ఇప్పటికే 850 ఆస్తులను ఇప్పించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా 50 ఆస్తులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ మంత్రికి సూచించినట్లు వెల్లడించారు.‘‘వెళ్లి అసద్ సాబ్‌తో మాట్లాడి ఆ 50 ఆస్తులను కూడా క్లియర్ చేయించండి. ఎంత డబ్బులు అడిగినా ఇచ్చేయండి’’ అని తాను చెప్పినట్లు సీఎం వివరించారు.
డిసెంబర్‌లో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పనులు సజావుగా సాగి, ప్రజల సహకారం లభిస్తే రెండున్నరేళ్లలో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో అదే మెట్రో రైలులో ప్రయాణించి వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఓట్లు అడుగుతాం. ఆ మాటకు నేను ఈ రోజుకీ కట్టుబడి ఉన్నాను. అందుకే పట్టుబట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
No comments:
Post a Comment